ఒక్కటిగా కదిలి.. ఉద్యమమై రగిలి..
మాటలతో మోసపుచ్చారు..పచ్చని రాష్ట్రాన్నిరెండు ముక్కలు చేశారు..ప్రత్యేక హోదా పేరిట మభ్యపెట్టారు.. ఓట్లు దండుకుని అందలమెక్కారు.. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారు.. చివరకు సాధ్యపడదని చేతులెత్తేశారు..ప్యాకేజీతో సరిపెట్టే ప్రయత్నానికి తెరతీశారు.. ఇప్పటి దాకా మౌనం దాల్చిన ప్రజలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మోసంపై భగ్గుమన్నారు.. పార్టీలకు అతీతంగా కదిలి గళమెత్తారు..రాష్ట్ర బంద్‌తో పాలకులకు హెచ్చరిక జారీ చేశారు.. మాట నిలుపుకోవాలని నినదించారు.. వెనక్కు తగ్గితే.. గద్దె దింపుతామని గర్జించారు.
కర్నూలు(జిల్లా పరిషత్) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో మంగళవారం చేపట్టిన జిల్లా బంద్ విజయవంతమైంది. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితం కాగా.. విద్యాసంస్థలు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు ముందుగానే సెలవు ప్రకటించాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిం చాయి. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, ఆత్మకూరు, మంత్రాలయం, కోడుమూ రు, డోన్, పాణ్యం, ఆలూరు, పత్తికొండ, శ్రీశైలం, సున్నిపెంటలో బంద్ ప్రభావం కనిపించింది. సీపీఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఆ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాలు నగరంలో బంద్‌ను పర్యవేక్షించాయి.
వైఎస్‌ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు నరసింహులుయాదవ్ ఆధ్వర్యంలో నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొత్తబస్తాండ్, రాజ్‌విహార్, ఎన్‌టీఆర్ సర్కిల్, సి.క్యాంప్ సెంటర్లలో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మాజీ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం నుంచి బైక్ ర్యాలీ చేపట్టారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.షడ్రక్, జిల్లా కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలోనూ బంద్ సాగింది.
వీరితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఐక్యవేదిక అధ్యక్షుడు టిజి వెంకటేష్, కర్నూలు ఎడ్యుకేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలు వి.జనార్దన్‌రెడ్డి, జి.పుల్లయ్య తదితరులు రాజ్‌విహార్ వద్ద రాస్తారోకో చేసి, కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పి.బి.వి.సుబ్బయ్య ఆధ్వర్యంలో రాజ్‌విహార్, కలెక్టరేట్ వద్ద రాస్తారోకో చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు.