విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
గ్రామ స్వరాజ్యం అన్నమహాత్మా గాంధీజీ స్వప్నం.. దళితులు, గిరిజనులు, బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నబాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానం నన్నెంతగానో ప్రభావితం చేసింది. వారి ఆలోచనలు, నేటికీ నెరవేరని ప్రజల అవసరాలు..ఈ రెండింటి ప్రేరణతోనే నవరత్నాలు రూపొందాయి. – సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి : అన్ని విధాలా వెనుకబాటు తనం, అవినీతి, దళారీలు, సామాజిక–ఆర్థిక– రాజకీయ వెనకబాటుతనంతో కునారిల్లుతున్న వ్యవస్థను మార్చుకోవాలన్న కృత నిశ్చయంతోనే తమ ప్రభుత్వం ‘నవరత్నాలు’ ప్రకటించిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. నవరత్నాల పథకాల ద్వారానే వ్యవస్థలో సత్వర మార్పు సాధ్యమవుతుందని చెప్పారు. కుల, మత, ప్రాంత, రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలన్నదే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం హోదాలో జగన్ తొలిసారిగా విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. రెండున్నర నెలల ప్రభుత్వ పాలనలో ప్రజల మేలు కోరి, వారి సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు, చేసిన చట్టాలు, అమలు చేస్తున్న విధానాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. మన దేశ స్వాతంత్య్ర ఉద్యమం గొప్ప భావాలతో ముందుకు సాగిందని పేర్కొన్నారు. మూడు రంగుల జెండాకు, ఆ జెండాను ఇదే విజయవాడలో రూపొందించిన పింగళి వెంకయ్య గారికి ఎప్పటికీ మనందరి గుండెల్లో గొప్ప స్థానం ఉంటుంది. మహాత్మా గాంధీ సహా ఎందరో జాతీయోద్యమ నాయకులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. భారత మాతకు వందనం చేస్తూ.. ఈ గడ్డమీద పుట్టిన ప్రతి బిడ్డా ఈ గడ్డకు రుణపడి ఉండాలన్న భావం ఉండాలని చెబుతున్నా. స్వాతంత్య్ర పోరాటం మనందరినీ మంచి మార్గంలో నడిపించే మహాశక్తి’ అని సీఎం పేర్కొన్నారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..
వ్యవస్థను మార్చుకుందాం
‘రాజ్యాంగం అందరికీ ప్రాథమిక హక్కులు ఇచ్చినా, 72 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా రాజకీయ, ఆర్థిక, సామాజిక అసమానతలు మాయని మచ్చలుగా కనిపిస్తున్నాయి. నిరక్షరాస్యత, మాతా శిశు మరణాలు మనం చెబుతున్న అభివృద్ధికి మాయని మచ్చలే. పిల్లలు బడికి వెళ్లలేని పరిస్థితి. మానవాభివృద్ధి సూచికల్లో మనం ఎక్కడున్నామో ఆలోచించుకోవాలి. ఈ 72 ఏళ్లలో దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ వ్యవసాయం, పరిశ్రమలు, సేవల రంగాల్లో ఎంతో అభివృద్ధి ఉంది. అయితే అభివృద్ధితో పాటు దాన్ని అందాల్సిన వారికి అందకుండా ఎక్కడికక్కడ మింగేసే అవినీతి, దళారీ వ్యవస్థ అంతకంటే వేగంగా బలపడింది. మరి ఈ వ్యవస్థను ఇలాగే వదలి వేస్తే మన స్వాతంత్య్రానికి అర్థం ఉంటుందా? అందుకే రెండున్నర నెలల్లోనే ధైర్యంగా ముందడుగులు వేస్తూ.. భారతదేశ సామాజిక న్యాయ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధంగా బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు పెద్ద పీట వేస్తూ తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చరిత్ర గతిని మార్చే చట్టాలకు శ్రీకారం చుట్టాం.
బీసీలకు శాశ్వత కమిషన్.. విప్లవాత్మకం
బీసీ కులాలు బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. భారతీయ సంస్కృతి, నాగరికతలకు బ్యాక్ బోన్ క్లాసులు.. అన్న మాటలకు కట్టుబడి శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేసిన మొట్ట మొదటి ప్రభుత్వం అని చెప్పడానికి గర్విస్తున్నాను. ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తింప జేస్తూ చట్టం చేసిన ప్రభుత్వం కూడా మనదే. పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా, స్థానికుల నైపుణ్యాలను పెంచడానికి ప్రభుత్వమే నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు పెట్టేలా తొలిసారిగా చట్టం చేస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి మద్య నియంత్రణలో భాగంగా బెల్ట్ షాపులన్నింటినీ మూయిస్తున్నాం. అక్టోబర్ 1 నుంచి కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే మద్యం దుకాణాలు నడిపేలా నిర్ణయం తీసుకున్నాం. భూ యజమాని హక్కులకు భంగం కలుగకుండా దాదాపు 15 నుంచి 16 లక్షల మంది కౌలు రైతులకు కూడా వైఎస్సార్ రైతు భరోసాతో పాటు పంటల బీమా, పంటల పరిహారం అందించేలా చట్టం చేసిన రాష్ట్రం కూడా మనదేనని చెప్పడానికి గర్విస్తున్నాను.
గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసి గౌరవవందనం చేస్తున్న సీఎం వైఎస్ జగన్
ఎన్నెన్నో విప్లవాత్మక నిర్ణయాలు
మానవ అభివృద్ధి సూచికల్ని మెరుగు పరచడంతో పాటు గ్రామీణులకు కూడా సేవలు, సంక్షేమ కార్యక్రమాలు అందించి పట్టణాలు, గ్రామాల మధ్య అంతరం తగ్గించే చర్యలు చేపడుతున్నాం. మౌలిక సదుపాయాల్లోనూ, పరిశ్రమల్లోనూ భారీగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. పారదర్శకమైన లంచాలు లేని వ్యవస్థను నెలకొల్పుతున్నాం. పంచాయతీల్లో గ్రామ సచివాలయాలు, పట్టణాల్లో వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తున్నాం. రూ.5 వేల గౌరవ వేతనంతో దాదాపు 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించబోతున్నాం. కనీవినీ ఎరుగని రీతిలో 4 లక్షలకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం ద్వారా దేశ చరిత్రలోనే రికార్డు నెలకొల్పబోతున్నాం. గ్రామ, వార్డు వలంటీర్ల నియామకంలో కూడా మహిళలకు సగం వాటా ఇస్తున్నాం. అమ్మఒడి, ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాల ద్వారా చదువుల విప్లవం తీసుకురాబోతున్నాం. స్కూళ్ల రూపు రేఖల్ని కూడా మార్చబోతున్నాం. ఆరు నెలల క్రితం వరకు వచ్చిన రూ.1000 పింఛన్ ఇప్పుడు రూ.2,250 అయ్యింది. వచ్చే ఏడాది నుంచి ఏటా రూ.250 పెంచుతూ రూ.3 వేల వరకు పెంచుతాం. పింఛన్ పొందడానికి అర్హత వయసు 65 నుంచి 60కి తగ్గించాం. వైద్యం ఖర్చు రూ.1000 దాటితే.. వారి వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉంటే అన్ని వర్గాల వారికి ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెలా రూ.10 వేలు పింఛన్ ఇస్తున్నాం. తలసీమియా, పక్షవాతం, మస్కులర్ డిస్ట్రాఫీ వంటి వ్యాధులకు కూడా పింఛన్ ఇచ్చే పథకంపై ఆలోచిస్తున్నాం. 104, 108 సర్వీసులను గాడిలో పెడుతున్నాం. పేదలకు 25 లక్షల ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించాం. వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల రుణాల మొత్తాన్ని రెండో ఏడాది నుంచి నాలుగు విడతలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం. సున్నా వడ్డీకి రుణాలిస్తాం. 45 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కచెల్లెమ్మలకు నాలుగు విడతలుగా రూ.75 వేలు సాయం చేసే పథకాన్ని వచ్చే ఏడాది నుంచి అమలు చేయబోతున్నాం.
అందరికీ మేలు చేస్తాం
ప్రభుత్వోద్యోగులకు 27 శాతం ఐఆర్‌ను అమలు చేస్తున్నాం. సీపీఎస్‌కు బదులు పాత పింఛన్ విధానం అమలు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశాం. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కమిటీ వేశాం. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, పారిశుధ్య కార్మికుల జీతాల పెంపునకు మొదటి కేబినెట్‌లోనే నిర్ణయించాం. పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తున్నాం. స్పందన కార్యక్రమం కింద ప్రతి సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నాం. గుళ్లలో పూజారులకు, మసీదుల్లో ఇమాంలకు, మౌజన్‌లకు, చర్చిలో పాస్టర్లకు మేలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రంలోని రిజర్వాయర్లకు జలకళ వచ్చింది. ఆ దేవుడి చల్లని దీవెనలతోనే ఇది సాధ్యమైంది. అందుకే ఈ స్వాతంత్య్ర దినోత్సవం సభ ద్వారా మనందరమూ ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుదాం. జైహింద్..’ అంటూ సీఎం జగన్ తన ప్రసంగాన్ని ముగించారు.
అన్ని వర్గాల ప్రజల కోసం ఇలా..
- పాఠశాల, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌లను ఏర్పాటు చేస్తున్నాం.
- ప్రతి రూపాయికీ జవాబుదారీ తనం ఉండాలన్న సంకల్పంతో మొత్తం టెండరింగ్ పద్ధతిలో సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. జ్యుడిషియల్ ప్రివ్యూ ద్వారా టెండరు పనులను ఖరారు చేసే ప్రక్రియను హైకోర్టు జడ్జి ముందు పెడుతూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయంగా మారుస్తున్నాం.
- ప్రభుత్వ శాఖల్లో రూ.కోటి దాటిన కొనుగోళ్లన్నింటిలో పారదర్శకత పెంచేలా ఆన్‌లైన్‌లో పెడతాం.
- ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రవేశ పెట్టడం ద్వారా ల్యాండ్ మాఫియా, అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ రికార్డులకు చెక్ పెట్టనున్నాం.
- రైతులకు బ్యాంకుల నుంచి ఈ ఏడాది రూ.84,000 కోట్లు పంట రుణాలుగా అందించాలని నిర్ణయించాం. రైతులు గడువులోగా తిరిగి చెల్లిస్తే ఆ రుణాల మీద వడ్డీ ఉండదు.
- ఇప్పటికే 60 శాతానికి పైగా వ్యవసాయ కనెక్షన్లకు పగటిపూటే 9 గంటల కరెంటు సరఫరా చేస్తున్నాం. వచ్చే ఏడాది జూలై నాటికి మిగిలిన 40 శాతం ఫీడర్లలో కూడా పగటిపూటే కరెంటు ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. అక్వా రైతులకు రూ 1.50కే యూనిట్ కరెంటును అందిస్తున్నాం.
- రైతులకు గిట్టుబాటు ధర కోసం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుతో పాటు పంటల బీమా కోసం 55 లక్షల మంది రైతుల తరఫున 56 లక్షల హెక్టార్లకు రూ.2,164 కోట్ల ప్రీమియంను ప్రభుత్వమే కడుతుంది.
- గత ప్రభుత్వ విత్తన బకాయీలు రూ.384 కోట్లు, ధాన్యం సేకరణ బకాయిలు రూ.960 కోట్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. కష్టాల్లో ఉన్న శనగ రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1,500లు చొప్పున రూ.300 కోట్లు బోనస్‌గా విడుదల చేశాం. పామాయిల్ రైతులకు అదనపు మద్దతు ధర కోసం రూ.80 కోట్లు విడుదల చేస్తున్నాం.
- క్షేత్ర స్థాయిలో వ్యవసాయ పరిస్థితులను బేరీజు వేసేందుకు వ్యవసాయ మిషన్ ఏర్పాటు చేశాం.
- రైతు ప్రమాదవశాత్తు మరణించినా, ఆత్మహత్య చేసుకున్నా రైతు కుటుంబానికి
- రూ.7 లక్షలు పరిహారం అందిస్తున్నాం. 2018 – 19 సంవత్సరానికి రూ.2,000 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చేందుకు చర్యలు చేపట్టాం.
- తుపాను, కరువు వచ్చినప్పుడు రైతన్నలను ఆదుకోవడానికి రూ.2 వేల కోట్లతో విపత్తు సహాయ నిధిని ఏర్పాటు చేశాం.
- రైతు భరోసా పథకం కింద రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.12,500 చొప్పున ఈ అక్టోబర్ 15వ తేదీ నుంచే అందించబోతున్నాం. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు.
- రైతుల అభ్యున్నతి కోసం సహకార రంగ పునరుద్ధరణ, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, కోల్డ్ స్టోరేజీలు, ల్యాబ్‌ల ఏర్పాటు, ఉచిత బోర్లు, జలయజ్ఞం పనులు సత్వరమే పూర్తి చేయడంతో పాటు ఇతరత్రా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
- గోదావరి జలాలను సాగర్, శ్రీశైలంకు తరలించటం ద్వారా కృష్ణా ఆయకట్టును స్ధిరీకరిస్తూ రాయలసీమ, ప్రకాశం జిల్లాల ప్రజలకు తాగు, సాగునీరు అందించే కార్యక్రమం ప్రారంభించటానికి ప్రణాళికలు వేస్తున్నాం.
- 972 కిలోమీటర్ల సముద్ర తీరం, సీ పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్–రోడ్డు కనెక్టివిటీతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment