
సీమలోనే రాజధానిని నిర్మించాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన రాయలసీమలో రాజధాని నిర్మించడం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఏపీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి అన్నారు. రాజధాని నిర్మాణ ఖర్చును భరిస్తానని కేంద్రం హామీ ఇచ్చినందున సీమలో రాజధాని నిర్మిస్తే అక్కడ రైల్వే, విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. వాణిజ్య పన్నులశాఖ మాజీ కమిషనర్ జి.ఆర్.రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సీమలో ఎందుకూ పనికిరాని భూములు ఎన్నో ఉన్నాయని, కోస్తాలోని వ్యవసాయ భూములను నాశనం చేసి నిర్మాణాలు చేపట్టేకంటే ఇక్కడ రాజధానిని నిర్మిస్తే కోస్తా ప్రాంత భూములు ప్రజలందరికీ అందుబాటు ధరలో ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాయలసీమను అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం, రాజధానిని అక్కడే నిర్మిస్తామని చేసుకున్న శ్రీబాగ్ ఒప్పందం ప్రకారమే 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వెనుకబడిన రాయలసీమను అభివృద్ధి చేసుకునేందుకు ఇదే సువర్ణావకాశమన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. విజయవాడ, గుంటూరు ఇప్పటికే పెద్ద నగరాలని, అక్కడ రాజధానికి తగినవిధంగా మౌలిక సదుపాయాలు లేవని, ప్రజలు తిరిగి హైదరాబాద్ మాదిరి ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు.
రాయలసీమ అభివృద్ధి వేదిక ఏర్పాటు
రాయలసీమలో రాజధాని ఏర్పాటు అవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకోసం ‘రాయలసీమ అభివృద్ధి వేదిక ’ను ఏర్పాటు చేసినట్లు లక్ష్మణరెడ్డి తెలిపారు. తమ వేదిక ఆధ్వర్యంలో 22న అనంతపురం ఎస్‌కే యూనివర్సిటీలో రాయలసీమలోని నాలుగు జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల ప్రజలు, ప్రజాప్రతినిధులతో కలిసి రాజకీయాలకతీతంగా భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ సభ ద్వారా ఈ డిమాండును ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామనిచెప్పారు.