సాక్షి, అమరావతి : అమరావతి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విస్తృతమైన ఏర్పాటు జరుగుతున్నాయి. శనివారం ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. వెలగపూడి తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. సభా వేదిక, గ్యాలరీలు, బారి కేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, అతిథులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారంకు 5వేల మంది వస్తారని గుంటూరు జాయింట్ కలెక్టర్ హీమాన్షు శుక్ల తెలిపారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తామన్నారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్ లేకుండా సామాన్యులు ప్రమాణస్వీకారంకు హాజరుకావొచ్చన్నారు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. 1500 మందితో భద్రత ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
మరోవైపు మంత్రివర్గ ఏర్పాటుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా అయిదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయాలని నిర్ణయించారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా తన మంత్రివర్గంలో ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పిస్తానంటూ వైఎస్సార్‌ఎల్పీలో చేసిన ప్రకటన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు అవకాశం కల్పించనున్నారు. ఇది దేశ రాజకీయాల్లో కొత్త అధ్యాయం. బడుగు, బలహీన వర్గాలకు చెందిన అందరికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న లక్ష్యంతో అయిదుగురికి ఉప ముఖ్యమంత్రి హోదా కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారి. సామాజిక వర్గాలవారిగా సమ ప్రాధాన్యత కల్పించే కీలక నిర్ణయం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. స్పీకర్‌గా శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి గెలిచిన మాజీ మంత్రి తమ్మినేని సీతారంను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌ఎల్పీ సమావేశం అనంతరం తమ్మినేని సీతారం వైఎస్ జగన్‌తో భేటీకావడం ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తోంది. బీసీ (కళింగ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు స్పీకర్ పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment