ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్:
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎక్కువ శాతం ఖాళీగా కనిపించాయి. కొన్నిచోట్ల వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. మరికొన్నిచోట్ల మొక్కుబడిగా ఒక గంట తెరిచి మూతవేశారు. ఇంకొన్నిచోట్ల మధ్యాహ్న భోజనం వరకు వాటిని కొనసాగించి తలుపులు వేసేశారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ‘న్యూస్‌లైన్’ నిర్వహించిన విజిట్‌లో మెజార్టీ అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడి ఉన్నాయి. అందుకు కారణాలు ఆరాతీస్తే బూత్ లెవల్ ఆఫీసర్లుగా విధులు నిర్వర్తించడానికి వెళ్లారని కొందరు, ఇంకొందరు క్రిస్మస్ పండుగ ఉండటంతో పిల్లలు రాక మూతవేశామని చె ప్పుకొచ్చారు.
జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 21 ఐసీడీఎస్ ప్రాజెక్టులు, వాటి పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 235 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 32,176 మంది గర్భిణులు, 36,226 మంది బాలింతలున్నారు. నవంబర్ 1 నుంచి అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే సేవలను పొడిగించారు. అంతకు ముందు వరకు రోజూ పౌష్టికాహారం అందించడంతోపాటు అదనపు పౌష్టికాహారం కింద వారంలో రెండు రోజులు కోడిగుడ్లు ఇచ్చేవారు. నవంబర్ 1 నుంచి అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని
అమలు చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులపాటు కోడిగుడ్లు ఇస్తున్నట్లు ప్రకటించినప్పటికీ కోడిగుడ్లు సరఫరా కాకపోవడంతో ఆ ఊసే ఉండటం లేదు. కొన్నిచోట్ల మురిగిపోయిన కోడిగుడ్లు ఇస్తున్నారు. వాటిని ఇళ్లకు తీసుకువెళ్లిన గర్భిణులు, బాలింతలు చెత్తకుప్పల్లో పడవేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30గంటల వరకు కేంద్రాలను తెరిచి ఉంచాలని మహిళా శిశు సంక్షేమశాఖ డెరైక్టరేట్ నుంచి ఆదేశాలు అందాయి. జిల్లాలో ఎక్కడా అంగన్‌వాడీ కేంద్రాల్లో సమయ పాలన పాటించలేదు.
ఒంగోలు నియోజకవర్గ పరిధిలో అర్బన్, రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. ఒంగోలు అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 130 అంగన్‌వాడీ కేంద్రాలు, 4 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఒంగోలు రూరల్ ప్రాజెక్టు పరిధిలో 210 అంగన్‌వాడీ కేంద్రాలు, 4 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఒంగోలు అర్బన్ ప్రాజెక్టులో మెజార్టీ కేంద్రాలు మధ్యాహ్నానికే మూతపడ్డాయి. కొన్ని కేంద్రాల తలుపులే తెరుచుకోలేదు. మధ్యాహ్న భోజన పథకం కూడా కొన్ని కేంద్రాలకే పరిమితమైంది. రిజిస్టర్‌లో మాత్రం చిన్నారుల వివరాలు నమోదు చేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.
కందుకూరు నియోజకవర్గ పరిధిలో కూడా అంగన్‌వాడీ కేంద్రాలు ఎక్కువగా మూతపడే ఉన్నాయి. కేంద్రాలు తెరిచినచోట చిన్నారుల సంఖ్య పదికి మించకపోవడం విశేషం. కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది. కొన్ని కేంద్రాల్లో కోడిగుడ్లను అందిస్తూ మమ అనిపించేస్తున్నారు. మధ్యాహ్న భోజనం పరిస్థితి కూడా ఇదేవిధంగా ఉంది. కాగితాలపైనే పౌష్టికాహారం కనిపిస్తోంది.
సంతనూతలపాడు నియోజకవర్గ పరిధిలో అంగన్‌వాడీ కేంద్రాలు ఎక్కువగా మూతపడ్డాయి. అందుకు కారణం ఎక్కువ మంది అంగన్‌వాడీలకు బూత్‌లెవల్ ఆఫీసర్ల విధులు కేటాయించడమే. కార్యకర్తలు లేకపోవడంతో ఆయాలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించలేదు. మొక్కుబడిగా తలుపులు తెరవడం, చిన్నారులు రాలేదన్న సాకుతో మూసివేశారు.
చీరాల నియోజకవర్గంలో కూడా అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అనేకచోట్ల చిన్నారులు హాజరు కాకపోయినా వచ్చినట్లు రిజిస్టర్‌లో నమోదు చేయడం విశేషం. పౌష్టికాహారం పంపిణీ కూడా కాగితాలపైనే కనిపించింది. కోడిగుడ్ల ఊసే లేదు. అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడటంతో హక్కుదారులు ఇబ్బంది పడ్డారు.
