
ఏపీ రాజధాని.. ‘అమరావతి’
త్వరలో అధికారికంగా వెల్లడి సిద్ధమైన కేపిటల్ మాస్టర్‌ప్లాన్
హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని ప్రాంతానికి ‘అమరావతి’ అని పేరు పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనుంది. ఈ నెల 21న గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం అనంత వరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మన్మథనామ సంవత్సర ఉగాది వేడుకల్లోనే రాజధాని ప్రాంతానికి అమరావతిగా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించాలని సీఎం చంద్రబాబు భావించారు. అందుకు అనుగుణంగా అమరావతి ప్రాశస్త్యాన్ని తెలియజేసే సమాచారాన్ని ఆయన తన వెంట తీసుకెళ్లారు. అయితే స్థానికంగా ఉగాది వేడుకల కార్యక్రమం సుదీర్ఘంగా సాగడంతో చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. ఈ క్రమంలో త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
29న సింగపూర్‌కు బాబు: ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ సంస్థలు రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు బృందం ఈ నెల 29న సింగపూర్ వెళుతోంది. ఈ నెల 31 రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుంది. ఆ తర్వాత మంచి రోజు చూసుకుని నూతన రాజధాని ప్రాంతం పేరును సీఎం వెల్లడిస్తారు. సింగపూర్ వెళ్లే బృందంలో చంద్రబాబుతో పాటు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ తదితరులున్నారు.