nutrition distribution
-
గుడ్లు చాలవు.. పాలు అందవు
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీల్లో పౌష్టికాహార పంపిణీ గాడి తప్పుతోంది. పంపిణీలో సమస్యలను పరిష్కరించకపోవడం... పలు చోట్ల పంపిణీ దారులను ఎంపిక చేయకపోవడం... స్టాకు ఉన్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఉదాశీన వైఖరితో ఈ పరిస్థితి తలెత్తింది. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషక సమస్యలు తీవ్రమవుతున్నాయి.ఐదేళ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి, పౌష్టికాహార పంపిణీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రతీ రోజు 200 మిల్లీలీటర్ల పాలు, ఉడికించిన కోడిగుడ్డు ఇవ్వాలి. పౌష్టికాహారలోపం తీవ్రంగా ఉన్న పిల్లలు, బాలింతకు అదనంగా మరో 100 మిల్లీ లీటర్ల పాలు అందజేయాలి. వీటితో పాటు పూర్తి పోషక విలువలున్న ఆహారాన్ని సైతం వడ్డించాలి. కానీ చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు, గుడ్ల పంపిణీ గందరగోళంగా మారింది. పలు జిల్లాల్లో పాలు, గుడ్ల సరఫరాదారుల ఎంపిక ప్రక్రియే పూర్తి కాలేదు. కొన్ని చోట్ల సరఫరా దారులను ఎంపిక చేసినప్పటికీ సాంకేతిక కారణాలు, సరఫరాలో సమస్యలను అధిగమించకపోవడంతో అది అస్తవ్యస్తంగా మారింది. రాష్ట్రంలో 149 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటి పరిధిలో 5.31లక్షల మంది గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 7నెలల నుంచి 3 ఏళ్ల లోపు వయసున్న వారు 10.42 లక్షల మంది, ఆరేళ్ల లోపు వయసున్న చిన్నారులు 6.54లక్షల మంది నమోదయ్యారు. వీరికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలు, గుడ్లు, పౌష్టికాహారాన్ని అందివ్వాలి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఈ క్రమంలో అంగన్వాడీల్లో హాజరు శాతం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ పాలు, గుడ్లు పొందిన వారి సంఖ్య మాత్రం తక్కువగా ఉంటోంది. సిద్దిపేట, ఆసీఫాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో హాజరు, లబ్ధి వత్యాసం అధికంగా ఉంది. ఈ వత్యాసాన్ని లోతుగా పరిశీలిస్తే అక్కడ సరుకుల పంపిణీలోని లొసుగులు బయటపడుతున్నాయి. రెండు నెలలుగా అరకొరే... అంగన్వాడీ కేంద్రాలకు గత రెండు నెలలుగా పాలు, గుడ్ల సరఫరా లోపభూయిష్టంగా ఉంది. కేంద్రాలకు హాజరవుతున్న విద్యార్థుల ఆధార్ వివరాలు అప్డేట్ కాకపోవడంతో సరఫరా కావడం లేదని కొన్నిచోట్ల నిర్వాహకులు చెబుతున్నారు. మరికొన్ని చోట్ల ఓటీపీలు రావడం లేదని, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో గుడ్లు ఇవ్వలేక పోయామని కాంట్రాక్టర్లు అంటున్నారు. వాస్తవానికి ఓటీపీలు రాకపోతే సీడీపీఓలకు మరోమారు అర్జీ పెడితే సరిపోయేదని, కాంట్రాక్టర్లు తప్పించుకునే ధోరణితో ఇలా సరఫరా చేయడం లేదంటున్నారు. పలురకాల సమస్యలతో అంగన్వాడీ కేంద్రాలకు సకాలంలో సరుకులు చేరడం లేదు. ఈ అంశంపై రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడం గమనార్హం. అంగన్వాడీ కేంద్రాల్లో పంపిణీ ఆగమాగం కావడంతో చిన్నారులు, బాలింతల్లో పోషకాహార సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. -
ఆశ్రమ పాఠశాలల్లో గిరిపోషణ
సాక్షి, హైదరాబాద్: గిరిపుత్రుల్లో పౌష్టికాహార లోపాల్ని అధిగమించేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమైన ‘పోషణ్ అభియాన్’పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొస్తోంది. ప్రస్తుతం పోషణ్ అభియాన్ పథకాన్ని ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ద్వారా అమలు చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల్లోని దాదాపు 15వేల మంది చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అయితే ఈ సంఖ్య తక్కువగా ఉండడంతో పౌష్టికాహార లోపాల్ని అధిగమించడం కష్టమని భావించిన యంత్రాంగం... ఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పౌష్టికాహారం పంపిణీ చేపట్టాలని భావించింది. గిరిపోషణ పేరిట చేపట్టే ఈ కొత్త కార్యక్రమానికి సంబంధించి ఆ శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో మైదాన ప్రాంతాల్లో కంటే గిరిజన ప్రాంతాల్లోనే పౌష్టికాహారలోపం ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ముందుగా గిరిపోషణ కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతాల్లోనే అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో గిరిపోషణను అమలు చేయనున్నారు. ప్రస్తుతం ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలకు పూర్తిస్థాయిలో వసతి, భోజన సౌకర్యాన్ని కల్పిస్తుండగా... ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం మధ్యాహ్న భోజన పథకాన్నే అమలు చేస్తున్నారు. తాజాగా గిరిపోషణతో ఆయా విద్యార్థులకు అదనంగా చిరుతిళ్లను అందిస్తారు. చిరుతిళ్ల కింద తేనె, పల్లీపట్టి, బిస్కట్లు, చాక్లెట్లు, చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలను ఇవ్వనున్నారు. జీసీసీ ఉత్పత్తులే... గిరిపోషణ ద్వారా పంపిణీ చేసే పదార్థాలన్నీ సహజసిద్ధంగా ఉండాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం గిరిజన సంక్షేమ శాఖలో భాగంగా ఉన్న గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ (జీసీసీ) పలు రకాల ఉత్పత్తులు చేస్తోంది. ఇందుకు సంబంధించి తయారీ యూనిట్లు సైతం ఉన్నాయి. దీంతో గిరిజన విద్యార్థులకు పంపిణీ చేసే పౌష్టికాహారమంతా జీసీసీ ద్వారా సరఫరా చేయాలని యంత్రాంగం భావిస్తోంది. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు సబ్బులు, డిటర్జెంట్లు, షాంపూలను జీసీసీ విజయవంతంగా సరఫరా చేస్తోంది. మరోవైపు ఆహార ఉత్పత్తులు, తృణ ధాన్యాలతో కూడిన పదార్థాలను కూడా తయారు చేస్తుండడంతో గిరిపోషణ బాధ్యతలను జీసీసీకి ఇవ్వనుంది. -
అన్నిటికీ దిక్కు... జీతాలే చిక్కు
పాలమూరు, న్యూస్‌లైన్ : ఊళ్లో ఏ సర్వే చేపట్టాలన్నా.. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలను ఒక్కచోట చేర్చాలన్నా.. అంగన్వాడీ కార్యకర్త లే దిక్కయ్యారు.. సర్కారు అన్ని పనులకు వినియోగిస్తూ తమతో అడ్డమైన చాకిరీ చేయిస్తున్నా.. కనీస వేతనం అందించడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు ఇబ్బం దిగా మారింది. అంగన్వాడీ ఉద్యోగ నియామకాల సమయంలో సిబ్బందికి చెబుతున్న జాబ్‌చార్ట్‌కు, నియమితులైన తర్వాత చేయిస్తున్న పనులకు పొంతన లేకుండా పోతోంది. వాస్తవానికి చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యాబోధన, పౌష్టికాహార పంపిణీ, చిన్నారులు, బాలింతలు, గర్భిణుల సంక్షేమం కోసం పనిచేయడమే అంగన్వాడీల విధులు, అయితే.. ప్రభుత్వం ప్రతి కార్యక్రమంలోనూ అంగన్వాడీలను భాగస్వామ్యం చేస్తోంది. కాదూ కూడదంటే ఉద్యోగాలు ఊడతాయని హెచ్చరిస్తోంది. చివరకు రాజకీయ పార్టీల కార్యకర్తలు చేయాల్సిన పనిని కూడా వీరికే అప్పగిస్తున్నారు. ఓటరు జాబితా తయారీ, ఓటరు కార్డుల పంపిణీ, ఇంటింటా సర్వే వంటి అనేక ఇతర పనులను వారితో చేయిస్తున్నారు. ఈ కార్యకర్తలు, ఆయాలు కనీస వేతనాలకు నోచుకోవడం లేదు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణతోపాటు వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నా.. వీరి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. అరకొర వేతనాలిస్తూ వెట్టిచాకిరీ చేయించుకొంటోంది. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కోసం తరచూ ఆందోళనలు చేస్తున్నా.. సర్కారు పట్టించుకోవడంలేదు. జిల్లాలో 4,423 అంగన్వాడీ, 605 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 4,423 మంది అంగన్వాడీ కార్యకర్తలు, 605 మంది మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 4వేల మంది ఆయాలు (హెల్పర్లు) పని చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లోని మురికి వాడల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారాన్ని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. 3-5 ఏళ్లలోపు చిన్నారులకు పూర్త ప్రాథమిక విద్యను కూడా బోధిస్తున్నారు. వీటితోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ పాలుపంచుకుంటున్నారు. అయితే.. వీరికి అందుతున్న వేతనాలు నామమాత్రమే. గౌరవ వేతనం పేరిట ప్రభుత్వం అరకొరగా విదుల్చుతోంది. అమలుకాని సుప్రీం కోర్టు ఆదేశాలు పదేళ్ల సర్వీసును పూర్తిచేసుకున్న అంగన్వాడీ కార్యకర్తలకు రూ.4263,అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారికి రూ.4231, కొ త్తగానియమితులైనవారికిరూ.4200,ఆయాలకు రూ.2200 చొప్పున వేతనాలు చెల్లిస్తోంది. మినీ అంగన్వాడీ కార్యకర్తల పరిస్థితి మరింత దయనీయం. ప్రధాన కేంద్రాల్లో ప నిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నా రూ.2,200 మాత్రమే ఇస్తోంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న సిబ్బందికి కనీస వేతనం రూ.12వేలు తగ్గకుండా ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసినా దాన్ని ప్రభుత్వం అమలు చేయడం లేదు. అంగన్వాడీలతో ఇతర పనులు చేయించ కూడదని ఉత్తర్వులు వచ్చాయి. అ యితే.. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ సిబ్బంది కొరతవల్ల అంగన్వాడీల సేవలనుఉపయోగించుకుంటున్నామని సం బంధిత అధికారులు చెబుతున్నారు.వేతనాలు తక్కువ అం దుతుండటం వాస్తవమే అయితే.. వేతనాలు పెంచుతూ ప్ర భుత్వ స్థాయిలో నిర్ణయం జరగాలని వారు పేర్కొన్నారు. నిర్వీర్యమవుతున్న వ్యవస్థ అంగన్వాడీల బలోపేతానికి కృషిచేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వాటిని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ వ్యవస్థను తొలగించి పౌష్టికాహారం అందించే బాధ్యతలను స్వచ్చంద సంస్థలకు అప్పగించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రజలు, అంగన్వాడీల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో ప్రస్తుతానికి వెనకడుగు వేస్తోందని సమాచారం.