ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించండి
- కేంద్రాన్ని కోరిన వైఎస్సార్‌సీపీ
- ‘పోలవరం’ కేంద్రమే చేపట్టాలి: ఎంపీ వెలగపల్లి
సాక్షి, న్యూఢిల్లీ: విభజన కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసింది. మంగళవారం లోక్‌సభలో సప్లిమెంటరీ డిమాండ్స్‌పై జరిగిన చర్చలో ఆ పార్టీ ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 9 రోజులు నిరాహార దీక్ష చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పటివరకూ కేంద్రం ఈ దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోలేదన్నారు. వైజాగ్ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో మూడేళ్లయినా ఎటువంటి పురోగతి లేదని, ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఇక్కట్లలో ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ కారిడార్‌ను త్వరితగతిన అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు వాస్తవ వ్యయం రూ. 40 వేల కోట్లకు పైగా అవుతుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఈ జాతీయ ప్రాజెక్టు వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరిస్తూ ప్రాజెక్టును చేపట్టాలని కోరారు.పేద రైతులను ఆదుకోవడానికి వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధరను పెంచాలన్నారు. విభజన చట్టంలో పొందుపరచిన విశాఖ రైల్వేజోన్ ఇప్పటివరకూ సాకారం కాలేదని, దీన్ని త్వరితగతిన ప్రకటించాలని కోరారు. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చినా ఇంతవరకూ అమలు కాలేదని, స్థానికులంతా ఈ ప్రాజెక్టు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.