సాక్షి ప్రతినిధి కడప: ‘‘ఈరోజు రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు భూమిపూజ చేసుకున్నాం. మూడు నెలల్లోపు పనులు ప్రారంభించి, రెండేళ్లలోపు స్టీల్‌ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. వైఎస్సార్ జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కుఫ్యాక్టరీకోసం గురువారం ఉదయం 11.12 గంటలకు ఆయన భూమి పూజ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం తోడుగా ఉంటుందని భావిస్తే మోసగించిందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల్ని అమలు చేయాలని కోరినా నిర్లక్ష్యం చేసిందన్నారు. విభజన చట్టంలో 6 నెలల్లోపు సెయిల్ నేతృత్వంలో విచారణ చేపట్టి కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని ఉంటే, 2014 నవంబర్‌లో ఉక్కు వయబులిటీ లేదని సెయిల్ రిపోర్టు ఇచ్చిందన్నారు. అయితే ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తే 18.9 శాతం ఆదాయం వస్తుందని మెకాన్ సంస్థ రిపోర్టు ఇచ్చిందని, అప్పటినుంచి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కోరామని, వారడిగిన విషయాలన్నింటికీ ఓపిగ్గా 11సార్లు సమాధానం చెప్పామని, 2018 జూన్‌లో ప్రధానిమంత్రికి లేఖ కూడా రాశామని, అయినా కేంద్రం స్పందించలేదన్నారు. దీంతో కసి, బాధ, ఆవేదనతో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి సిద్ధమయ్యామన్నారు.
ఎన్నికల ప్రచారంకోసం కాదు....
ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన ఎన్నికల ప్రచారం కోసం కాదని సీఎం అన్నారు. తన సంకల్పం వేరని, దూరదృష్టితో వ్యవహరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తాం. తొలివిడతలో రూ.18వేల కోట్లతో నిర్మిస్తాం. మరో ఐదేళ్లల్లో రూ.15 వేల కోట్లు వెచ్చిస్తాం. తొలివిడతగా 5వేల ఉద్యోగాలు, రెండోవిడతలో 5వేల ఉద్యోగాలొస్తాయి. పనులు ప్రారంభమైనప్పటినుంచి రెండేళ్లలోపు ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని చెప్పారు. 2020 నాటికి ఓబుళాపురం ఐరన్ ఓర్ గనులు కోర్టు వివాదం ముగిసే వీలుందని, ఉక్కు ఫ్యాక్టరీకి కావాల్సిన ముడి ఖనిజం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మాణం తన భుజస్కంధాలపై ఉందన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంతో కడప అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రానికి సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌గా నామకరణం చేశానని, ఆ మేరకు అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు. అప్పుల ఊబిలో ఉన్నా తెలంగాణ, తమిళనాడు, కేరళ కంటే ఎక్కువగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఇంత చేస్తున్నాం.. 2014లో టీడీపీ అధికారంలోకి రాకుంటే రాష్ట్రం పరిస్థితి ఏమిటో అంచనా వేయండి.. మీ తోడ్పాటు అవసరం అని ఆయన ప్రజానీకాన్ని కోరడం గమనార్హం.
రాయలసీమను పరిశ్రమల గడ్డగా మారుస్తా..
రాయలసీమకు ఏమీ చేయలేదని కొంతమంది మాట్లాడుతున్నారని, గోదావరి–కృష్ణా నదులు పట్టిసీమ ద్వారా అనుసంధానం చేసి, కృష్ణా డెల్టా నీరు శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు తీసుకొచ్చామని సీఎం అన్నారు. ఎడారిని తలపించే అనంతపురం జిల్లాలో కియో మోటార్స్ ఏర్పాటు చేశామని, జనవరిలో రోడ్డుపైకి అనంతపురంలో తయారైన కారు రానుందని చెప్పారు. భవిష్యత్‌లో రాయలసీమ హార్టికల్చర్ హబ్ కానుందని, పరిశ్రమల గడ్డగా మారుస్తానని పేర్కొన్నారు. గోదావరి నీళ్లను సోమశిల, నాగార్జునసాగర్ రైట్ కెనాల్‌కు తీసుకెళ్లి, శ్రీశైలం నీటిని రాయలసీమకే ఉపయోగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు ఆదినారాయణరెడ్డి, సుజయ్‌కృష్ణ రంగారావు, ఎంపీ రమేష్‌నాయుడు, శాసనమండలి ప్రభుత్వ విప్ రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, బీటెక్ రవి, ఎమ్మెల్యే జయరాములు, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రెండేళ్లల్లో స్టీల్ ప్లాంట్ పూర్తి చేస్తాం
Published Fri, Dec 28 2018 2:15 AM | Last Updated on Fri, Dec 28 2018 10:54 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment