రాజధానిలో మలివిడత పూలింగ్
సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశం
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణం కోసం రాజధాని ప్రాంత రైతుల నుంచి ఇప్పటికే 33,000 ఎకరాలను భూ సమీకరణ విధానంలో తీసుకున్న రాష్ర్ట ప్రభుత్వం మలి విడతలో మరో 14 వేల ఎకరాల భూములు సమీకరించేందుకు నిర్ణయించింది. శుక్రవారం జరిగిన సీఆర్‌డీఏ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని వెల్లడించారు. రాజధాని అంతర్ వలయ రహదారి (ఇన్నర్ రింగ్‌రోడ్డు) నిర్మాణానికి 14 వేల ఎకరాలను జూలై తరువాత మలివిడత ల్యాండ్ పూలింగ్ కింద తీసుకునేందుకు సిద్ధమవ్వాలని సీఆర్‌డీఏ అధికారులను సీఎం ఆదేశించారు. హైదరాబాద్‌లో ఉన్న తన మనవణ్ణి చూడటానికి శని, ఆదివారాల్లో కూడా వెళ్లకుండా అమరావతి బ్రాండింగ్ కోసం ఇక్కడే ఉంటున్నానని సీఎం అన్నారు.
సచివాలయం ఆర్కిటెక్ట్‌గా ఫోస్టర్ ప్లస్ కన్సార్టియం
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాదిరిగానే అమరావతి పరిపాలన నగరంలో జరిగే పనులకు 40 శాతం లేబర్ కాంపౌనెంట్ ఏరియా అలవెన్స్ వర్తింపజేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 918 ఎకరాల్లో నిర్మిస్తున్న పరిపాలన నగరం ఫోస్టర్ ప్లస్ పార్టనర్స్ అండ్ కన్సార్టియం మాస్టర్ ప్లాన్, డిజైన్ అందిస్తోందన్నారు.