అంగన్‌వాడీ కేంద్రంలో ఆట వస్తువులు లేక కుర్చీలో ఆడుకుంటున్న పిల్లలు (ఫైల్)
అడ్డాకుల : అంగన్‌వాడీ కేంద్రాలు అసౌకర్యాల నిలయాలుగా మారుతున్నాయి. కేంద్రాలకు సరైన భవనాలు లేక చాలాచోట్ల అద్దె భవనాలే దిక్కయ్యాయి. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ వారిలో సృజనాత్మకత పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల లక్ష్యం నెరవేరడంలేదు. చిన్నారుల భవితవ్యాన్ని తీర్చిదిద్దాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి.
అన్నీ అరకొర వసతులే
మండలంలో 38 అంగన్‌వాడీ కేం ద్రాలు ఉండగా వాటిలో రెండు మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింత లు కలిపి 1500 మంది వరకు ఉంటారు. అయితే ప్రధానంగా భవనాల సమస్య అంగన్‌వాడీ కేంద్రాలను వేధిస్తోంది. అద్దె భవనాలు, పురాతన ప్రభుత్వ భవనాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా వినియోగిస్తున్నారు. కేవలం 14 అంగన్‌వాడీ కేం ద్రాలు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన వాటిలో ఆరిం టిని అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. అడ్డాకుల3వ కేంద్రం, తిమ్మాయిపల్లి తండా, పెద్దమునుగల్‌ఛేడ్ గ్రామాల్లో 1వ కేంద్రాలు, దుబ్బపల్లి, కందూర్ 2వ కేంద్రం, పొన్నకల్ 3వ కేంద్రాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నారు. వీటికి నెలకు ఒక్కో కేంద్రానికి రూ.350 నుంచి రూ.500 వరకు అద్దె చెల్లిస్తున్నారు.
పాత భవనాల్లో 18 కేంద్రాలు..!
గ్రామాల్లో పాఠశాల భవనాలు, ఇతర కార్యాలయాలను అంగన్‌వాడీ కేంద్రాలుగా కొనసాగిస్తున్నారు. అడ్డాకుల 4వ కేంద్రం, గుడిబండ 2వ కేంద్రం, చిన్నమునుగల్‌ఛేడ్, పెద్దమునుగల్‌ఛేడ్ 2వ కేంద్రం, రాంచంద్రాపూర్, కాటవరం, కాటవరం తండా, తిమ్మాయిపల్లి తండా 2వ కేంద్రం, కందూర్ 4,5వ కేం ద్రాలు, చౌడాయపల్లి, సుంకరాంపల్లి, వడ్డెపల్లి, గౌరిదేవిపల్లి, పొన్నకల్ 2వ కేంద్రం, రాచాల 1,2వ కేం ద్రాలు ఇతర భవనాల్లో ఉన్నారు. వీటిలో కొన్నింటిని పాఠశాలల్లో కొనసాగిస్తున్నారు.
ఆటలకు దూరం
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేళ్ల చిన్నారులకు ఆట వస్తువులు చూపి వారిని ఆకట్టుకునే విధంగా చేయాలి. కానీ చాలా కేంద్రాల్లో పిల్లలు ఆడుకోవడానికి వస్తువులు పూర్తి స్థాయిలో లేవు. కొన్ని కుర్చీలు, ఒకటి, రెండు ఆట వస్తువులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. వాటితోనే పిల్లలు ఆడుకోవాల్సి వస్తోంది. దీంతో చాలా కేంద్రాల్లో పిల్లలు మధ్యాహ్నం వరకే కేంద్రాల్లో ఉంటున్నారు. తర్వాత తల్లిదండ్రులు వారిని ఇంటికి తీసుకెళ్తున్నారు. చాలా కేంద్రాల్లో మరుగుదొడ్లు అందుబాటులో లేవు. అంగన్‌వాడీ పిల్లలు ఒంటికి, రెంటికి ఆరుబయటకే వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. తాగునీటికి సరైన వసతి లేకపోవడంతో నల్లా నీళ్లే దిక్కవుతున్నాయి.
ప్రతిపాదనలు పంపాం
కొన్ని చోట్ల భవనాల సమస్య ఉంది. నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మించడానికి ప్రతిపాదనలు పంపాం. వాటిలో రాచాల 2వ కేంద్రం, కాటవరం, తిమ్మాయిపల్లి, తిమ్మాయిపల్లి తండాలో కొత్త భవనాలు నిర్మించడానికి నివేదికలు ఉన్నతాధికారులకు పంపించాం. చిన్నారులకు సమస్యలు ఎదురవకుండా చర్యలు చేపడుతున్నాం.
–అనిత, ఐసీడీఎస్ పర్యవేక్షకురాలు
Comments
Please login to add a commentAdd a comment