కొండపి నియోజకవర్గ పరిధిలో కోడిగుడ్ల సరఫరా దాదాపు నెలరోజుల నుంచి నిలిచిపోయింది. మధ్యాహ్న భోజనం కూడా అంతంత మాత్రంగానే ఉంది. హాజరు పట్టీలో మాత్రం నూరుశాతం చిన్నారులు హాజరైనట్లు చూపించడం గమనార్హం. అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఒంగోలు నుంచి అధికారులు రాకపోకలు సాగించడం కూడా కేంద్రాలపై ప్రభావం చూపుతోంది.
అద్దంకిలో అంగన్‌వాడీ కేంద్రాల సమయపాలనకు మంగళం పాడేశారు. కొంతమంది అంగన్‌వాడీ కార్యకర్తలు తమ ఇంటిలోని కొంత భాగాన్ని కేంద్రంగా మార్చడం గమనార్హం. ఎక్కువ మంది బూత్ లెవల్ ఆఫీసర్లుగా ఉండటంతో కేంద్రాలు మూతపడ్డాయి. ఆయాలు కేంద్రాల నిర్వహణ వదిలేశారు.
దర్శి నియోజకవర్గ పరిధిలోని ఎక్కువ కేంద్రాల్లో మురిగిపోయిన కోడిగుడ్లు వస్తున్నాయి. వాటిని తీసుకునేందుకు ఎక్కువ మంది గర్భిణులు, బాలింతలు వెనకాడుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఇచ్చిన కుర్చీలు విరిగిపోయాయి. దాంతో చిన్నారులు నేలపైనే కూర్చుంటున్నారు. నీటివసతి లేకపోవడంతో మధ్యాహ్న భోజనం కూడా సక్రమంగా అమలు కావడం లేదు.
గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఎక్కువగా పారిశుధ్యం లోపించడం విశేషం. కేంద్రాలకు సమీపంలో పందులు తిరుగాడుతూ ఉన్నాయి. రోజూ అవి అక్కడే ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ తమ పిల్లలు అనారోగ్యం బారిన పడతారోనని కేంద్రాలకు పంపించడం మానేస్తున్నారు.
కనిగిరి నియోజకవర్గ పరిధిలో మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు కావడం లేదు. కొన్నిచోట్ల గర్భిణులు, బాలింతలు మధ్యాహ్న భోజనానికి అవసరమైన రా మెటీరియల్‌ను ఇళ్లకు తీసుకువెళుతున్నారు. ఇంకొంతమంది మధ్యాహ్న భోజనాన్ని కేంద్రాల వద్ద తినకుండా ఇళ్లకు తీసుకెళ్తున్నారు. దీంతో మధ్యాహ్న భోజన పథకం ఉద్దేశం నీరుగారిపోతోంది.
మార్కాపురం నియోజకవర్గంలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. అర్బన్ ప్రాజెక్టులో మొక్కుబడిగా నిర్వహిస్తుండగా, రూరల్ ప్రాజెక్టులో అమృత హస్తం పథకానికి సంబంధించిన బిల్లులు మూడు నెలల నుంచి పెండింగ్‌లో ఉండటంతో నిర్వహణ కష్టతరంగా మారింది. కోడిగుడ్ల సరఫరా కూడా సక్రమంగా లేదు.
పర్చూరు నియోజకవర్గ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో సమయపాలన పూర్తిగా లోపించింది. మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు కావడం లేదు. కోడిగుడ్ల సరఫరా అస్తవ్యస్తంగా ఉంది. పర్యవేక్షించాల్సిన అధికారులు స్థానికంగా ఉండకపోవడం కూడా కేంద్రాల నిర్వహణపై ప్రభావం చూపుతోంది.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో అంగన్‌వాడీ కేంద్రాలు ఎక్కువగా మూత పడ్డాయి. కేంద్రాలు మూతపడి ఉండటంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం, కోడిగుడ్ల సరఫరా నిలిచిపోయింది. కొన్నిచోట్ల పౌష్టికాహారం, కోడిగుడ్లను ఇళ్లకు ముందుగానే అందించేశారు. మధ్యాహ్న భోజనం మాత్రం అనేకచోట్ల నిలిచిపోయింది.
అంగన్‌వాడీ కి తాళాలు
Published Wed, Dec 25 2013 4:54 AM | Last Updated on Sat, Jun 2 2018 8:39 PM
Advertisement
Advertisement