
ఏపీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె. చంద్రశేఖర్ రావు సోమవారం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసమైన ప్రగతి భవన్‌కు చేరుకుంటారు. ఇక్కడే వీరిద్దరూ సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం - 2014 లోని పరిష్కారం కాని అంశాలు, తొమ్మిది, పది షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకం, ఉద్యోగుల విభజన, ఇతర పెండింగు అంశాలు, జలవనరుల సద్వినియోగం, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగు విద్యుత్తు బిల్లులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రుల సమావేశం సందర్భంగా వీటితోపాటు ఇతర అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవడంతోపాటు నీటి వనరుల సమగ్ర సద్వినియోగంపై గతంలో రెండు రాష్ట్రాల సీఎంల సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మంత్రులు, సలహాదారులు, ముఖ్య కార్యదర్శులు హైదరాబాద్‌లో సమావేశమై చర్చించిన విషయం విదితమే. చర్చల కొనసాగింపులో భాగంగా తర్వాత ఇరు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రధాన కార్యదర్శులు, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారులు సమావేశమై చర్చించారు. ఈ చర్చలన్నీ సామరస్యపూర్వక వాతావరణంలో జరిగిన నేపథ్యంలో సోమవారం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment