దయనీయస్థితిలో అంగన్‌వాడీలు..! | Anganwadi Centres Delayed in Vizianagaram | Sakshi
Sakshi News home page

దయనీయస్థితిలో అంగన్‌వాడీలు..!

Published Thu, Dec 13 2018 7:16 AM | Last Updated on Thu, Dec 13 2018 7:16 AM

Anganwadi Centres Delayed in Vizianagaram - Sakshi

22 మంది పిల్లలు ఉండాల్సిన అంబేడ్కర్‌ కాలనీ కేంద్రంలో ఉన్న చిన్నారులు

విజయనగరం ఫోర్ట్‌: అంగన్‌వాడీ కేంద్రాలు ఆధ్వానస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. కేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండడం లేదు. ముఖ్యంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఉండాల్సిన సంఖ్యలో సగం కూడా ఉండడం లేదు. పౌష్టికాహారం కూడా గర్భిణులు, బాలింతలకు సక్రమంగా అందడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  జిల్లాలో 2987 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. అదేవిధంగా మినీ అంగన్‌వాడీ కేంద్రాలు 742 ఉన్నాయి. వీటిల్లో 7 నెలల నుంచి 3 సంవత్సరాల్లోపు పిల్లలు 63,899 మంది ఉన్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 42,249 మంది.. అదేవిధంగా 15004 గర్భిణులు.. 16,6775 బాలింతలు... మొత్తంగా 1,37,827 మంది లబ్ధిదారులు ఉన్నారు.   

తగ్గుతున్న చిన్నారుల సంఖ్య
అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఉండాల్సిన సంఖ్యలో సగం మంది కూడా ఉండడం లేదు. 10 మంది పిల్లలు ఉండాల్సిన చోట ముగ్గురు, నలుగురు మాత్రమే ఉంటున్నారు. కేంద్రాలను విలీనం చేసిన చోట కూడా ఇదే పరిస్థితి. 20 నుంచి 25 మంది ఉండాల్సిన చోట 10 మందికి మించి ఉండడం లేదు. అంతేకాకుండా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత పిల్లల సంఖ్య మరింతగా తగ్గుతోంది. ఒకరు, ఇద్దరు పిల్లలు మాత్రమే కేంద్రాల్లో ఉంటున్నారు. కొన్ని కేంద్రాల్లో అయితే పిల్లలు అస్సలు ఉండడం లేదు. విజయనగరం పట్టణంలో ఉన్న పలు అంగన్‌వాడీ కేంద్రాలను సాక్షి బుధవారం పరిశీలించగా డొల్లతనం బయటపడింది. మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో కాంబోవీధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించగా అక్కడ నలుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు. అదేవిధంగా ఈ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు భోజనం ఇంటికి తీసుకుని వెళ్తున్నట్లు తెలిసింది.

12: 30 గంటల ప్రాంతంలో అంబేడ్కర్‌ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించగా అక్కడ 10 మంది పిల్లలు మాత్రమే ఉన్నారు.  ఇక్కడ న్యూ అంబేడ్కర్‌ కాలనీ అంగన్‌వాడీ కేంద్రాన్ని విలీనం చేశారు. ఈ రెండు అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లల సంఖ్య 22 కాగా 10 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ కూడ గర్భిణులు, బాలింతలు భోజనాలు ఇంటికి తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం గర్భిణులు, బాలింతలు కేంద్రాల్లోనే భోజనం చేయాల్సి ఉండగా ఇంటికి తీసుకెళ్తున్నారు. 12:45 గంటల ప్రాంతంలో రెల్లి మాదిగ అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించగా ఇక్కడ కూడ పిల్లల సంఖ్య తక్కువుగానే ఉంది. 10 మంది పిల్లలకు గాను ఉన్నది ఐదు మంది మాత్రమే. ఈ కేంద్రం పరిధిలో 15 మంది వరకు బాలింతలు, గర్భిణులున్నారు. ఇక్కడ కూడా గర్భిణులు, బాలింతలకు అంగన్‌వాడీ సిబ్బందే ఇంటికి భోజనాలు పంపిస్తున్నట్లు తెలిసింది. సమయం ఒంటి గంట అయినా బాలింతలు, గర్భిణులకు గుడ్లు ఉడకబెట్టలేదు. దీంతో గర్భిణులు, బాలింతలకు గుడ్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించగా... ఇళ్లకు తీసుకెళ్లి ఇస్తామని సిబ్బంది బదులివ్వడం విశేషం. అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాల్సిన అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కేంద్రాల్లోనే భోజనం చేయాలి...
గర్భిణులు, బాలింతలు కేంద్రాల్లోనే భోజనాలు చేయాలి. పిల్లల సంఖ్య తక్కువగా ఉంటే సహించేది లేదు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటాం.– ఎం. శ్రీదేవి, సీడీపీఓ, విజయనగరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement