సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలి విషయంలో ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల శ్రేయస్సును కాంక్షిస్తూ, పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న ధ్యేయంతో శాసన సభలో ఆమోదించిన అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులను శాసన మండలిలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అడ్డుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో చర్చించి, ఆమోదించిన బిల్లులపై సలహాలు, సూచనలు ఇవ్వడం శాసన మండలి ప్రధాన కర్తవ్యం. కానీ, ప్రతిపక్షం రాజకీయ కారణాలతో కీలక బిల్లులకు అడ్డుపడుతుండడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం బిల్లులను సైతం మండలిలో టీడీపీ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో మండలిపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది.
రద్దుకు అనుకూలంగానే నిర్ణయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. లెజిస్లేటివ్ రాజధానితోపాటు ఎగ్జిక్యూటివ్ రాజధాని, జ్యుడీషియల్ రాజధాని ఏర్పాటు బిల్లు, సీఆర్‌డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లు మండలిలో నిలిచిపోయిన నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే శాసన మండలి రద్దుకు అనుకూలంగా కేబినెట్ నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, మచిలీపట్నం పోర్టు నిర్మాణాలపైనా కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అర్హులైన పేదలందరికీ ఉగాది పర్వదినం రోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూముల సేకరణపైనా చర్చించనున్నారు. కేబినెట్ భేటీ అనంతరం సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశంలో.. బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాత తలెత్తిన పర్యవసానాలపై స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు. ఏపీ శానస మండలిని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర సర్కారు అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి, ఆమోదించనున్నట్లు అధికార వర్గాల సమాచారం.
మండలిని రద్దు చేయాలని ఎమ్మెల్యేల సూచన
అభివృద్ధి–పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల విషయంలో నిబంధనలను పాటించలేదని, ఇది తప్పేనని, అయినా సెలెక్ట్ కమిటీకి పంపిస్తానని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల నుంచి నేరుగా ఎన్నికైన సభ్యులు ఆమోదించిన బిల్లులను మండలిలో నిలిపివేయడంపై గురువారం అసెంబ్లీలో చర్చ జరిగింది. శాసన మండలిని రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా పలువురు సభ్యులు ప్రభుత్వానికి సూచించారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలకు మేలు చేసే బిల్లులను అడ్డుకుంటున్న మండలి అవసరమా? అనేదానిపై సోమవారం విస్తృతంగా చర్చించి, నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment