సాక్షి, అనంతపురం: పెనుకొండలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ గ్రాండ్ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కియా మోటర్స్ ప్లాంట్‌ను సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. కియా మోటర్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. కియా మోటార్స్ బాటలోలో మరికొన్ని కంపెనీలు ఏపీకి వస్తాయని సీఎం ఆశాభావం వ్యక్తంచేశారు. ‘పెనుకొండలో కియా ఫ్యాక్టరీని ప్రారంభించటం సంతోషంగా ఉంది. కియా కార్ల పరిశ్రమ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఏర్పాటు కావటం శుభపరిణామం. కియా యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏపీలో ఇంత పెద్ద పరిశ్రమ ఏర్పాటు చేసినందుకు కియా సంస్థ ను అభినందిస్తున్నా’ అని అన్నారు.
ఎందరికో ఉపాధి
రాష్ట్రంలో కియా మోటర్స్ చక్కగా పని చేస్తుందన్న ముఖ్యమంత్రి సంస్థ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేపడితే ప్రత్యక్షంగా 11 వేల మందికి, పరోక్షంగా మరో 7 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఇక్కడి సంస్థలో ఇప్పటికే 3 వేల మంది పని చేస్తుండగా, అనుబంధ విభాగాల ద్వారా మరో 3500 మందికి ఉపాధి లభిస్తోందని గుర్తు చేశారు.
మరింత విస్తరించాలి
కియా కంపెనీలో ఇప్పటికే ఏటా 70 వేల వాహనాలు ఇక్కడ ఉత్పత్తి అవుతుండగా, సంస్థ మరిన్ని ప్లాంట్లు, విభాగాలు ప్రారంభించాలని సీఎం ఆకాంక్షించారు. కియా సంస్థ ఏటా 3 లక్షల వాహనాలు ఉత్పత్తి చేసే సామర్ధ్యానికి చేరాలన్న ఆయన, తద్వారా ఇంకా ఎందరికో ఉపాధి లభిస్తుందని అన్నారు.
పూర్తి అండగా నిలుస్తాం
కియా సంస్థకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తుందని, ఆ కంపెనీకి సానుకూలంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. తమది ప్రొయాక్టివ్ ప్రభుత్వం అని ఆయన వివరించారు.
కియా కార్లకు ఇక్కడ మంచి ఆదరణ ఉందన్న సంస్థ ప్రెసిడెంట్, సీఈఓ హాన్‌ఊపాక్, ఒకేరోజు ఆరు వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయని చెప్పారు. భారత్‌లో దక్షిణ కొరియా రాయబారి షిన్ బాంకిన్, కియా మోటర్స్ ఎండీ కోకిన్‌షిన్, మంత్రులు బొత్స సత్యనారాయణ, .గౌతమ్‌రెడ్డి, శంకరనారాయణ, జయరాం, ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, ఎమ్మెల్యే, మండలి విప్ కాపు రామచంద్రారెడ్డితో పాటు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, కియా మోటర్స్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు పరిశ్రమలోని అన్ని విభాగాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రారంభోత్సవం సందర్భంగా కియా ఫ్యాక్టరీ డాక్యుమెంటరీ చిత్రాన్ని ఆయన వీక్షించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషితో ఏపీలో కియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేసిన దక్షిణ కొరియా సంస్థ కియా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రూ.13500 కోట్ల రూపాయల వ్యయంతో ఈ కార్ల పరిశ్రమ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment