సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా పి.అనిల్‌కుమార్ నియమితులయ్యారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయన ప్రస్తుతం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమితులయ్యారు. బొత్సను జూన్ 21న జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించగా.. ఇప్పటి వరకు ఆయన కొనసాగారు. ఇన్‌చార్జ్ మంత్రి హోదాలో స్వాతంత్య్ర దిన వేడుకలతో పాటు ఆగస్టు 28న జరిగిన జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశంలో పాల్గొన్నారు. సెప్టెంబరు 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు నంద్యాలలో పర్యటించి.. భారీ వర్షాలు, వరదల నష్టాన్ని పరిశీలించారు. బొత్సను ప్రస్తుతం అనంతపురం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా నియమించగా.. ఆయన స్థానాన్ని మంత్రి అనిల్‌కుమార్‌తో భర్తీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అనిల్‌కుమార్ జల వనరుల శాఖ మంత్రి కావడంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి వీలు కలుగుతుందని ప్రజల్లో చర్చ సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment