అంతొద్దు..తమ్ముళ్లకు బాబు క్లాసు
‘సార్.. ఆ పోలీస్ అధికారి మా మాట అస్సలు వినడం లేదు. ఇంకో అధికారి మనోళ్లు ఇసుక తోలుకెళ్తున్నా ఊరుకోవడం లేదు. కేసుల మీద కేసులు రాస్తున్నాడు. వీళ్ల విషయం మీరు చూడాల’ని శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడుకు ఇద్దరు నేతలు ఫిర్యాదు చేశారట. అంతే చంద్రబాబు అంతెత్తున లేచారట. మంత్రులు, విప్‌లు, ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా జిల్లా మొత్తం మీద ఇటీవల కాలంలో హడావుడి చేస్తున్న ఓ స్థానికసంస్థల ప్రజాప్రతినిధిని సీఎం ఎడాపెడా వాయించి పారేశారని అంటున్నారు. ‘నోర్ముయ్. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావ్. ఏ అధికారిని ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. మీ జిల్లాకు అనువైన అధికారులనే వేశాను. వాళ్లతో దగ్గరండి పనిచేయించుకోండి. నాయకత్వమంటే అదే’ అని భారీ క్లాస్ పీకారని చెబుతున్నారు.
ఇదేవిధంగా గోదావరి తీరానికి చెందిన ఓ ఎమ్మెల్యేపై కూడా చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. ‘అధికారులతో ఇష్టమొచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావట. ఏం ఎలా ఉంది. మీరేం చేస్తున్నారో అంతా తెలుసు. ఇంకోసారి ఇలాంటి కంప్లరుుంట్లు రాకూడదు’ అని హెచ్చరించారట. సీఎం సీరియస్ అవడంతో ఆ ఇద్దరి నేతలకు ఏసీ బస్సులోనూ చెమటలు పట్టాయట. కాగా, ఎప్పుడూ చీవాట్లు తినే ఏలూరు సమీపంలోని ప్రజాప్రతినిధిని మాత్రం ఈసారి చంద్రబాబు నవ్వుతూ పకలరించారట. సీఎం సీరియస్‌గా వార్నింగ్ ఇస్తేనే సదరు ఎమ్మెల్యేని పట్టలేం. వామ్మో ఈ ఉత్సాహంతో ఇప్పుడు ఆయన ఎవరి మీదకు ఉరకుతాడోనని అధికారులు హడలెత్తిపోతున్నారట.!
ఊరు అవతలే సుజాత ఫ్లెక్సీలు
ఈనెల తొలినాళ్లలో జిల్లా అధికారులు, ఉద్యోగుల మధ్య సంక్షోభం తారస్థాయికి ఎగసి చప్పున చల్లారిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబునాయుడు వద్దకు వెళ్లాల్సిన ఈ పంచాయతీని మంత్రి పీతల సుజాత తలకెత్తుకున్నారు. గతంలో టీచర్‌గా పనిచేసిన అనుభవంతో ఇరువర్గాలతో చర్చలు జరిపి ఎట్టకేలకు కథను సుఖాంతం చేశారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. జిల్లాలో అధికార టీడీపీ తరపున ఏకైక మంత్రిగా తనవంతు బాధ్యతను సరిగ్గానే నిర్వర్తిస్తున్నా ప్రాధాన్యత విషయానికి వచ్చేసరికి ఆమెను పార్టీ నేతలు పెద్దగా పట్టించుకోవడం లేదన్న వాదన ఆమె వర్గీయుల్లో వినిపిస్తోంది.
గత నెలలో చంద్రబాబునాయుడు ఉండి నియోజకవర్గం కలవపూడి వచ్చినప్పుడు ఆ సభలో కనీసం జిల్లా మంత్రిగా ఒక్క మాట కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. శనివారం నాటి బహిరంగసభ సందర్భంగా సీఎంకు స్వాగతం పలుకుతూ ఆమె వర్గీయులు కైకరంలో ఫ్లెక్సీలు పెట్టేందుకు యత్నిం చినా ఓ వర్గానికి చెందిన నేతలు అడ్డుకున్నారట. సభాప్రాంగణంలో కుదరదు. ప్రాంగణానికి దూరంగా కట్టుకోండంటూ ఖరాకండిగా చెప్పేశారట. దీంతో దూరంగా.. అంటే ఓ రకంగా ఊరికి చివరే ఆమె పేరిట ఫ్లెక్సీలు కట్టారట. మంత్రి పదవిలో ఉన్నా అధికార పార్టీలో ఉన్న వర్గ రాజకీయాల నేపథ్యంలో తమ నేతకు ఉండే ప్రాధాన్యం ఇంతేనా అని దళిత నేతలు నొచ్చుకుంటున్నారు. కానీ పట్టించుకునే వారెక్కడ?
బాబు వస్తే స్కూళ్లకు సెలవే
సీఎం చంద్రబాబునాయుడు వస్తే చాలు ఏలూరు నగరంలోని కార్పొరేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించేస్తున్నారు. పసుపు బస్సులు ఉన్న స్కూళ్లకైతే ముందురోజు మధ్యాహ్నం నుంచే హాలిడే. బాబు సభకు జనాలను తరలించే పనిలో నిమగ్నమయ్యే టీడీపీ నేతలు, అధికారులు ఏరికోరి కార్పొరేట్ స్కూల్ బస్సులనే ఎంచుకుంటున్నారు. సహజంగా బహిరంగ సభలకు జనాలను తరలించేందుకు ఎవరైనా ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకుంటారు. ఒక్కో బస్సుకు రోజు అద్దె రూ.11,500. ఆయిల్ ఖర్చులు అదనం. డ్రైవర్ బేటా ఎక్స్‌ట్రా. ఈ లెక్కలన్నీ చూసుకుని చాలా బడ్జెట్ అవుతుందని బెదిరిపోతున్న టీడీపీ నేతలు, అధికారులు ప్రైవేటు బస్సులపై వాలిపోతున్నారు. ఎటూ కార్పొరేటు స్కూళ్ల యాజమాన్యాలకు డీఈవో, డీటీసీలతో ఆబ్లిగేషన్స్ ఉంటాయి. ఆ మొహమాటాలనే అడ్డుపెట్టుకుని జిల్లాకు సీఎం వచ్చినప్పుడు స్కూల్ బస్సులను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఆయిల్ ఖర్చులు భరిస్తే చాలు ఎన్ని కావాలంటే అన్ని బస్సులు పంపించే స్కూళ్లకు ఏలూరులో కొదవేలేదు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాలైతే అధికార పార్టీపై అభిమానంతో అన్ని ఖర్చులూ భరిస్తున్నాయట. సరే.. ఎవరి కంపు వారికి ఇంపు. దాని గురించి మనకెందుకు అనుకున్నా.. అధికార పార్టీల నేతలు ఇలా స్కూల్ బస్సులను ఇష్టారాజ్యంగా తీసుకుని ఆర్టీసీ ఆదాయానికి గండికొడుతున్నా.. సంస్థ అధికారుల తీరు మాత్రం మారడం లేదు.
ప్రతిపక్ష పార్టీల నేతలు మీటింగ్‌లు పెట్టినప్పుడు బస్సులను అద్దెకు ఇస్తే అధికార పార్టీ పెద్దల నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమోనని భయపడి ఇవ్వమని మొండికేస్తున్నారు. అంటే అన్నామంటారు గానీ ఇలాగైతే ప్రగతి చక్రం ఎలా ముందుకు వెళ్తుంది?. ఈ రాజకీయాలన్నీ పక్కనపెడితే స్కూళ్లకు సెలవు వచ్చింది కదా అని పిల్లలు ఆనందపడుతున్నారా.. అంటే అదీ లేదు. ఎందుకంటే బాబు వచ్చిన రోజు సెలవిస్తున్నాం కదా అని కార్పొరేట్ యాజమాన్యాలు ఆ తర్వాత ఆదివారం తరగతులు నిర్వహిస్తున్నారుు. సహజంగా పిల్లలకు మిగిలిన రోజుల్లో వచ్చే సెలవు కంటే ఆదివారం మజానే వేరు. అంటే బాబు గారి పుణ్యమాని పిల్లలు జాలీ డే మిస్సవుతున్నారన్నమాట.
- జి.ఉమాకాంత్; సాక్షి ప్రతినిధి, ఏలూరు