అన్నిటికీ దిక్కు... జీతాలే చిక్కు
Published Tue, Jan 28 2014 3:26 AM | Last Updated on Fri, Mar 22 2019 2:57 PM
పాలమూరు, న్యూస్‌లైన్ : ఊళ్లో ఏ సర్వే చేపట్టాలన్నా.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలను ఒక్కచోట చేర్చాలన్నా.. అంగన్‌వాడీ కార్యకర్త లే దిక్కయ్యారు.. సర్కారు అన్ని పనులకు వినియోగిస్తూ తమతో అడ్డమైన చాకిరీ చేయిస్తున్నా.. కనీస వేతనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం జిల్లాలోని అంగన్‌వాడీ కార్యకర్తలకు ఇబ్బం దిగా మారింది. అంగన్‌వాడీ ఉద్యోగ నియామకాల సమయంలో సిబ్బందికి చెబుతున్న జాబ్‌చార్ట్‌కు, నియమితులైన తర్వాత చేయిస్తున్న పనులకు పొంతన లేకుండా పోతోంది.
వాస్తవానికి చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యాబోధన, పౌష్టికాహార పంపిణీ, చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం పనిచేయడమే అంగన్‌వాడీల విధులు, అయితే.. ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలోనూ అంగన్‌వాడీలను భాగస్వామ్యం చేస్తోంది. కాదూ కూడదంటే ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తోంది. చివరకు రాజకీయ పార్టీల కార్యకర్తలు చేయాల్సిన పనిని కూడా వీరికే అప్పగిస్తున్నారు. ఓటరు జాబితా తయారీ, ఓటరు కార్డుల పంపిణీ, ఇంటింటా సర్వే వంటి అనేక ఇతర పనులను వారితో చేయిస్తున్నారు. ఈ కార్యకర్తలు, ఆయాలు కనీస వేతనాలకు నోచుకోవడం లేదు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణతోపాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నా.. వీరి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. అరకొర వేతనాలిస్తూ వెట్టిచాకిరీ చేయించుకొంటోంది. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం తరచూ ఆందోళనలు చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడంలేదు. జిల్లాలో 4,423 అంగన్‌వాడీ, 605 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. 4,423 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 605 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, 4వేల మంది ఆయాలు (హెల్పర్లు) పని చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 3-5 ఏళ్లలోపు చిన్నారులకు పూర్త ప్రాథమిక విద్యను కూడా బోధిస్తున్నారు. వీటితోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు. అయితే.. వీరికి అందుతున్న వేతనాలు నామమాత్రమే. గౌరవ వేతనం పేరిట ప్రభుత్వం అరకొరగా విదుల్చుతోంది.
అమలుకాని సుప్రీం కోర్టు ఆదేశాలు
పదేళ్ల సర్వీసును పూర్తిచేసుకున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.4263,అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారికి రూ.4231, కొ త్తగానియమితులైనవారికిరూ.4200,ఆయాలకు రూ.2200 చొప్పున వేతనాలు చెల్లిస్తోంది. మినీ అంగన్‌వాడీ కార్యకర్తల పరిస్థితి మరింత దయనీయం. ప్రధాన కేంద్రాల్లో ప నిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా రూ.2,200 మాత్రమే ఇస్తోంది.
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం రూ.12వేలు తగ్గకుండా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా దాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. అంగన్‌వాడీలతో ఇతర పనులు చేయించ కూడదని ఉత్తర్వులు వచ్చాయి. అ యితే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది కొరతవల్ల అంగన్‌వాడీల సేవలనుఉపయోగించుకుంటున్నామని సం బంధిత అధికారులు చెబుతున్నారు.వేతనాలు తక్కువ అం దుతుండటం వాస్తవమే అయితే.. వేతనాలు పెంచుతూ ప్ర భుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలని వారు పేర్కొన్నారు.
నిర్వీర్యమవుతున్న వ్యవస్థ
అంగన్‌వాడీల బలోపేతానికి కృషిచేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్‌వాడీ వ్యవస్థను తొలగించి పౌష్టికాహారం అందించే బాధ్యతలను స్వచ్చంద సంస్థలకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజలు, అంగన్‌వాడీల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతానికి వెనకడుగు వేస్తోందని సమాచారం.
Advertisement
Advertisement