అన్నదాతకు గుబులు | Annadataku foliage | Sakshi
Sakshi News home page

అన్నదాతకు గుబులు

Published Wed, Nov 12 2014 2:26 AM | Last Updated on Mon, Oct 1 2018 4:45 PM

అన్నదాతకు గుబులు - Sakshi

అన్నదాతకు గుబులు

రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వం ఇంతవరకు స్పష్టత ఇవ్వడం లేదు. ఈనెల 15 నాటికి రైతుల ఖాతాల్లో 20 శాతం జమ చేస్తామని చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాంకులు పంపిన ఖాతాల్లో వివరాలు సరిగా లేవంటూ ముప్పుతిప్పలు పెడుతోంది. రోజుకో మాట.. పూటకో తీరుతో ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
 
 బద్వేలు: టీడీపీ ప్రభుత్వ రుణమాఫీ ప్రకటన రైతన్నకు దడ పుట్టిస్తోంది. ఏ రోజు ఏ వివరాలు అడుగుతారో.. ఎవరి పేర్లు తీసేస్తారో.. అని అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. రుణమాఫీ ఫైలుపై మొదటి సంతకమంటూ రైతులను మభ్యపెట్టిన చంద్రబాబు ఇంకా రైతన్నలను మోసం చే సేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 5 వ తేదీ రైతుల ఖాతాల్లో 20 శాతం జమ చేస్తామన్నారు. తరువాత అది 12వ తేదీకి, ప్రస్తుతం 15వ తేదీకి చేరింది. 15 నాటికి పూర్తవుతుందని ఆశించినా ఖాతాల పరిశీలనతో అది జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది.

  ఎవరివి తొలగిస్తారో...
 జిల్లాలో 3 లక్షల 32 వేల 105 మంది రైతులు రూ.2,103కోట్ల పంట రుణాలు, 2 లక్షల 18 వేల 408 మంది రైతులు బంగారు కుదువ పెట్టి రూ.2.214 కోట్ల పంట రుణాలు పొందారు. అయితే రుణభారం తగ్గించుకునే నెపంతో ఆధార్, రేషన్‌కార్డు, భూమి వంటి వివరాలను అప్‌లోడ్ చేయాలని బ్యాంకర్లకు జులైలో ఒక ఫార్మెట్ అందజేశారు. దీని ప్రకారం బ్యాంకర్లు 4 లక్షల 95 వేల 964 ఖాతాలను అప్‌లోడ్ చేశాయి.

కానీ ప్రభుత్వం వీటిలో 2.25లక్షల మంది వివరాలు సరిగా లేవని గత నెల 24న తిరిగి ఆయా బ్యాంకుల శాఖలకు పంపింది. వీటిని సవరించి పంపాలని కోరగా ఈ నెల మొదటి వారంలో పూర్తి చేసి పంపారు. వారు పంపుతూనే జాబితాను ప్రకటించి వారి ఖాతాల్లో 20 శాతం నగదు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. 12వ తేదీ నగదు వేస్తామని చెప్పినా పదో తేది నాటికే మాట మార్చింది. పంపిన 4.95 లక్షల ఖాతాల్లో 3 లక్షల 08 వేల 377 ఖాతాల వివరాలు సరిగా లేవని వెనక్కి పంపింది. వీటిలో ఆధార్ కార్డు, రేషన్‌కార్డులు వివరాలిచ్చినా సరిపోలని ఖాతాలు 1లక్ష67వేల617 ఉన్నాయి.

రేషన్‌కార్డు అందించని వారు 41,365, ఆధార్ అందించని వారు 14,291 మంది ఉన్నారు. ఆధార్, రేషన్‌కార్డు రెండూ ఇవ్వని వారు 85,104 మంది ఉన్నారు. వీటితో పాటు ఎలాంటి సమాచారం ఇవ్వని 26,857 ఖాతాలను నకిలీ పంట రుణ ఖాతాలుగా పేర్కొంటూ తిరస్కరించారు. అప్‌లోడు చేసిన 4.95 లక్షల ఖాతాల్లో తిరస్కరించిన ఖాతాలు పోను అన్ని వివరాలు సరిగా ఉన్నవి 1లక్ష60వేల730 ఖాతాలు మాత్రమే. అంటే వంద మంది రైతుల్లో కేవలం 38 మంది మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఖాతాదారులు తమ నామినీకి సంబంధించిన ఆధార్ కూడా అందించాలని ప్రభుత్వం కోరింది. మొదట్లో అడగని ప్రభుత్వం ఈ నిబంధనతో ఏమి చేస్తుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 రెండు రోజుల్లో సాధ్యమా...
 ప్రస్తుతం 3.08 లక్షల ఖాతాలను పరిశీలించాలంటూ ఆయా తహశీల్దార్ కార్యాలయాలకు జాబితాలు పంపారు. వీటిని మంగళ, బుధ వారాల్లో పరిశీలించి గురువారం అప్‌లోడ్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మంగళవారం కొన్ని మున్సిపాలిటీ, గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమంలో అధికారులు ఉన్నారు. మరికొన్ని చోట్ల ఆన్‌లైన్ సౌకర్యం సరిగా లేక జాబితాలు డౌన్‌లోడ్ చేయలేని పరిస్థితి ఉంది.

బి.కోడూరు మండలంలో ఇంటర్‌నెట్ సౌకర్యం లేక బద్వేలులో జాబితాలు తీసుకున్నారు. పలు మారుమూల మండలాల్లో ఇదే పరిస్థితి ఉంది. కొన్ని మేజరు, పెద్ద పంచాయతీల్లో వేలాది ఖాతాలకు సంబంధించి రెండు రోజుల్లో ఇంటింటి పరిశీలన అసాధ్యం. పరిశీలన బాధ్యతను పింఛన్ల కమిటీలకు అప్పగించడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో ఈ కమిటీలు 2.45 లక్షల పింఛన్లను పరిశీలించి 50 వేల మందిని అనర్హులుగా నిర్ణయించాయి.

వీరిలో చాలా మంది అర్హులుండటంతో పలు చోట్ల పింఛన్‌దారులు ఆందోళన చేయడంతో పునః పరిశీలించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పింఛన్ల పరిశీలనలో జరిగినట్లే ఖాతాల పరిశీలనలో జరిగితే పెద్దయెత్తున అర్హులైన రైతులు అనర్హులుగా మారే అవకాశముంది. 13న పరిశీలన పూర్తయితే ఖాతాల్లో 20 శాతం జమ చేస్తామని చెబుతున్నా అప్పటికి పరిశీలన పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రుణమాఫీ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదంతా ప్రభుత్వం కాలయాపన చేయడానికి అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement