సాక్షి, అమరావతి/నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం స్వాతంత్ర్యదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాలయాల్లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర పోరాట వీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. స్వతంత్ర పోరాటం గురించి, ఇన్నేళ్లలో సాధించిన ప్రగతి గురించి పలువురు ప్రసంగించారు. మిఠాయిలు పంచి పరస్పరం అభినందించుకున్నారు.
సీఎం క్యాంప్ ఆఫీస్‌లో..
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం జాతీయ జెండా ఎగురవేశారు. ముఖ్యమంత్రి జగన్ అదనపు కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గృహనిర్మాణసంస్థ ప్రధాన కార్యాలయంలో..
విజయవాడలోని గృహనిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, సచివాలయాల విభాగం డైరెక్టర్ లక్ష్మీషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సచివాలయాల విభాగం అదనపు డైరెక్టర్‌లు ధ్యానచంద్ర, భావన వశిష్ట పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో..
విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకాతిరుమలరావు, ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, ఎ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సౌధలో..
విజయవాడలోని విద్యుత్ సౌధలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఏపీ జెన్‌కో ఎండీ కె.వి.ఎన్.చక్రధర్‌బాబు, ట్రాన్స్‌కో విజిలెన్స్ జేఎండీ బి.మల్లారెడ్డి, జెన్‌కో విజిలెన్స్ ఆఫీసర్ పనసరెడ్డి, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పేదరిక నిర్మూలనకు అభివృద్ధి, సంక్షేమం: సీఎస్ జవహర్‌రెడ్డి
రాష్ట్ర సచివాలయం మొదటి భవనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి స్వాతంత్య్ర ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పేదల సంక్షేమానికి.. ముఖ్యంగా పేదరిక నిర్మూలనకు అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. ఈ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి పేదవానికి సక్రమంగా అందించడంలో మనమంతా చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ చీఫ్ సెక్యురిటీ అధికారి కె.కృష్ణమూర్తి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.వెంకట్రావిురెడ్డి, జీఏడీ డిప్యూటీ సెక్రటరి రామసుబ్బయ్య, పలువురు సచివాలయ అధికారులు, సిబ్బంది, ఎస్పీఎఫ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వెయ్యి అడుగుల జాతీయ పతాకం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లాలో పేస్ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులు వెయ్యి అడుగుల జాతీయ పతాకాన్ని తమ కళాశాల వద్ద జాతీయ రహదారి వెంట ప్రదర్శించారు. – ఒంగోలు
సాగరగర్భంలో..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రుషికొండ బీచ్‌లో లివిన్ అడ్వెంచర్స్ డైరెక్టర్ బలరామ్‌నాయుడు ఆధ్వర్యంలో స్కూబా డైవింగ్ వారు 60 అడుగుల సముద్రగర్భంలో జాతీయ జెండాను
ఎగురవేశారు. – కొమ్మాది
తిరుపతిలో వంద అడుగుల ఎత్తైన జాతీయ పతాకం
జిల్లా కేంద్రం తిరుపతిలోని సామవాయి మార్గంలో వంద అడుగుల ఎత్తైన జాతీయజెండాను ఎంపీ మద్దిల గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డితో కలిసి టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలో శ్రీనివాససేతు వారధిని సెప్టెంబర్ 18న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తారని చెప్పారు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
విజయవాడ రైల్వేస్టేషన్‌లో క్లీన్ ఇండియా–న్యూ ఇండియా సెల్ఫీ పాయింట్
విజయవాడ రైల్వే మినీ స్టేడియంలో డీఆర్‌ఎం నరేంద్ర ఎ.పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ‘క్లీన్ ఇండియా–న్యూ ఇండియా’ సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. ఏడీఆర్‌ఎంలు డి.శ్రీనివాసరావు, ఎమ్.శ్రీకాంత్, సీనియర్ డీపీవో బాలమురళీధర్, సీనియర్ డీసీఎం వి.రాంబాబు, ఏసీఎం డాక్టర్ శారద తదితరులు పాల్గొన్నారు.
కృష్ణానదిలో స్విమ్మర్ల జెండా వందనం
కృష్ణాజిల్లా నాగాయలంకలోని శ్రీరామ పాదక్షేత్రం ఘాట్ వద్ద గ్రామానికి చెందిన కొందరు స్విమ్మర్లు కృష్ణానదిలో జాతీయ పతాకానికి వందనం సమర్పించారు. రేమాల చంటి, వేములపల్లి ప్రసాద్, సనకా మురళి, తలశిల రఘుశేఖర్ తదితరులు పాల్గొన్నారు.– నాగాయలంక
Comments
Please login to add a commentAdd a comment