శ్రీకాకుళం టౌన్: జీతాలు సరిపోక అవస్థలు పడుతున్న అంగన్‌వాడీలు ఉద్యమ బాటపట్టారు. ఉద్యోగులుగా గుర్తించాలన్న ప్రధాన డిమాండ్‌ను పక్కనపెట్టి జీతాలైనా పెంచాలంటూ రోడ్డెక్కారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రాస్థాయికి ఉద్యమాన్ని తీసుకెళ్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో మంత్రివర్గ ఉప సంఘం దిగివచ్చి జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. మంత్రి వర్గ ఉప సంఘం తరఫున జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గత ఏడాది సెప్టెంబర్ నుంచి జీతాలు పెంచుతున్నట్టు అప్పట్లో ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి నిర్ణయంగా ప్రకటించిన ఆయన మాటను ప్రభుత్వం తరఫు మాటగా అంగన్‌వాడీలు నమ్మి ఉద్యమాన్ని విరమించారు.
అయితే అప్పటికే పోలీసు కేసులు పెట్టి అంగన్‌వాడీల ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అంగన్‌వాడీల సంఘాన్ని చీల్చి రెండో యూనియన్ సిద్ధం చేసింది. అయినా పట్టు వీడక ఉద్యమించిన(విజయవాడ ముట్టడి సమయంలో) అంగన్‌వాడీలను తొలగించేందుకు సర్కులర్ జారీ చేసింది. దీనికి వెన్ను చూపని అంగన్‌వాడీలకు ప్రభుత్వం ఎట్టకేలకు జీతాలు పెంచుతూ జీవో జారీ చేసింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు పెంచుతున్నట్టు ప్రకటించింది. గత సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చివరకు ఇవ్వాల్సిన ఏరియర్సు ఎగవేతకు ప్రయత్నం చేస్తుంది. జిల్లాలో 18 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 3403 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, 3403 మంది సహాయకులు పనిచేస్తున్నారు.
వీరితో పాటు 789 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ. 4500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు రూ. 2950, సహాయకునికి రూ. 2200 జీతంగా చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి వీరి జీతాలు వరుసగా రూ. 7000, రూ. 4500, రూ. 4500గా పెంచుతూ జీవో విడుదల చేశారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి జీతాలు పెరగనున్నాయని సంభరపడ్డ అంగన్‌వాడీలు తాజాగా సర్కార్ విడుదల చేసిన జీవోను చూసి నిరాశ చెందుతున్నారు.
సెప్టెంబర్ నుంచి జీతాలు పెరిగితే జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలకు ఏరియర్సు రూపంలో రూ. 6.67 కోట్లు చెల్లించాల్సి ఉంది. మినీ అంగన్‌వాడీలకు రూ. 91.13 లక్షలు, సహాయకులకు రూ. 5.48 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం రూ. 13 కోట్లు జిల్లాలోని అంగన్‌వాడీలకు చెల్లించాలి ఉంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు పెంచుతున్నట్టు ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఏరియర్సు అందే అవకాశం లేదు.
కక్షసాధింపుతోనే జీవో
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టీడీపీ అధికారంలోకి రాగానే జీతాలు పెంచమని అడిగిన అంగన్‌వాడీలపై కక్ష సాధింపుతోనే ప్రభుత్వం ఈ రకమైన జీవో ఇచ్చిందని అంగన్‌వాడీ వర్కర్సు అండ్ హెల్పర్సు యూనియన్ విమర్శించింది. సంఘం నాయకులు కె.నాగమణి ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సెప్టెంబర్ నుంచి పెంచిన జీతాలకు సంబంధించి ఏరియర్సు చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్‌వాడీలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రైవేటీకరణకు సిద్ధపడుతోందని విమర్శించారు. అంగన్వాడీ వర్కర్సు అండ్ హెల్పర్సు యూనియన్ నాయకురాలు కె.నాగమణి
ఏరియర్సు ఎగవేత?
Published Wed, Feb 10 2016 12:08 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement