సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ విజయం ఖాయమంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక తప్పుడు సర్వే కథనాన్ని ప్రచురించిన సంగతి మరువకముందే అదే తరహాలో ఏపీ ప్రజలను బురిడీ కొట్టించేందుకు మరో ప్రయత్నం జరిగింది. ఏపీలో ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం సర్వే నిర్వహించారని, అందులో టీడీపీ భారీ ఆధిక్యంతో గెలుస్తున్నట్టుగా తేలిందంటూ యూట్యూబ్‌లో హైదరాబాద్‌కు చెందిన టీఎఫ్‌సీ మీడియా అనే ప్రైవేటు కంపెనీ ఓ దొంగ సర్వేను ప్రసారం చేసింది. దీన్ని గుర్తించిన తెలంగాణ ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్ హరిప్రసాద్ జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీ ఎన్నికల ఫలితాలపై తాము ఎలాంటి సర్వే నిర్వహించలేదని, కానీ వారి ప్రచారానికి తమ శాఖ పేరును వాడుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఈ కంపెనీ డైరెక్టర్ శాఖమూరి తేజోభాను, ఇతర డైరెక్టర్లపై ఐటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టీడీపీ అనుకూలవాదుల మరో ఎత్తుగడ బట్టబయలైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
బట్టబయలైందిలా..
తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగంలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న కె.హరిప్రసాద్ హైదరాబాద్ కమిషనరేట్‌లోని వెస్ట్‌జోన్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం ఆయన తన సెల్‌ఫోన్‌లో యూట్యూబ్‌ను బ్రౌస్ చేస్తున్నారు. అందులో టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్ టిమిటెడ్ అనే సంస్థ అప్‌లోడ్ చేసిన ఓ వార్త ఆయన కంటపడింది. ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ సర్వే చేసిందని, టీడీపీ భారీ ఆధిక్యంతో గెలవనుందన్న విషయం సర్వేలో వెల్లడైందని ఈ కథనంలో ఉంది. దీనిపై హరిప్రసాద్ తమ డిపార్ట్‌మెంట్‌లో ఆరా తీయగా ఏపీ ఎన్నికపై తెలంగాణ నిఘా విభాగం ఎలాంటి సర్వేలు నిర్వహించలేదని తేలింది. దీంతో ఈ బోగస్ వార్త విషయాన్ని హరిప్రసాద్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. శాఖమూరి తేజోభాను తదితరులు టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ముసుగులో తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ పేరుతో తప్పుడు సర్వేలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఏపీ ఓటర్లను మభ్యపెట్టి టీడీపీకి అనుకూలంగా ఓటేసేలా చేయాలని కుట్ర పన్నారని, ఇందుకోసం తెలంగాణ ఇంటెలిజెన్స్ పేరును వాడుతూ ఆ విభాగం ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారని తెలిపారు. టీఎఫ్‌సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రామకృష్ణ వీరపనేని నేతృత్వంలోని మ్యాంగో అండ్ వాక్డ్ అవుట్, అదుగాని మల్లేష్ నేతృత్వంలోని చాలెంజ్ మిత్ర, చీపురుపల్లి రాంబాబు నేతృత్వంలోని టాలీవుడ్‌నగర్ సంస్థలతో కలిసి పనిచేస్తున్నట్లు, వారితో కలిసే ఈ కుట్ర చేసినట్లు ఆరోపించారు. హరిప్రసాద్ తన ఫిర్యాదుతోపాటు యూట్యూబ్ లింకులు, అందులో పొందుపర్చిన అంశాలకు సంబంధించిన వీడియోలను పోలీసులకు అందజేశారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఐపీసీలోని 171 (సీ), రెడ్‌విత్, 171 (ఎఫ్), 171 (జీ), 417, 420, 465, 468, 471, 505(1), (సీ), 505(2), రెడ్‌విత్ 120(బీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లోని సెక్షన్ 66(డీ) కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డి కేసు దర్యాఫ్తు చేస్తున్నారు.
టీడీపీ కీలక నేతలతో సంబంధాలు
ప్రాథమిక ఆధారాలను బట్టి టీఎఫ్‌సీ సంస్థ 2016 నవంబర్ 15 నుంచి పనిచేస్తున్నట్లు, శాఖమూరి తేజోభాను తదితరులు డైరెక్టర్లుగా ఉన్నట్లు వెల్లడైంది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఎన్‌బీకే బిల్డింగ్, సాగర్ సొసైటీ చిరునామాలతో ఈ సంస్థ పనిచేస్తున్నట్లు తేలింది. ఈ సంస్థల నిర్వాహకులు టీడీపీతో, దాని కీలక నేతలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో టీడీపీ నేతలకు అనుకూలంగా, వైఎస్సార్‌సీపీ నాయకులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారానికి కూడా వీరే బాధ్యులని భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment