బాల్యం..బందీ!
- అద్దె భవనాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు
- శిథిల భవనాల్లో బిక్కుబిక్కుమంటూ చదువులు
- కనీస సౌకర్యాలూ కరువే
- గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణం
- ఇక్కడ కనిపిస్తున్న అంగన్‌వాడీ కేంద్రం కొత్తచెరువులోని బసవన్నకట్ట సమీపంలో ఉంది. ఒకటే గది. అందులో పదుల సంఖ్యలో చిన్నారులు. ఇంటికున్న పెంకులు ఎప్పుడు ఊడతాయో తెలియని పరిస్థితి. గత్యంతరం లేక చిన్నారులు చదువుకొనసాగిస్తున్నారు. అధికారులు కనీసం తనిఖీ చేసిన దాఖలాలు లేవు.
- ఇది తాడిపత్రిలోని ఓ అంగన్‌వాడీ కేంద్రం. అద్దె గదిలో కొనసాగుతోంది. కేంద్రానికి వచ్చే చిన్నారులంతా ఇదిగో ఇలా ఇరుకుగా కూర్చోవాల్సిందే. ఇలాంటి పరిస్థితి ఉన్న కేంద్రంలో పిల్లలు ఎలా ఆడుకోగలరో.. ఎలా చదువుకోగలరో పాలకులే గుర్తించాలి.
అనంతపురం టౌన్ :
బుడిబుడి అడుగులు... ముద్దుముద్దు మాటలతో అక్షరాలు నేర్చుకునేందుకు వచ్చే చిన్నారులకు అసౌకర్యాల నడుమ కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాలు శాపాలుగా మారుతున్నాయి. ఇరుకైన అద్దె గదులు..అపరిశుభ్ర వాతావరణంలో బాల్యం బందీ అవుతోంది. అధికారుల అలసత్వం.. పాలకుల నిర్లక్ష్యానికి చిన్నారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జిల్లాలో ఐసీడీఎస్ పరిధిలో 5,126 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మెయిన్ కేంద్రాలు 4,286, మినీ కేంద్రాలు 8,40 ఉన్నాయి. వీటిలో 1,170 అంగన్‌వాడీ కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. 3,110 కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా మిగిలిన కేంద్రాలు వివిధ పాఠశాలల, సామాజిక భవనాల్లో నడుస్తున్నాయి.
అంగన్‌వాడీ కేంద్రాల లక్ష్యం ఇదీ..:
కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారం అందించి, విద్యపై ఆసక్తి పెంచే ఉద్దేశంతో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఏటా వీటి నిర్వహణకు రూ. కోట్లు కేటాయిస్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రతి అంగన్‌వాడీ కేంద్రానికీ అన్ని సౌకర్యాలు కలిగిన సొంత భవనం ఉండాలి. అది లేకపోతే కనీసం మూడు గదులు ఉండే భవనాన్ని అద్దెకు తీసుకోవాలి. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఒక్కో అంగన్‌వాడీ కేంద్రం కనీసం 500 నుంచి 600 గజాల విస్తీర్ణంతో విశాలంగా పిల్లలు ఆడుకునే విధంగా ఉండాలని నిబంధనలు ఉన్నా అవి ఎవరూ పట్టించుకోవడం లేదు.
మౌలిక సదుపాయాలపై సమీక్షలేవీ?
ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి సౌకర్యాలు, పరిశుభ్రమైన పరిసరాలు ఉంటే చిన్నారులు ఉత్సాహంగా పాఠాలు వింటారు. కానీ జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. గాలి, వెలుతురు సరిగా ఉండడం లేదు. కేంద్రాలకు వచ్చే సరుకులు, ఆట వస్తువులు, వంటావార్పు అన్నీ ఒకే గదిలో చేస్తున్న పరిస్థితి ఉంది. కొన్ని కేంద్రాలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎప్పుడు పెచ్చులూడుతాయో తెలియని పరిస్థితుల్లో విద్యాబోధన సాగుతోంది. మరుగుదొడ్లు అస్సలు కనిపించవు. వసతుల విషయంలో కనీసం అధికారులు సమీక్షలు కూడా చేయని దుస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లోని కేంద్రాలకు రూ.750, పట్టణ ప్రాంతాల్లోని వాటికి రూ.3 వేలు నెలసరి అద్దె ఇస్తుండగా ఆ నిధులతో అన్ని వసతులతో కూడిన కేంద్రాలు దొరకడం కష్టంగా మారుతోందని కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు చెప్తున్నారు.
నిర్మాణాలు కొనసాగుతున్నాయి : జుబేదాబేగం, ఐసీడీఎస్ పీడీ
అంగన్‌వాడీ సెంటర్లకు సొంత భవనాలు లేని మాట వాస్తవమే. ప్రస్తుతం వివిధ పథకాల కింద 1200 వరకు భవనాల నిర్మాణాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయి.