నేరగాళ్లు తెలివిమీరి వ్యవహరిస్తున్నారు. సులువుగా సొమ్మును సంపాదించడానికి అలవాటు పడిన చాలామంది ఏదో ఒకలా జనాన్ని మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి మాయలో పడి చాలామంది తమ కష్టార్జితాన్ని చేజేతులా వారికి అప్పగించేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు ఏటీఎం కేంద్రాల వద్ద చాలామంది మోసాలకు గురవుతున్నారు. ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీసులు నడుం బిగించారు. ఏటీఎంలకు మరింత రక్షణ కల్పించే దిశగా పోలీస్‌శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కొద్ది నెలల్లో ఏటీఎం కేంద్రాల వద్ద చాలామంది మోసగాళ్ల వలలో పడి డబ్బులను పోగొట్టుకున్నారు. ఇలాంటి కేసులు సుమారు 19 నమోదు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరక్షరాస్యత, అమాయకత్వం కారణంగా మాయగాల ఉచ్చులో ఏటీఎం లబ్ధిదారులు పడుతున్నారు. ఏటీఎం కార్డుల ద్వారా నిందితులు పాస్‌వర్డ్ కనిపెట్టడం, కార్డుల్ని క్షణాల్లో మార్చేయడం, బాధితులకు సంబంధించిన డే టాను సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
శివారు ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో సెక్యూరిటీ గార్డులు పూర్తిస్థాయిలో లేకపోవడం, ఉన్నా లోపల ఏం జరుగుతుందో పరిశీలించకపోవడం, వారిలోనూ నిరక్షరాస్యులే ఉండడం తదితర కారణాల వల్ల చాలామంది కష్టార్జితం పరుల పాలవ్వడానికి దోహదపడుతోంది. బ్యాంకు సిబ్బందికి పోలీసులు ఎన్నిమార్లు జాగ్రత్తలు సూచిస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాల్ని పనిచేయకుండా చేసిన తరువాతే నిందితులు మోసాలకు పాల్పడుతుండడంతో నేరాన్వేషణకు ఆటంకం కలుగుతోంది. గత ఏడాది కొత్తూరులో దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్నే దొంగిలించేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పిన్ నంబర్లను తరచూ మార్చుకుంటే మోసాల్ని అరికట్టొచ్చని పోలీసులు, బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నా ఖాతాదారులకు ఇది కాస్త ఇబ్బందిగా ఉండడంతో ఆ ప్రయత్నం చేయడం లేదు. దీంతో మోసాలు మరింత పెరిగిపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో తమ ఏటీఎం కార్డుల పిన్ నంబర్లను కూడా పౌచ్‌పైనో, కార్డుపై చాలామంది రాసుకుంటున్నారు. ఇది దొంగలకు అవకాశంగా మారుతుంది. ఆ నంబర్లను కనిపెట్టి నకిలీ కార్డులు, ఇతర మార్గాల్లో క్షణాల్లో డబ్బు మాయం చేసేస్తున్నారు. మరికొన్ని చోట్ల తాము బ్యాంకుల కాల్ సెంటర్ల నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పాలని ఫోన్లలో అడుగుతుండడం, వీటిని నిజమని నమ్మి నంబర్లు చెప్పేస్తుండడంతో చాలామంది మోసపోతున్నారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్‌లైన్ ఫండ్ ట్రాన్స్‌పర్ పద్ధతి అమల్లోకి వచ్చిందని, వ్యక్తిగతంగా నగదు డ్రా చేయాలనుకున్నప్పుడు బ్యాంకుల ద్వారా డ్రా చేసుకోవచ్చంటున్నారు.
అన్ని ఏటీఎం సెంటర్ల వద్దా కంట్రోల్ రూం, స్థానిక పోలీస్‌స్టేషన్ల నంబర్లతో పాటు ఆయా బ్యాంకుల కాల్ సెంటర్ల వివరాలు కూడా అందుబాట్లో ఉంటున్నా కొన్ని చోట్ల నేరాలు జరుగుతుండడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పట్టణ పరిధిలోని సీసీఎస్ (సెంటల్ ్రక్రైం స్టేషన్) సిబ్బంది, స్థానిక పోలీసులు, బ్యాంకు సిబ్బందితో కలిసి ఈ నెలాఖరు వరకు స్పెషల్‌డ్రైవ్, అవగాహన సదస్సులు, ఏటీఎం సెంటర్ల నిర్వహకులతో చర్చించడం మొదలెట్టారు. ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సలహాలూ, సూచనలు అందించడం వల్ల నేరాల్ని నియంత్రించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఖాతాదారులు తమ కష్టార్జితం పరుల పాలవుకుండా ఉండేందుకు బ్యాంకు సిబ్బంది సహాయంతో ఏటీఎం సెంటర్ల వద్ద అవగాహన, సూచనలతో కూడుకున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించాలని పోలీసులు బ్యాంకు సిబ్బందికి ఆదేశించారు.
ఎనీ టైం అప్రమత్తం!
Published Sat, Jun 20 2015 2:37 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement