నేను రాజీనామా చేసినట్లు ఎవరు చెప్పారు?
అమరావతి: మంత్రి పదవికి రాజీనామా చేశారన్న వార్తలపై మంత్రి రావెల కిషోర్ బాబు తీవ్రస్థాయిలో మండ్డిపడ్డారు. తాను రాజీనామా చేసినట్లు ఎవరు చెప్పారంటూ ఆయన విరుచుపడ్డారు. శనివారం సాయంత్రం మంత్రి రావెల...ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. అనంతరం ఆయనను మీడియా ప్రశ్నించగా, పైవిధంగా అసహనం వ్యక్తం చేశారు. అయితే కేబినెట్ మార్పులు, చేర్పులు అనేది సీఎం నిర్ణయమని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని రావెల అన్నారు.
ఇక గుంటూరు జిల్లాలో అమాత్య పదవులు సంక్లిష్టంగా మారుతోంది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంత్రి పదవి ఆశిస్తున్నా ప్రస్తుతానికి ఆయనను కదిలించే పరిస్థితి లేదని టీడీపీ నాయకత్వం ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తనకు కేబినెట్‌లో స్థానం కల్పించకపోయినా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, ఆలపాటి రాజా, యరపతినేని శ్రీనివాసరావుకు మంత్రి పదవి ఇవ్వొద్దని స్పీకర్ చెప్పినట్టు సమాచారం. అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రస్తుతం సేఫ్‌గానే కనిపిస్తున్నారు.
ప్రత్తిపాటి పుల్లారావును తొలగిస్తే ఆయనపై వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతుందనే ఉద్దేశంతో ఆయనను తప్పించకపోవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి. ఇక చాలా రోజులుగా రావెల కిశోర్ బాబును తొలగిస్తారనే కథనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. కిశోర్ బాబును తొలగిస్తే ఆయన స్థానంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబును తీసుకుంటారని సమాచారం. మరో వైపు ఎస్సీ కోటాలో కొత్తగా ఎమ్మెల్సీగా అయిన డొక్కా మాణిక్యవరప్రసాద్ జోరుగా పైరవీ చేయించుకుంటున్నారు. ఆయన రాజకీయ గురువు, గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ద్వారా డొక్కా పావులు కదుపుతున్నారు.