వైఎస్‌ జగన్‌ : బ్యాంకర్లు ఏం కోరినా చేసేందుకు సిద్ధం | YS Jagan Meeting With Bankers Regarding Loans with Zero Interest - Sakshi
Sakshi News home page

బ్యాంకర్లు ఏం కోరినా చేసేందుకు సిద్ధం: సీఎం జగన్‌

Published Wed, Sep 25 2019 12:19 PM | Last Updated on Wed, Sep 25 2019 3:29 PM

AP CM YS Jagan Mohan Reddy Meeting With Bankers - Sakshi

సాక్షి, అమరావతి: రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామన్నారు. బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం వైఎస్‌ జగన్‌ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. 

సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ. వివిధ వర్గాల ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద అనేకమందికి నగదు ఇస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలి. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుంది. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆర్థికశాఖతో టచ్‌లో ఉండండి.. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం.

ఎక్కడ సమస్య ఉన్నా.. ప్రభుత్వం ముందుకు వస్తుంది.
గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి... సున్నా వడ్డీ కింద చెల్లింపును రశీదు రూపంలో వారికి అందిస్తారు. సున్నా వడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో మాకు జాబితా ఇవ్వండి చాలు, వాటిని మేం చెల్లిస్తాం. ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టిపెట్టాలి. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్లకింద చిరువ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. చిరువ్యాపారులకు ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుంది.

దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరం. ఎక్కడ సమస్య ఉన్నా.. ప్రభుత్వం ముందుకు వస్తుంది, వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. మేం చాలా ప్రోయాక్టివ్‌ గా ఉంటాం. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువుగా ఉందని బ్యాంకు అధికారులు చెప్పడం సంతోషకరం. వర్షాలు బాగా పడ్డాయి,  రిజర్వాయర్లలో నీళ్లుకూడా ఉన్నందున రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉంది, ఆమేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

విప్లవాత్మక విధానాలు చేపట్టాం..
వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం, విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం. జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పోలవరం పనుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజలధనాన్ని ఆదా చేశాం. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్‌ విధానాలు లేవు. రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నాం. పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్‌ ప్రివ్యూ అత్యుత్తమం. ఏ రాష్ట్రం కూడా రివర్స్‌ టెండరింగ్‌ అమలు చేయడంలేదు.

పీపీఏల విషయంలో అదే విధంగా విప్లవాత్మక విధానాలు చేపట్టాం. అధికారంలోకి రాగానే విద్యుత్‌ అధికారులతో మేం రివ్యూ పెడితే డిస్కంలపై రూ.20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. 13 నెలలుగా చెల్లింపులు లేవని చెప్పారు. అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టవు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువుగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారు, వేసే పరిస్థితి ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడాలేదు. విద్యుత్‌రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యుత్‌ రంగం పునరుద్దరణకు మీ అందరి సహకారం కావాలి’ అంటూ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్లను సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement