నవ శకానికి 'పద్దు' పొడుపు | AP Budget Special News In YSR District | Sakshi
Sakshi News home page

నవ శకానికి 'పద్దు' పొడుపు

Published Sat, Jul 13 2019 10:14 AM | Last Updated on Sat, Jul 13 2019 10:14 AM

AP Budget Special News In YSR District - Sakshi

సాక్షి, కడప : నవ రత్నాలు.. ప్రభుత్వం ప్రజలకు అందించిన వరాలు..అన్నదాతకు అండగా రైతు భరోసా..మహిళల కష్టాలు తీర్చేందుకు వడ్డీలేని రుణాలు..అమ్మ ఒడితో ప్రతి పేద విద్యార్థి బడిబాట..పింఛన్ల పెంపుతో ధైర్యం..ఆరోగ్యశ్రీతో రోగాలు మాయం..సాగు, తాగునీటి కోసం ప్రాజెక్టులు..ఇదే ప్రభుత్వ లక్ష్యం.. సాధించే దిశగా ప్రయత్నం..ఇచ్చిన మాట నిలుపుకున్నందుకు..రాజన్న బాటలో నడుస్తున్నందుకు.. సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ప్రజారంజకంగా ఉంటోంది. ఈ దిశగా తొలి బడ్జెట్‌లో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. అన్ని వర్గాల ప్రజలకుమేలు చేకూరేలా రూపొందించారు. సొంత జిల్లాకు పెద్దపీట వేశారు. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వైద్యం.. ఆరోగ్య దీపం
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.11,399 కోట్లు, ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీకి రూ.1740 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి పేదకు నాణ్యమైన వైద్యం అందించేలా సర్కారు ముందుకు పోతోంది. చంద్రబాబు సర్కారు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడంతో పేదలు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పెద్దఎత్తున నిధులు ఇచ్చారు. దీంతో ప్రతి పేదకు రాష్ట్రంలోనే కాక, ఇతర ప్రాంతాల్లో వైద్యం చేయించుకునేలా వెసులుబాటు కల్పించే దిశగా నిధులు అందిస్తున్నారు. దీంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని ఆరోగ్యకేంద్రాలు మెరుగు పరిచేందుకు అవసరమైన స్థాయిలో నిధులు కేటాయింపు జరిగింది.

అమ్మ ఒడి.. నూతన ఒరబడి
అమ్మఒడి పథకం కింద పాఠశాల, ఇంటర్‌ కళాశాలలో చదివే విద్యార్థుల తల్లుల అకౌంట్‌లో ఏటా రూ.15 వేలు జమ చేయనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేట్‌ పాఠశాలలో 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. జూనియర్‌ కళాశాలలో ప్రథమ, ద్వితీయ ఏడాది చదువుతున్న విద్యార్థులు 46 వేల మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేల వంతున అందిస్తే జిల్లా వ్యాప్తంగా రూ.780 కోట్లు లబ్ధి చేకూరుతుంది.

పేదలకు గృహయోగం
వైఎస్సార్‌ గృహ వసతికి మొత్తం రూ.5 వేల కోట్లు, బలహీన వర్గాల ఇళ్లకు రూ.1280 కోట్లు కేటాయించారు. దీంతో దాదాపుగా అర్హులందరికీ గృహ యోగం కలగనుంది. టీడీపీ ప్రభుత్వంలోని మూడేళ్ల కాలంలో జిల్లాకు మొత్తం 55 వేల గృహల కేటాయింపులు జరిగాయి. పెండింగ్‌లో ఉన్న రూ. 40 కోట్లు మంజూరు కానందున ఇప్పటికీ 22 వేల గృహలు వివిధ దశల్లో నిలిచిపోయి ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న చర్యల కారణంగా పేదల కష్టాలు త్వరలో తీరిపోనున్నాయి. దీంతో తామంతా అతి త్వరలో సొంతింటికి యజమానులం కాబోతున్నామని సంతోషపడుతున్నారు.

మండలానికి ఒక ‘108’ అంబులెన్స్‌
జిల్లాలో ప్రస్తుతం రెండు బ్యాకప్‌తో కలిపి మొత్తం 30 వాహనాలు ఉన్నాయి. అందులో కండీషన్‌లో లేని వాహనాలు 20 ఉన్నాయి. దీంతో ఆపదలో ఉండే బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడా పరిస్ధితికి అడ్డుకట్ట పడనుంది. ప్రభుత్వం మండలానికి ఒక అంబులెన్స్‌ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా జిల్లాలోని 50 మండలాలకు  స రిపడా కొత్త వాహనాలు త్వరలో రానున్నాయి. అలాగే గ్రామీణ వైద్యంలో కీలకంగా ఉన్న 104 సంచార వైద్యానికి కూడా మంచి రోజులు రానున్నాయి.

ఉక్కు సంకల్పం
స్టీల్‌ ఫ్యాక్టరీకి డిసెంబరు 26న శంకుస్థాపన చేయనున్నట్టు గత వారంలో జమ్మలమడుగులో జరిగిన రైతు దినోత్సవంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు బడ్జెట్‌లో ఉక్కు ఫ్యాక్టరీకి  రూ.250 కోట్లు కేటా యించారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తి చేసేందుకు నిర్ణయించారు. ఇందులో మొదటి దశగా నిధులు కేటాయించారు. 

నెరవేరిన ఆశ
జిల్లాలో 2,131 మంది ఆశావర్కర్లు ఉన్నారు. గతంలో వీరి వేతనం రూ.3వేలు ఉండగా ప్రస్తుతం దీన్ని రూ.10 వేలకు పెంచారు. ఈ లెక్కన వారి ప్రతి నెలా రూ.21.31 కోట్లు జీతాల రూపంలో చెల్లిస్తున్నారు. గతంంలో కంటే దాదాపు రూ.15 కోట్లు అదనంగా ఆశావర్కర్లకు జీతాలు అందుతున్నాయి.

పింఛన్‌.. పెంచెన్‌ 
వైఎస్సార్‌ పింఛన్‌ కానుకకు రూ.12,801 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద జిల్లాలో 3,01,387 మందికి లబ్ధి చేకూరనుంది. గతంలో నెలకు దాదాపు రూ.54 కోట్లు ఇచ్చే వారు. జగన్‌ సీఎం కాగానే పింఛన్ల మొత్తాన్ని పెంచారు. ఈ లెక్కన గతంలో ఇచ్చిన దాని కంటే అధికంగా రూ.20 కోట్లతో కలిపి ప్రతి నెలా రూ.73 కోట్లు పింఛన్‌దారులకు అందిస్తున్నారు. సగటున ఏడాదికి రూ.240 కోట్లు జిల్లాలోని పింఛన్‌దారులకు లబ్ధి చేకూరుతుంది.
వైఎస్సార్‌ కల్యాణ పథకం :  రూ.716 కోట్లు
పింఛన్‌దారులు : 3,01,387 మంది 
ప్రతి నెలా అందించే మొత్తం : రూ.73 కోట్లు

రుణ మాఫీ
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో 33,226 స్వయం సహయక సంఘాల్లోని 3,22,260 మంది మహిళా సభ్యులు ఇప్పటి వరకు తీసుకున్న రుణం రూ. 1097 కోట్ల వరకు ఉంది. అలాగే మెప్మా పరిధిలో 1.17 లక్షల సంఘాల్లో 1,17,000 మంది సభ్యులు రూ 471.76 కోట్ల రుణాలు తీసుకున్నారు. మొత్తం 4,30,260 మంది సభ్యులు మొత్తం తీసుకున్న రుణం రూ. 1568.76 కోట్ల రుణం నాలుగు విడతల వారీగా రుణ మాఫీ కానుంది. ఈ రుణ మాఫీతో మహిళా సభ్యులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. గత ప్రభుత్వంలో సభ్యులు ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement