విశాఖలో మరో భారీ భూకుంభకోణం!
బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో జరిగిన మరో భారీ భూకుంభకోణ భాగోతాన్ని 15 రోజుల్లో బయటపెడతానని బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్‌రాజు చెప్పారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తాను బయటపెట్టబోయే కుంభకోణంలో ప్రజాప్రతినిధులే నేరుగా భూదోపిడీకి పాల్పడిన ఉదంతాలున్నాయని తెలిపారు. పూర్తి సాక్ష్యాధారాలు సేకరించే పనిలో ఉన్నానని, అన్ని వివరాల్ని సాక్ష్యాధారాలతోనే మీడియా ముందుంచుతానని చెప్పారు. విశాఖ భూకబ్జాలపై ఇప్పటికే వెలుగులోకొచ్చిన అంశాలపై రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్‌తో న్యాయం జరుగుతుందని ప్రజలెవరూ భావించట్లేదన్నారు.
జరిగిన భూకుంభకోణంపై ఆరునెలల క్రితమే అసెంబ్లీ సాక్షిగా సిట్టింగ్ జడ్జితో విచారణకు తాను డిమాండ్ చేశానని, రాష్ట్రప్రభుత్వం అప్పుడే విచారణకు ఆదేశించివుంటే.. ఇప్పుడీ పరిస్థితులు ఉత్పన్నమయ్యేవి కావని అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి గదిలో వర్షపునీటి లీకేజీపై సీఐడీ విచారణకు ఆదేశించినంత వేగంగా విశాఖ భూకబ్జాలపై స్పందించివుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. 15వ తేదీన విశాఖలో ప్రజలందరి సమక్షంలో జరగాల్సిన బహిరంగ విచారణను రద్దుచేసి సిట్‌ద్వారా విచారణకు ఆదేశించడాన్ని ఆయన తప్పుపట్టారు.