సాక్షి, అమరావతి: రాజకీయ అజెండాతో నడుస్తూ.. ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా లేక రద్దు చేయాలా అన్నదానిపై సీరియస్‌గా ఆలోచించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వడానికే శాసనమండలి ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే.. మండలిలోని సభ్యులు మాత్రం మేలు జరగకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. శాసన మండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే..
ప్రజాస్వామ్య విలువలకు తూట్లు
‘‘అధ్యక్షా.. ఇవాళ కొన్ని అంశాలను సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకు వచ్చి మీ అందరి నిర్ణయాన్ని అడగదలుచుకున్నా. 2019 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో.. అంటే 86 శాతం మంది ఎమ్మెల్యేలతో ప్రజల మాటే వేదంగా ఈ సభ ఏర్పడింది. అంటే ఇది ప్రజలు ఆమోదించిన సభ. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం మాది. ఏడున్నర నెలలకు పైగా బీసీలకు శాశ్వత కమిషన్, ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు.. మూడు కార్పొరేషన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో కానీ, కాంట్రాక్టుల్లో కానీ 50 శాతం ఇవ్వాలని చేసిన చట్టం.. ఇందులో 50 శాతం మహిళలకే కేటాయించాలని చేసిన చట్టం.. దిశ చట్టం.. జ్యుడిషియల్ ప్రివ్యూ కమిషన్ ఏర్పాటు.. రివర్స్ టెండరింగ్‌కు చట్టబద్ధత.. గ్రామ సచివాలయాల ఏర్పాటు.. స్థానికంగా ఉద్యోగాలలో 75 శాతం రిజర్వేషన్లు.. ఆర్టీసీ విలీనం.. విద్యా సంస్థలపై రెండు రెగ్యులేటరీ కమిషన్ల ఏర్పాటు.. ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధనకు శ్రీకారం చుట్టాం. అత్యంత దిగువన ఉన్న వర్గాల కోసం మనసు పెట్టి పని చేశాం. పాలకులం కాదు సేవకులం అని చెప్పినట్టుగా నడుచుకుంటున్నాం.
చదవండి:
చంద్రబాబు స్వార్థానికి బలయ్యాం!
మండలి చైర్మన్కు ఆ విచక్షణాధికారం లేదు
తప్పు.. అంటూనే తప్పు చేయడంలో అర్థం ఏమిటి?
శాసనమండలిలో నిన్న (బుధవారం) జరిగిన ఘటనలు నన్ను ఎంతగానో బాధించాయి. ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అన్నవి ఉండాలి.. ఉంటాయి. వాటికి నేను ఏ రోజూ వ్యతిరేకం కాదు. చట్టాన్ని కాపాడటానికి ఇవి ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి ఉపయోగించుకోవడానికి మాత్రం కాదు. మండలి అన్నది చట్టసభలో భాగం కాబట్టి చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మాం. కానీ నా నమ్మకంతో పాటు ఐదు కోట్ల మంది ప్రజలందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ నిన్న శాసనమండలిలో జరిగిన తంతు గమనించాం.
శాసనమండలి చైర్మన్.. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదని నిన్న (బుధవారం) చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని జారీ చేసిన ఆదేశాల వల్ల ఎవరికైనా అర్థమవుతోంది. ఆ సందర్భంగా శాసనమండలి చైర్మన్ చేసిన ప్రసంగాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలి. అన్ని ప్రాంతాల అభివృద్ధికి, అధికారాల వికేంద్రీకరణకు మేము ప్రవేశపెట్టిన బిల్లును మండలి చర్చించి ఆమోదించవచ్చు.. లేదా తిరస్కరించవచ్చు.. లేదా వారి అభిప్రాయాలు సూచిస్తూ సవరణలతో తిప్పి పంపవచ్చు. చట్టం కూడా ఇదే చెబుతోంది. కానీ ఇవేవీ కూడా లెక్క చేయకుండా మండలి చైర్మన్ విచక్షణాధికారం అంటూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు.
విచక్షణా అధికారం అనేది ఏదైనా సందిగ్ధత ఉన్నప్పుడు ఉత్పన్నం అవుతుంది. రూల్స్ ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపే అవకాశం లేదని ఆయనే చెప్పారు. మరోవైపు తనకు లేని అధికారం ఉపయోగించి ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం, విధానం అత్యంత దురదృష్టకరం. ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు మండలిని వాడుకోవచ్చన్న దురాలోచనను మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతుంది. అధ్యక్షా.. మీ ఆమోదంతో నిన్న శాసనమండలిలో చైర్మన్ ఏం మాట్లాడారో ఒక్కసారి డిస్‌ప్లే చేయిద్దాం.
ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టేనా?
అధ్యక్షా.. ఆయన ఏమన్నారో అందరూ చూశారు. విధానపరంగా ఏ బిల్లునైనా మూవ్ చేసిన 12 గంటల్లోగా సవరణలు ఇవ్వాలన్నారు. సెలెక్ట్ కమిటీకి పంపించాలన్న ఆలోచన ఉన్నప్పుడు బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడే మూవ్ చేయాలి.. ఆ టైమ్ ల్యాప్స్ అయిందని కూడా అన్నారు. ప్రభుత్వ పరంగా వచ్చిన బిల్లులకు ప్రాధాన్యత ఇచ్చి, రూల్ పరంగా ప్రైవేట్ ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకోవడానికి వీలు లేదని మంత్రులు వాదించిన విషయం కూడా నిజమే అన్నారు. ప్రభుత్వ వాదనతో ఇటు బీజేపీ పక్షం.. అటు పీడీఎఫ్, లెఫ్ట్ పార్టీల పక్షం కూడా ఏకీభవించాయి అని కూడా ఆయన చెప్పారు. సెలెక్ట్ కమిటీ వేయాలన్న తెలుగుదేశం ప్రతిపాదన రూల్ పరంగా లేదని సుస్పష్టంగా కనిపిస్తోందని శాసనమండలి చైర్మన్ పేర్కొన్నారు.
అయినా దానిని ఏ రకంగా అతిక్రమించాలన్న ఆలోచన చేశామని కూడా చెప్పారు. చివరకు రూల్స్‌కు అనుగుణంగా లేనందున, సెలెక్ట్ కమిటీకి పంపే పరిస్థితి లేనందున, చైర్మన్‌గా నాకున్న విచక్షణాధికారాలకు లోబడి రూల్ 154 ప్రకారం సెలెక్ట్ కమిటీకి పంపాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అంటే.. విచక్షణ అధికారాన్ని చట్టాన్ని ఉల్లంఘించడానికి వాడానని ఆయనే చెబుతున్నారు. అంటే విచక్షణాధికారం చట్టాన్ని పరిరక్షించడానికి కాకుండా ఉల్లంఘించడానికి వాడారు. ఇది ప్రజాస్వామ్యంలో కరెక్టేనా.. అని అందరమూ ఆలోచించాలి. అక్కడ డైరెక్షన్ ఇవ్వడానికి తనకు సంబంధం లేని సభ గ్యాలరీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కూర్చున్నది అందరం చూశాం.
ఇకపై ఆ తప్పు చేయకుండా ఆలోచించాలా.. వద్దా?
రాజ్యాంగ రచన కోసం నాడు ఏర్పాటు చేసిన కాన్‌స్టిట్యూషనల్ అసెంబ్లీ.. రాష్ట్రాల్లో రెండవ సభ అంటే మండలి ఉండాలా.. వద్దా అనే చర్చలో అత్యధికులు ఇది అనవసరం అని అభిప్రాయపడ్డారు. డబ్బు ఖర్చు తప్ప ఏ ప్రయోజనం ఉందదన్నారు. దేశంలో కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. విడిపోయిన ఈ పేద రాష్ట్రానికి మండలి అవసరమా అనేది ఆలోచించాలి. మండలి కోసం సంవత్సరానికి రూ.60 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 60 రోజులు సభ జరుగుతుందనుకుంటే రోజుకు రూ.కోటి ఖర్చు పెడుతున్నాం.
అసలే పేదరికంలో ఉన్న రాష్ట్రం. ఇంత ఖర్చు అవసరమా? మంచి చేయడం కోసం తమ బుర్రలను పెట్టకుండా, ప్రతి మంచి పనిని ఎలా జరగకుండా ఆపాలి.. ఎలా డిలే చేయాలి.. అని రూల్స్‌ను సైతం ధిక్కరిస్తున్న ఇలాంటి మండలిని కొనసాగించాలా.. వద్దా.. అన్నది సీరియస్‌గా ఆలోచించాలి. ఇది తప్పే.. అయినా చేస్తున్నామని మండలి చైర్మన్ చెబుతున్నారు. అయినా చంద్రబాబు మాత్రం ఊళ్లకు పోయి కార్యకర్తలను పిలిపించుకుని పూల దండలు వేయించుకోవడం, సన్మానం చేయించుకోవడం.. ఆయన ఎల్లో మీడియాలో ఊదరగొట్టడం ఆశ్చర్యమనిపిస్తోంది.
ఎక్కడి నుంచైనా పాలన సాగించొచ్చు
రాజ్యాంగంలో క్యాపిటల్ అనే పదమే లేదు. పరిపాలన కోసం వికేంద్రీకరణ చేయవచ్చు. దివంగత జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారు. మొన్న వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు పది రోజులు విశాఖ నుంచి పాలన సాగించారు. రేపు ఏదైనా ప్రకృతి వైపరీత్యం సంభవిస్తే ముఖ్యమంత్రి 20 రోజుల పాటు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. అక్కడి నుంచే పాలన సాగిస్తారు. ప్రజలు ఇచ్చిన అధికారం మేరకు ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా మంత్రులు, సెక్రటరీలకు సూచనలు ఇస్తూ పాలన సాగించవచ్చు. ఇందుకు ఏ చట్టం అవసరం లేదు. ఏ బిల్లూ అవసరం లేదు. ఒక తీర్మానం చేసి ఈ పని చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అసెంబ్లీ పెట్టొచ్చు. ఆర్టికల్ 174 ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా చట్టాలు చేయవచ్చని రాజ్యాంగం చెబుతోంది.
సూచనలు, సలహాలు ఇవ్వాల్సింది పోయి..
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమిది.. అలాంటప్పుడు నైతిక విలువలు మరచిపోయి ఎందుకు ఇన్ని డ్రామాలు చేస్తున్నారో వాళ్లకు వాళ్లు ప్రశ్నించుకోవాలి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే కౌన్సిల్ అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. ఇలాంటి మండలి ఆ పని చేయనప్పుడు ప్రజలకు మేలు జరుగుతుందా లేదా అని సీరియస్‌గా ఆలోచించాలి. మొన్న ఇంగ్లిష్ మీడియం బిల్లును అడ్డుకున్నారు. దీనిని అడ్డుకున్న వారి పిల్లలు చదువుతున్న స్కూళ్లు తెలుగు మీడియంవి కాదు.. ఇంగ్లిష్ మీడియంవి. పేద పిల్లలకు మాత్రం తెలుగు మీడియం స్కూళ్లు ఉండాలట. ఇంగ్లిష్ మీడియం ఉండకూడదట. పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటే ప్రపంచంతో పోటీ పరిస్థితి వస్తుందని తెలిసీ ఆ బిల్లును అడ్డుకోవడం, డిలే చేయడం.. జరక్కుండా చూడాలని ఆరాట పడుతున్న పరిస్థితిలో ఈ మండలి అవసరమా?
ప్రతి అడుగులోనూ రాజకీయ దురుద్దేశం
ఎస్సీలకు, ఎస్టీలకు వేర్వేరుగా రెండు కమిషన్లు ఏర్పడితే వారికి మేలు చేసే దిశగా అడుగులు పడతాయి. అటువంటి దానినీ అడ్డుకోవడం, డిలే చేయడం, చట్టం కాకుండా ఏ స్థాయిలో వీలైతే ఆ స్థాయిలో అడ్డుకోవడం జరుగుతోంది. మంచి చేయాలని ప్రభుత్వం చూస్తుంటే దానిని అడ్డుకునే దిశగా ఈ పెద్దల సభ వెళ్లిపోతే పరిస్థితి ఏంటన్నది పెద్దలు బుర్రలు పెట్టి ఆలోచించలేకపోతే పాలనకు అర్థం ఏమిటి? చంద్రబాబు ఇక్కడ ఇంగ్లిష్ మీడియంకు సపోర్ట్ చేస్తున్నామని చెప్పి, అక్కడ మండలిలో బిల్లు పాస్ కాకుండా అడ్డుకుంటారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే వ్యవహరిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితిలో ఏడాదికి రూ.60 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి రాజకీయ అజెండాతో నడుపుతున్న ఇలాంటి సభను నిజంగా కొనసాగించాలా వద్దా అని మనమంతా సీరియస్‌గా ఆలోచించాలి. అధ్యక్షా.. మీరు అనుమతిస్తే సోమవారం మళ్లీ సభను పెట్టండి. ఇంకా సుదీర్ఘంగా చర్చించి ఇటువంటి మండలిని కొనసాగిద్దామా.. వద్దా.. అని నిర్ణయం తీసుకుందాం. ఈ సిస్టంను క్లీన్ చేసే విషయంలో నాలుగు అడుగులు ముందుకేయాలని మిమ్మల్ని, శాసనసభ్యులందరినీ అభ్యర్థిస్తున్నా’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.
సోమవారానికి సభ వాయిదా
ముఖ్యమంత్రిగా మీరు ఎక్కడి నుంచి అయినా పరిపాలన సాగించవచ్చు. నాడు ఎన్టీఆర్.. మొత్తం మంత్రి వర్గాన్నే బర్తరఫ్ చేసి నెల రోజుల పాటు అస్సాంలో ఉండి పరిపాలించారు. సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సభ ప్రారంభమవుతుంది.
– తమ్మినేని సీతారామ్, అసెంబ్లీ స్పీకర్
శాసనమండలి చట్టం ప్రకారం నడుస్తోందా.. లేక ఒక పార్టీ, ఒక వ్యక్తి ఇష్టాయిష్టాల ప్రకారం నడుస్తోందా? ప్రజల ప్రభుత్వం ఇస్టానుసారం నడుస్తోందా.. లేక ఓడిన పార్టీ నాయకుడి ప్రయోజనాల కోసం నడుస్తోందా? మండలి అనేది సలహాలు, సూచనలు చేసే పెద్దల సభగా ఉండాలి. కానీ బిల్లులను చట్టం కాకుండా నిరోధించేలా ఉంది. తప్పు అని తెలిసి కూడా, విచక్షణాధికారంతో అదే తప్పును చేస్తానంటున్న ఈ మండలి అధ్యక్షుడిని చూస్తే.. ‘హత్య చేయడం తప్పు. అయినా నేను హత్య చేస్తాను’ అని అన్నట్లుంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?– సీఎం వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment