బ్లాక్‌మనీతో ఎమ్మెల్యేలను కొన్నది ఎవరు?
అమరావతి: బ్లాక్ మనీ సూట్ కేసులో పెట్టుకుని ఎమ్మెల్యేలను కొన్నది ఎవరని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి వైఎస్ జగన్‌పై నోరు పారేసుకున్నారు.
ప్రతిపక్ష నేతపై వ్యక్తిగత దూషణలతో పాటు ఎదురు దాడికి దిగారు. దాంతో వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ... బ్లాక్‌మనీ సూట్‌కేసులో పెట్టుకుని ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయింది ఎవరూ అని ప్రశ్నించారు. అధికార పక్షం నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పడమే పనిగా మారిందన్నారు. తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతా...
’నా ఆస్తులపై టీడీపీ పదేపదే దుష్ప్రచారం చేస్తోంది. రూ.43వేల కోట్లని మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు. అందులో పదోవంతు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతా. ఊరికే మాట్లాడటం చంద్రబాబుకు, అచ్చెన్నాయుడుకు అలవాటైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక, నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లాక నాపై అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు, కాంగ్రెస్ కుమ్మక్కై అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రన్నాయుడుతో కేసు వేయించారు.
11 ఛార్జ్‌షీట్లతో తేలింది కేవలం రూ.1200 కోట్లు. అది కూడా కేసుకు సంబంధం లేని వాటిని ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ఏబీసీ రికార్డుల ప్రకారం దేశంలోనే ’సాక్షి’ ఎనిమిదో స్థానంలో ఉంది. 1800 కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు రూ.100 షేర్‌ను షేర్లు 5 లక్షల 26 వేలకు అమ్మితే ...మేం మా షేర్లను ఈనాడు కన్నా సగం ధరకే అమ్మాం. సాక్షి ఇన్వెస్టర్లంతా లాభాల్లోనే ఉన్నారు. టీడీపీ నేతలు రికార్డులు చూసి మాట్లాడటం నేర్చుకోవాలి. నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు.’ అని అన్నారు.