రాజధాని అభివృద్ధి కోసం నూతన కమిటీ
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రతిపాదిత ప్రాంతాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు పురుపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్ మెంట్ కమిటీ (సీసీడీఎంసీ) పేరుతో కార్యకలాపాలు సాగించే ఈ కమిటీ ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం లభించిందని చెప్పారు. బుధవారం హైదరాబాద్లో మంత్రివర్గ సమావేశం అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు.
రాజధాని ప్రాంతంతో రైలు, వాయు, బస్సు, ట్రాన్సిస్ట్, వాటర్ సప్లై, డ్రైనేజ్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాలన్నింటిని సీసీడీఎంసీయే స్వయంగా చేపడుతుందన్నారు. 7,325 చదరపు కిలోమీటర్ల సీఆర్డీఏ పరిధి నుంచి రాజధాని కోసం నిర్దేశించిన 225 చదరపు కిలోమీటర్లలో మాత్రమే సీసీడీఎంసీ కార్యకలాపాలు సాగిస్తుందని వివరించారు. టూరిజం అభివృద్ధి కోసం 10 వేల ఎకరాల్ని సీసీడీఎంసీ తీసుకుంటుందన్నారు.సరస్సుల నిర్మాణానికి వెయ్యి ఎకరాలు కేటాయించామని, దీనివల్ల సీడ్ క్యాపిటల్ మరింత పెరిగే అవకాశముందన్నారు.
దీనితోపాటు మంగళగిరి, విజయవాడ నగరాలను ఎలా అభివృద్ధి చేయాలన్నదానిపైనా కమిటీ దృష్టిసారిస్తుందన్నారు. ఇందుకోసం సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన ప్లాన్ మే 15 నుంచి 20 లోగా ఏపీ ప్రభుత్వానికి అందుతుందన్నారు. ప్లాన్ అందిన వెంటనే ప్రజలకు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు.