
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 7 గంటలకు ముఖ్యమంత్రి చికాగోనుంచి హైదరాబాద్ బయలుదేరారు. రేపు ఉదయం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ నెల 15న అమెరికా బయలుదేరిన ఆయన వారం రోజుల పాటు అక్కడ పర్యటించారు.
కాగా, సీఎం వైఎస్ జగన్ అమెరికా పర్యటనకు అద్భుతమైన స్పందన లభించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలికారు. ముఖ్యంగా డాలస్‌లోని హచిన్సన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ప్రవాసాంధ్రుల సమావేశం ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో కోలాహలంగా సాగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని, అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రవాసాంధ్రులకు ఆయన భరోసా ఇచ్చారు.