
సాక్షి , రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శుక్రవారం తొలి ఏకాదశి రోజున తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌పై జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ జిల్లా దిశ, దశను మార్చేస్తుందని, అన్ని వర్గాలకూ మేలు చేసేదిగా, జనరంజకంగా, సంక్షేమానికి పెద్ద పీట వేసేదిగా ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉండటాన్ని పార్టీలకు అతీతంగా అందరూ స్వాగతిస్తున్నారు. ప్రధానంగా వ్యవసాయ ఆధారమైన మన జిల్లాకు ఈ బడ్జెట్ వరాల జల్లు
బీమా ఇక భారం కాదు
అమలాపురం టౌన్: ఇక పంటల బీమా కోసం ప్రీమియం సొమ్ములు చెల్లించే భారం ఇక రైతులకు ఉండదు. నూటికి నూరు శాతం రైతులకు ఇక బీమా ధీమా కానుంది. ముఖ్యమంత్రి జగన్ మాది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నట్టే వారికి పంటల బీమాపై పూర్తి భరోసా ఇచ్చారు. వైఎస్సార్ పీఎం ఫసల్ ఉచిత పంటల బీమా పథకం కింద ప్రభుత్వమే చెల్లించేలా చేశారు. రాష్ట్ర శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ ఎన్నో రాయితీలు, ఉచితాలు ఇచ్చారు. ఉచిత పంటల బీమా పథకానికి ఏకంగా రూ.1,166 కోట్లు కేటాయించారు.
ఈ కేటాయింపు ప్రకారం చూసుకుంటే వ్యవసాయ జిల్లా అందులోనూ పెద్ద జిల్లా అయిన తూర్పు గోదావరి జిల్లాకు దాదాపు రూ.20 కోట్ల కేటాయింపు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వ్యవసాయానికి ప్రకటించిన ఎన్నో పద్దులు మన జిల్లాకు వాటాగా అన్వయించుకుని లెక్కలు కట్టుకుంటే రూ.కోట్ల కేటాయింపు ఉండడంతో జిల్లా రైతులు బడ్జెట్‌పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ పీఏసీఎస్‌లలో రైతులకు పంట రుణాలు ఇచ్చినప్పుడు ఆ రుణం మొత్తంలో రెండు శాతం సొమ్ములను పంటల బీమా కింద వసూలు చేసి ప్రీమియం చెల్లించే పరిస్థితి ఉండేది. జిల్లాలోని 304 వ్యవసాయ సహకార సంఘాల్లో దాదాపు రెండు లక్షలకు పైగా రైతులు సభ్యులై ఉన్నారు.
అయితే ఇందులో దాదాపు 1.8 లక్షల మంది వరకూ పంట రుణాలు ఏటేటా తీసుకుని వ్యయసాయ పెట్టుబడులకు సద్వినియోగం చేసుకుంటున్నారు. రైతులు సహకార సంఘాల్లో రుణం తీసుకున్నప్పుడు రెండు శాతం సొమ్ములు అంటే దాదాపు రూ.1,500 పంటల బీమా కింద ఆయా సంఘాలు కట్ చేసి ప్రీమియంలు చెల్లించేవి. ఇదంతా గతం. ఇప్పుడు వైఎస్సార్ పీఎం ఉచిత పంటల బీమా పథకం కింద రైతులు ఇలా రుణం తీసుకున్న సొమ్ముల నుంచో.. సొంత సొమ్ముల నుంచో చెల్లించే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వమే ఇక నుంచి బీమా ప్రీమియంలు రూ.600 వంతున రెండు దఫాలు చెల్లించే వెసులుబాటు కల్పించారు. అంటే ఈ ఉచిత పథకం వల్ల జిల్లాలో దాదాపు 1.8 లక్షల మంది రైతులకు ఉరటనివ్వనుంది. ఆర్థికంగా కొంత భారం తగ్గే పరిస్థితి ఉంటుంది. ఇంత మంది రైతులకు మొత్తం రూ.16.08 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.
మత్స్యకారుల్లో ఆనందోత్సాహాలు
కాకినాడ సిటీ: వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ప్రభుత్వం అందించే భృతికి రూ.100 కోట్లు కేటాయించడంతో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 13 తీర ప్రాంత మండలాల్లో సుమారుగా 3.5 లక్షల మంది మత్స్యకారులు కడలిని నమ్ముకుని బతుకుతున్నారు. గత ప్రభుత్వం రెండేళ్లుగా అరకొరగా ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున భృతిని అందిస్తూ సవాలక్ష నిబంధనలు పెట్టేది. జిల్లాలోని తుని, యు.కొత్తపల్లి, కాకినాడ రూరల్, సిటీ, తాళ్లరేవు, ఐ పోలవరం, ముమ్మిడివరం, కరప, ఉప్పలగుప్తం, అమలాపురం, అల్లవరం, మలికిపురం, కాట్రేనికోన తదితర మండలాలకు చెందిన సుమారు 42 గ్రామాల పరిధిలో లక్ష మందికి పైగా మత్స్యకారులు చేపల వేటమీద ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వం అందించిన లెక్కల ప్రకారం వారిలో సుమారు 60 వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరనుంది.
బోట్ల డీజిల్‌కు ప్రత్యేక నిధులపై హర్షం
మత్స్యకారులు వేటాడే బోట్లకు డీజిల్ సబ్సిడీ అందించేందుకు రూ.100 కోట్ల కేటాయింపుపై మత్స్యకార వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నారు. జిల్లాలో ఫిషింగ్ మెకనైజ్డ్ వెజల్స్ 435, మోటరైజ్డ్ ఫిషింగ్ బోట్స్, 3,485లతో పాటు మరో 1,221 మరబోట్లకు సంబంధించి మత్స్యకారులకు ఉపయోగమని వారు అంటున్నారు.
పింఛన్‌దారులకు భారీ కేటాయింపులు
వృద్ధులకు పింఛన్ రూ.2 వేలు పెంచుకుంటూ రూ.3 వేల వరకూ చేస్తానని ఎన్నికలకు ముందే హామీ ఇచ్చారు. ముందు రూ.250 పెంచి రూ.2250 చేశారు. ఇప్పుడు బడ్జెట్‌లో 12 విభాగాలుగా పింఛన్‌దారులకు రాష్ట్ర బడ్జెట్‌లో రూ.15,813.51 కోట్లు కేటాయించడంతో పింఛనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5,81,033 మంది పెన్షనర్లకు నెలకు రూ.139.97 కోట్లు అందజేస్తున్నారు.
ఆశా వర్కర్ల హర్షం
సంకల్ప యాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి శుక్రవారం నాటి బడ్జెట్‌లో రూ. 455.85 కోట్లు కేటాయించడంపై ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 4,500 మంది ఆశా వర్కర్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.
సొంతింటి కల నేరవేరే వేళ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటి): టీడీపీ హయాంలో ప్రతి నియోజకవర్గంలో కుప్పలు తెప్పులుగా పేరుకుపోయిన ఇళ్ల దరఖాస్తులకు మోక్షం లభించలేదు. ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 15 వేలు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. పాదయాత్ర సమయంలో సొంత ఇళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో ఉంచుకొని సీఎం ప్రస్తుత బడ్జెట్‌లోనే రూ. 9785.75 కోట్లు కేటాయించారు.
ఈ బడ్జెట్‌లో జిల్లాకు రూ.752 కోట్లు వరకూ వస్తుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ హయాంలో అరకొరగా కేటాయించిన ఇళ్లకు సైతం బిల్లులు ఇవ్వలేదు. జిల్లాలో 16 వేల మంది ఇళ్లు వివిధ దశల్లో ఉండగా వాటికి రూ. రూ.50 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత బడ్జెట్‌లో గృహ నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించడంలో పెండింగ్ బిల్లులతో పాటు కొత్తగా నిర్మాణాలు చేసుకొనే వారికి ఎంతో ఊరటనివ్వడంతో వారి ఆనందానికి అవధులేవు.
పెట్టుబడికి భరోసా
అమలాపురం: నవరత్నాలలో అన్నదాతకు దన్నుగా నిలిచే ‘రైతు భరోసా’ వచ్చే రబీ నుంచి అమలులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిలో భాగంగా శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో రైతు భరోసాకు రూ.8,750 కేటాయించారు. రైతుకు రూ.12,500 అందించనున్నారు. తొలుత ఇది వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి అమలు అవుతుందని భావించినా, ప్రభుత్వం రబీ నుంచే అమలు చేయాలని నిర్ణయించడంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కౌలురైతులకు సైతం దీనిని వర్తింపజేశారు. ఈ పథకం వల్ల జిల్లాలో 6.73 లక్షల మంది రైతులకు మేలు జరగనుందని ప్రాథమిక అంచనా.
ఏటా వీరందరికీ రూ.841.25 కోట్ల పెట్టుబడి ప్రోత్సాహంగా అందనుంది. జిల్లా వ్యాప్తంగా 64 మండలాల్లో సుమారు 6,81,720 ఎకరాల ఆయకట్టు ఉంది. వరి సాగులో అత్యధికంగా 4.6 లక్షల మంది వరి రైతులున్నారని అంచనా. తరువాత 80 వేల మంది కొబ్బరి రైతులు, 25 వేల మంది ఆయిల్‌పామ్ రైతులు, 30 వేల మంది ఉద్యాన పంట రైతులు, 29 వేల మంది కూరగాయ పంట రైతులు, ఇతర పంటలు, అధికారంగా నమోదైన కౌలురైతులు కలిపి సుమారు 49 వేల మంది వరకు ఉన్నారని అంచనా.
లబ్ధిదారుల్లో మూడు వంతుల మంది సన్న, చిన్నకారు రైతులే
సుమారు 60 శాతం మంది రైతులు ఎకరం, ఎకరంన్నర సాగు చేసేవారు కావడం గమనార్హం. దీనిలో వరి రైతులు అత్యధిక శాతం మంది ఉన్నారు. వరి సాగుకు జిల్లాలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం అయ్యే పెట్టుబడి రూ.35 వేలు. దీనిలో రూ.12,500 ప్రోత్సాహంగా అందితే మిగిలిన పెట్టుబడి 22 వేల 500 మాత్రమే. సాధారణంగా రైతులు తొలి పెట్టుబడి కోసమే అప్పులు చేస్తుంటారు. తరువాత బ్యాంకు నుంచి రుణం అందే వెసులుబాటు ఉంది. రైతు భరోసా వల్ల తాము ప్రైవేటు అప్పులపై పెద్దగా ఆధారపడాల్సిన అవసరముండదు. వారి దగ్గర అప్పులు చేయడం, తరువాత అయినకాడికి వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఉండదని రైతులు ధీమాతో ఉన్నారు.
చిన్న రైతులకు మేలు
రైతు భరోసా ద్వారా ఎకరాకు రూ.12,500 ఇవ్వడం వల్ల చిన్న, సన్నకారు రైతులకు చాలా మేలు జరుగుతుంది. అర ఎకరం, ఎకరం, రెండు ఎకరాల ఉన్న రైతులకు పెట్టుబడిలో చాలా వరకు ఉపయోగపడుతోంది. ముఖ్యంగా జిల్లాలో వరి రైతులు నష్టపోవడానికి పెట్టుబడుల కోసం బయట అప్పులు చేయడం కూడా ఒక కారణం. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం కొంత వరకు ఉపయోగపడుతోంది కాబట్టి ప్రైవేట్ అప్పుల బెడద చాలా వరకు తీరినట్టే.
– సిహెచ్.సూర్యనారాయణరాజు, రైతు, మాగం, అయినవిల్లి మండలం.
బడ్జెట్‌లో చేనేత రంగానికి ఊరట
రామచంద్రపురం: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో చేనేతలకు ఊరట కలిగించే విధంగా నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆ వర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చేనేతలకు బడ్జెట్‌లో ఈసారి రూ.200 కోట్లను కేటాయించారు. దీంతో జిల్లాలోని 50 చేనేత సహకార సంఘాలు, వీటి ద్వారా సుమారుగా 17 వేలకు పైగా చేనేత కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న చేనేత సహకార సంఘాలకు రావలసిన సుమారు రూ. 9 కోట్లు ఆప్కో వద్ద స్తంభించిపోయాయి. ఈ బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించటం ద్వారా నిలిచిపోయిన బకాయిలు వచ్చే అవకావం ఉందని నేతన్నలు భావిస్తున్నారు.
మెట్ట ప్రాంతాల్లో బోర్లకు రూ.200 కోట్లు
సర్పవరం (కాకినాడ రూరల్): నవరత్నాల పథకాల్లో ఒకటైన రైతు భరోసాలో భాగంగా ఉచితంగా బోరు బావులు తవ్వేందుకు బడ్జెట్‌లో ఈ ఏడాది రూ.200 కోట్లను ప్రతిపాదించారు. జిల్లాలో మెట్ట, ఏజెన్సీ ప్రాంతంలో రైతులు చాలా మంది బోర్లపై ఆధారపడి సాగు చేస్తున్నారు. మెట్టలోని సుమారు 13వేల బోర్లు వినియోగంలో ఉన్నాయి. వాటికి ఉచిత విద్యుత్ కోసం బడ్జెట్‌లో రూ.4525 కోట్లు కేటాయించడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రైతులకు ఆర్థిక చేయూత
ఉచితంగా బోర్లు తవ్వడం వల్ల రైతులకు ఆర్థిక చేయూత ఇచ్చినట్టే. బోరు తవ్వేందుకు అడుగుకు రూ.60 చొప్పున చెల్లించాలి. 300 అడుగులకు రూ.18 వేలతో పాటు కేసింగ్ పైపునకు ఖర్చు అవుతుంది. ఈ మొత్తం మాకు ఆదా అవుతుంది.
– అడ్డాల సుబ్బారావు, రైతు – గుర్రప్పాలెం, జగ్గంపేట మండలం
Comments
Please login to add a commentAdd a comment