సాక్షి, అమరావతి : చట్ట సభల సమయం చాలా విలువైందని దాన్ని వృథా చేయరాదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అన్నారు. ఆయన బుధవారం శాసనసభ కమిటీ హాలు–1లో జరిగిన ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల పునశ్చరణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించారు. ఏటా శాసనసభ కార్యకలాపాల కోసం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నామని, ఆ ప్రకారం సభ జరిగే ప్రతి గంటకు రూ.6 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. శాసనసభ్యులు క్రమశిక్షణ, సరైన అవగాహన, సంసిద్ధతతో వచ్చినప్పుడే చట్ట సభ సజావుగా జరుగుతుందని, అప్పుడే చర్చలు అర్థవంతంగా ఉంటాయన్నారు. ఎమ్మెల్యేలు ఏ సమస్యను ప్రస్తావించాలన్నా దానికొక నిబంధన ఉంటుందని దాని ప్రకారం వస్తే మాట్లాడే అవకాశం దొరుకుతుందన్నారు.
సభలో ఎమ్మెల్యేలు ప్రవర్తించే తీరు, వారి హుందాతనమే మళ్లీ వారిని ప్రజలు ఎంపిక చేసుకునేలా చేస్తుందని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన సభకూ, ఇకపై జరుగబోయే సభా కార్యక్రమాలకు స్పష్టమైన వ్యత్యాసం ఉండాలని, ప్రజలు ఈ విషయం తెలుసుకునేలా చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపైనే ఉందన్నారు. శాసనసభ జరిగే తీరును బట్టే ప్రభుత్వ ప్రతిష్ట, సీఎం ప్రతిష్ట ఇనుమడిస్తుందని చెప్పారు. సభలోకి వచ్చేటప్పుడు పూర్తి వాస్తవాలతో రావాలని, అవాస్తవాలు వద్దని ఆయన హితవు పలికారు.
ఎమ్మెల్యేలు మంచి వక్తలుగా రాణించాలని కూడా ఆయన సూచించారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, అంబటి రాంబాబు, కరుణాకర్‌రెడ్డి, ఉషశ్రీచరణ్, అప్పలరాజు వంటి వారు మంచి వక్తలని, వారు సభలో బాగా మాట్లాడారని సీతారామ్ కితాబు నిచ్చారు. ఆయా అంశాలపై మాట్లాడే వారిని ఎంపిక చేసి తాము ముఖ్యమంత్రికి నివేదిక కూడా ఇస్తామని స్పీకర్ అన్నారు. శాసనసమండలి ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ.. సమాజంలో 70 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సమస్యలను మానవతా దృక్పథంతో చట్టసభల్లో ప్రస్తావించాలన్నారు. ఏ సామాజిక వర్గం నుంచైతే ఎన్నికయ్యారో.. వారి సమస్యలను సభలో ప్రతిబింబింప జేయాలన్నారు.
ప్రజా ధనం పొదుపు చేస్తున్నాం: మంత్రి బుగ్గన
ప్రజా ధనాన్ని ఎంత మాత్రం దుబారా చేయకూడదని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని, ఆయన భావాలకు అనుగుణంగానే తాము పునశ్చరణ తరగతులను గతంలో మాదిరిగా 5 స్టార్, 7 స్టార్ హోటళ్లలో కాకుండా శాసనసభ కమిటీ హాలులో సాదాసీదాగా నిర్వహిస్తున్నామని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఎంత ఆడంబరంగా శిక్షణా కార్యక్రమాన్ని నడిపించామన్నది ప్రధానం కాదని, ఏ మేరకు శాసనసభ్యులు, ఎమ్మెల్సీలకు విషయ అవగాహన కలిగించామన్నదే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. నిజంగా ప్రతి రూపాయిని పొదుపుగా ఖర్చు చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. శాసనసభలో మాట్లాడేది వేరు, బహిరంగ సభల్లో మాట్లాడే తీరు వేరు అనేది లెజిస్లేటర్లు తప్పకుండా గ్రహించాలని చెప్పారు.
మీ నాన్నకు కృతజ్ఞతలు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లనే రాష్ట్రంలో శాసనమండలి ఏర్పడిందని, ఆయన వల్లే తామంతా ఇవాళ శాసనమండలి సభ్యులుగా ఎన్నికయ్యామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ రామసూర్యారావు సీఎం వైఎస్ జగన్‌కు వివరించారు. వైఎస్సార్‌కు తాము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని చెప్పారు. కాగా, శిక్షణా తరగతులకు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. మండలి చైర్మన్ హోదాలో ఎంఏ షరీఫ్, బీజేపీ, జనసేన, పీడీఎఫ్ లెజిస్లేటర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment