మా భూములివ్వం...
ముగ్గులతో నిరసన తెలిపిన మహిళలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన ఉండవల్లి, పెనుమాకలో సంక్రాంతి కళ తప్పింది. భోగి మంటలతో ప్రారంభమయ్యే సంక్రాంతి నిరసనలతో ప్రారంభమైంది. తమ నిరసనను ముగ్గుల రూపంలో తెలియజేస్తున్నారు. ఈ గ్రామాల్లో ఏటా సంక్రాంతి పండుగను రైతులు ఆనందోత్సాహాలతో జరుపుకునేవారు. కానీ ఈ ఏడాది రైతు కుటుంబాల్లో సంక్రాంతి హడావుడి కనిపించడంలేదు. రాజధాని పేరిట తమ భూములను కోల్పోయే పరిస్థితి రావడంతో వారిలో ఈ ఏడాది ఆనందం కరువైంది.
తమకు ఇష్టం లేకున్నా ల్యాండ్ పూలింగ్ పేరిట బలవంతంగానైనా ప్రభుత్వం భూములను లాక్కునేందుకు ప్రయత్నిస్తుండడం వారిలో ఆవేదనను కలిగించింది. దీంతో ఈ గ్రామాల్లోని రైతులు తెలుగువారి అతి పెద్ద పండుగ సంక్రాంతిని ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా ఈ ఏడాది పెనుమాక, ఉండవల్లి రైతుల ఇంట సంక్రాంతి శోభ కానరావడం లేదు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం పెనుమాక, ఉండవల్లి రైతుల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుంచి ఇక్కడి రైతులు ఏదో ఒక రూపంలో నిరసనలు తెలియజేస్తున్నారు. అయినా సర్కారు తన నిర్ణయూన్ని వెనక్కు తీసుకోలేదు. మూడురోజుల నుంచి పెనుమాక, ఉండవ ల్లి గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ప్రభుత్వ కార్యాలయంలో కూర్చొని భూమి ఇచ్చే రైతుల నుంచి అంగీకార పత్రాలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు.
మరోవైపు గ్రామాల్లో పోలీసు పికెట్‌ను ఏర్పాటుచేశారు. గత 50 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా పెనుమాక , ఉండవల్లివాసుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ భూములను రాజధాని నిర్మాణం కోసం ఇవ్వలేమని నిరసనలు వ్యక్తం చేస్తూ భోగి పండుగ రోజున రెండు గ్రామాల మహిళలు ముగ్గుల రూపంలో తమ వాణిని ప్రభుత్వానికి వినిపించారు. భూములిచ్చే ప్రసక్తే లేదని ముగ్గుల ద్వారా విన్నవించారు. ఈ సందర్భంగా ఏ రైతు కుటుంబాన్ని కదిలించినా ఆవేదనతో కూడిన మాటలు వినపడుతున్నాయి.
విషయం తెలుసుకున్న మీడియూ ప్రతినిధులు ఆ గ్రామాలను సందర్శించగా వారినుద్దేశించి రైతులు మాట్లాడుతూ.. చంద్రబాబు తమ గ్రామాల మీద కక్షకట్టి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూములు ఇవ్వనన్న తమపై బలప్రయోగం చేయడానికి సిద్ధమవుతున్నారని వాపోయూరు. గ్రామంలో పోలీసు పికెట్ పెట్టి ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను అర్ధం చేసుకోవాలన్నారు.