‘పౌష్టికం’ కాదు సుమా!
* అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకం కందిపప్పు
* వాస్తవమేనంటున్న అధికారులు
రాయవరం : మాత, శిశు మరణాలను అరికట్టడంతో పాటు, ఆరోగ్యవంతమైన శిశువులను సమాజానికి అందించాలనే లక్ష్యంతో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పౌష్టికాహారాన్ని అందజేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలోని బాలింతలు, గర్భిణులు, శిశువులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకమైన పౌష్టికాహారం అందుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
వెంటూరులో అంగన్‌వాడీ కేంద్రాలకు నాసిరకమైన కందిపప్పు సరఫరా అయినట్టు సమాచారం. ఇంకా అనేక కేంద్రాలకు ఇలా నాసిరకమైన కందిపప్పు అందినట్టు తెలుస్తుంది.
అంగన్‌వాడీ కేంద్రాల్లో మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులకు పప్పుతో కూడిన భోజనం వండి పెడుతున్నారు. కేంద్రం పరిధిలో నమోదైన బాలింతలు, గర్భిణులకు మూడు కిలోల బియ్యం, కిలో కందిపప్పును అందజేస్తున్నారు. ఒక కేంద్రం పరిధిలో సుమారుగా 15 నుంచి 20 మంది వరకు బాలింతలు, గర్భిణులు ఉన్నారు. ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు అర కిలో కందిపప్పు, బియ్యం మూడు కిలోలు అందజేస్తున్నారు.
ఒక్క రాయవరం మండలంలోని 54 అంగన్‌వాడీ కేంద్రాల్లో 946 మంది గర్భిణులు, 475 మంది బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులు 1,863 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులు 1,930 మంది ఉన్నారు.
ప్రజాప్రతినిధుల దృష్టికి..
ఇటీవల ఈ-పాస్ విధానంలో అంగన్‌వాడీ కేంద్రాలకు సరకులను అందజేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు అందుతున్న కందిపప్పు పుచ్చిపోవడంతో పాటు పెంకి పురుగులు ఉన్నట్టు చెబుతున్నారు. కందిపప్పు నాసిరకంగా ఉన్నట్టు పలువురు ప్రజాప్రతినిధుల దృష్టికి రావడంతో, వారు ఐసీడీఎస్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు.
పురుగులు ఉన్న మాట వాస్తవమే..
దీనిపై రాయవరం ఐసీడీఎస్ పీఓ కె.వెంకటనరసమ్మను ‘సాక్షి’ వివరణ కోరగా, నాసిరకమైన కందిపప్పు వ్యవహారంపై వెంటూరు గ్రామానికి వెళ్లి అంగన్‌వాడీ కేంద్రాలను పరిశీలించానని పేర్కొన్నారు. పెంకి పురుగులు ఉన్న మాట వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని ప్రాజెక్టు డెరైక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లినట్టు ఆమె తెలిపారు.