సాక్షి, విశాఖపట్నం/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విలువలు, విశ్వసనీయత గురించి మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి(అవంతి) శ్రీనివాసరావు విమర్శించారు. కేవలం విలువల కోసం పార్టీ మారిన తనను విమర్శించే స్థాయి, అర్హత మంత్రి గంటాకు లేదని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ‘అవంతి’ శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో చేరిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరిన తర్వాత తొలిసారిగా శనివారం విశాఖ చేరుకున్న అవంతి విశాఖ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. నమ్మిన నాయకులను, నమ్మిన పార్టీలను నట్టేట ముంచి రాజకీయ ప్రాపకం కోసం పాకులాడే మంత్రి గంటాకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. ‘గత ఎన్నికలకు ముందు భీమిలి టికెట్ ఇప్పిస్తానని చెప్పి టీడీపీలోకి తీసుకెళ్లి చివరికి నన్ను అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించి.. ఆ టికెట్ కాజేసిన నీచ రాజకీయం నీది.. నీ సహచర మంత్రి అయ్యన్నపాత్రుడే నీ మీద సిట్ విచారణ వేయాలని లెటర్ రాశాడంటేనే నీ అవినీతి, అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. లోకేష్.. గంటాతో జాగ్రత్తగా ఉండు.. ఎప్పటికైనా మీ నాన్న కుర్చీకి ఎసరు పెడతాడు..’ అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
జగన్‌ను తిడితే చాలు.. టీడీపీలో పెద్ద పీట
‘ఏ ముఖ్యమంత్రి అయినా ఉదయమే ఫోన్ చేసి రాష్ట్ర అభివృద్ధి గురించో.. సంక్షేమ పథకాల గురించో మాట్లాడతారు.. కానీ చంద్రబాబు మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులను తిట్టండని చెప్పే వాడని’ అవంతి చెప్పారు. ప్రజాసంకల్పయాత్రకు ముందు జగన్‌మోహన్‌రెడ్డి వేరని, ప్రజాసంకల్పయాత్రలో ప్రతి కార్యకర్త పేరు పిలిచి వారి సమస్యలు తెలుసుకున్న ఏకైక నాయకుడని కొనియాడారు. ఇప్పుడు కూడా తాను ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరాలన్నారంటే.. అది విలువలతో కూడిన రాజకీయమని.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే అది సాధ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
భారీ ర్యాలీ..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం తొలిసారిగా శనివారం సాయంత్రం విశాఖ వచ్చిన అవంతి ఎయిర్‌పోర్టు నుంచి పెద్ద ఎత్తున కార్లు, బైకులతో భారీ ర్యాలీగా భీమిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న సింహాచలం చేరుకున్నారు. కొండదిగువ తొలిపావంచా వద్దనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం భీమిలి వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment