State Level Bankers Committee
-
పెరుగుతున్న రాష్ట్ర ప్రజల సంపద
-
రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో సీఎం జగన్ సమావేశం
-
సంతోషంగా ఉంది.. ఆ రంగాల పనితీరు ప్రశంసనీయం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఎస్ఎల్బీసీ 222వ సమావేశంలో గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నది ఎస్ఎల్బీసీ వెల్లడించింది. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ, మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువ రుణాలు ఇచ్చామని పేర్కొంది. ప్రాథమిక రంగానికి 2022–23 రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680 కోట్లు. ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లు. 99.47శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని, వ్యవసాయరంగానికి రుణాల లక్ష్యం రూ. 1,64,740 కోట్లు కాగా.. 1,72,225 కోట్లు ఇచ్చామని వెల్లడి. 104.54 శాతం చేరుకున్నామని ఎస్ఎల్బీసీ తెలిపింది. ఎంఎస్ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ. 50,100 కోట్లు కాగా, రూ. 53,149 కోట్లు ఇచ్చామని వెల్లడి. 106.09 శాతం మేర రుణాలు ఇచ్చామని, ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ. 1,63,903 కోట్లు ఇచ్చామని వెల్లడి. దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59శాతం మేర రుణాలు ఇచ్చామని వెల్లడించింది. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..: 222వ ఎస్ఎల్బీసీ సమావేశం సందర్భంగా, రాష్ట్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ విజయాలు సాధించినందుకు సంతోషిస్తున్నాను. నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించింది. ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉంది. కొన్ని రంగాలకు సంబంధించి పనితీరు చాలా ప్రశంసనీయం. ►అయితే కొన్ని రంగాలకు సంబంధించి గమనించిన అంశాలను బ్యాంకింగ్ రంగం దృష్టికి తీసుకువస్తున్నాను. విద్య, మరియు గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా రుణాలు తక్కువగా ఉన్నాయి. విద్యా రంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చాయి. సామాజిక-ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమని ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాను. బ్యాంకింగ్ రంగం ఈ రెండు రంగాల పట్ల మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని కోరుతున్నాను. ►30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ప్రభుత్వమే ఈ ఇళ్ల స్ధలాలు సేకరించి, లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏప్రిల్ నెలలో మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నాం. వీటితో కలిపి దాదాపు 25 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుంది. సిమెంటు, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తోంది. వీటికి అదనంగా ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు రూ.35వేలు రుణం 3 శాతం వడ్డీతో అందించాలని బ్యాంకులతో చర్చించాం. ప్రభుత్వం ఈ రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లిస్తుంది. ►ఈ ఇళ్ల లబ్ధిదారులందరూ మహిళలే. వారి పేరు మీద ఇళ్లపట్టాలు ఇచ్చాం. ఇందులో భాగంగా ఇంకా రుణాలు రాని వారికి కూడా ఈ రూ.35 వేల రుణం మంజూరు చేయాలని కోరుతున్నాం. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటే... స్టీల్, సిమెంటు వినియోగం వల్ల గ్రామీణ ఆర్ధిక రంగం అభివృద్ధికి గణనీయమైన ఊతమిస్తుంది. మొత్తం 30.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. ఇలా కడుతున్న ఒక్కో ఇంటి మార్కెట్ విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ రంగంలో బ్యాంకులు మరింత ఊతమివ్వాల్సిన అవసరం ఉంది. ►ఇక వ్యవసాయ రంగం విషయానికొస్తే స్వల్పకాలిక పంట రుణాల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చూస్తే కేవలం 83.36శాతం మాత్రమే చేరుకున్నాం. దీనికి సంబంధించిన కారణాలపై దృష్టి పెట్టి ఎస్ఎల్బీసీ సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కౌలు రైతులకు రుణాలకు సంబంధించి డిసెంబర్ 2022 వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించాం. 1,63,811 మంది కౌలు రైతు ఖాతాలకు మాత్రమే క్రెడిట్‌ను పొడిగించారు. కౌలు రైతుల రుణాల లక్ష్యం రూ. 4,000 కోట్లు కాగా, మొదటి 9 నెలల్లో కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ►కౌలు రైతులకు బ్యాంకులు మరింత బాసటగా నిలవాలి. రాష్ట్రంలో సాగు చేసే ప్రతి ఎకరా భూమి కూడా ఇ–క్రాపింగ్ చేస్తున్నాం. సాగు చేసే రైతు పేరు, వేసే విస్తీర్ణం, సాగు చేసిన పంట.. ఈ వివరాలన్నీకూడా డిజిటలైజేషన్ చేస్తున్నాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా తోడుగా నిలిచే ఆర్బీకే వ్యవస్థ రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ ఆర్బీకేల ద్వారానే ఇ–క్రాపింగ్ సమర్థవంతంగా చేస్తున్నాం. ►డిజిటల్ రశీదులతో పాటు, ఫిజికల్ రశీదులు కూడా రైతులకు ఇస్తున్నాం. కౌలు రైతులకు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసా అందిస్తున్నాం. భూ యజమానుల హక్కులకు భంగం లేకుండా కౌలు చేసుకునేందుకు ఇరువురి మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన పత్రాలను కూడా గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నాం. అందువల్ల కౌలు రైతులకు రుణాల విషయంలో ఎలాంటి సందేహాలను బ్యాంకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తమ వద్దనున్న డేటా ఆధారంగా కౌలు రైతులకు ఇచ్చే రుణాలను గణనీయంగా పెంచాలి. ►మహిళా స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీల విషయంలో బ్యాంకులు పునర్ పరిశీలన చేయాలి. మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారు. కాని వారికిచ్చే రుణాలపై మాత్రం అధిక వడ్డీలు వేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకులు తగిన పరిశీలన చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చూడాలి. ఈ వడ్డీ రేట్లను పర్యవేక్షించడానికి... అధికార్లు, బ్యాంకర్లు కలిసి సమావేశం కావాలి. ►ఇది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు కోటిమందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రంగంలో ఇప్పుడు ఎన్పీఏలు లేరు. వీరిపట్ల బ్యాంకులు ఉదారతతో ఉండాలి. సున్నావడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సంఘాల మహిళలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు. ►చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10,000 చొప్పున రుణాలను అందిస్తూ... వీటిపై వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటివరకూ 25 లక్షల మంది రుణాలు పొందారు. వీరికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్ రంగం కూడా చక్కటి ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కూడా బ్యాంకర్లు అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. జగనన్న తోడు తదుపరి దశను 2023 జూలైలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమవుతోంది. ►యువతీ యువకులను సుశిక్షితంగా తయారు చేసేందుకు, వారికి ఉపాధి కల్పనను మెరుగుపరిచేందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పాఠ్యప్రణాళిక, కోర్సులు బోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్దేశించేందుకు ఒక యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమాలకు బ్యాంకులు బాసటగా నిలవాలి. ►మరో విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు నిర్మించాం. ఎవరైనా గ్రామాల్లోకి అడుగుపెడితే అక్కడే ఇంగ్లిషు మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు దూరంలో అదే గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ కనిపిస్తాయి. అక్కడే మనం డిజిటల్ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్ లిమిటెడ్ బ్యాండ్‌విడ్త్‌తో వర్క్ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించనున్నాం. కంప్యూటర్లు, వర్క్ ఫ్రం హోం సౌలభ్యంతో డిజిటల్ లైబ్రరీలు గ్రామాల స్వరూపాన్ని మార్చబోతున్నాయి. నాబార్డు, బ్యాంకులు డిజిటల్ లైబ్రరీల నిర్మాణంపైనా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ►ఇక ఎంఎస్ఎంఈల విషయానికొస్తే రాష్ట్ర సామాజిక–ఆర్థిక పురోగతికి అవి ఎంతో తోడ్పడ్డాయి. ఉపాధి కల్పన మరియు రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలను పోత్సాహించడం చాలా అవసరం. వీటి పురోగతికి అవసారమైన అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ రంగం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకింగ్ రంగం మరింత శ్రద్ధ వహించాలని మరియు చిన్న సంస్థలకు అభివృద్ధిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. విదేశాల్లో ఎంఎస్ఎంఈల పనితీరును అధ్యయనం చేసి మంచి విధానాలను ఇక్కడ అమలు చేయడంద్వారా ఈ రంగం వృద్దికి మరింత చేయూత నివ్వాలని అధికారులను ఇదివరకే ఆదేశించాను. ►ప్రభుత్వం చురుకైన విధానాల కారణంగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి సంబంధించి రాష్టం11.43% జీఎస్డీపీ వృద్ధి రేటును సాధించిందని మీ దృష్టికి తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేశంలోనే అన్నిరాష్ట్రాల్లో కెల్లా అత్యధిక వృద్ధిరేటును సాధించాం. ►రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, దృఢమైన మౌలిక సదుపాయాల లభ్యత, నైపుణ్యం కలిగిన మానవశక్తి, స్వాభావిక సహజ ప్రయోజనాల కారణంగా, మార్చి 3 మరియు 4 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సదస్సు వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులకు తమ కృతనిశ్చయాన్ని వ్యక్తంచేశారు. ►సదస్సు సందర్భంగా 352 ఎంవోయూలు కుదిరాయి. రూ. 13,05,663 కోట్లు పెట్టుబడులు, 6,03,223 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ పెట్టుబడులు పెట్టేందుకు రుణాలు లభ్యత అనేది చాలా ముఖ్యమైనది. అలాగే అనుబంధ యూనిట్లకు అవసరమైన మద్దతును కూడా బ్యాంకింగ్ రంగం అందిస్తుందని ఆశిస్తున్నాను. చదవండి: వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ►దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు వస్తున్న పరిశ్రమలు తదితర అంశాలకు సంబంధించి సమాచారాన్ని బ్యాంకులకు అందిస్తారు. ఈ సమాచారం ఆధారంగా వారికి క్రెడిట్ సౌకర్యాన్ని కల్పించేందుకు బ్యాంకులు ముందుకురావాలి. ఎస్ఎల్బీసీ సమావేశాల్లో చర్చించుకున్న అంశాలన్నీ కూడా లాజికల్ ఎండ్‌కు రావాలి. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె ఎస్ జవహర్‌రెడ్డి, గ్రామవార్డు సచివాలయాల శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, వ్యవసాయశాఖ కమిషనర్ సీహెచ్ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు, ఎస్ఎల్బీసీ ప్రెసిడెంట్, యూనియన్ బ్యాంకు ఎండీ అండ్ సీఈఓ ఏ.మణిమేకలై, ఎస్ఎల్బీసీ కన్వీనర్ నవనీత్ కుమార్, నాబార్డు సీజీఎం ఎం ఆర్ గోపాల్, ఆర్బీఐ డీజీఎం ఏపీ, వికాస్ జైస్వాల్, పలువురు బ్యాంకర్లు హాజరయ్యారు. చదవండి: Political Fact Check: వివేకా హత్య కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ? -
AP: ఎస్ఎల్బీసీ నివేదిక.. వారికి భారీగా రుణాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వివిధ పథకాల ద్వారా బడుగు, బలహీన వర్గాలకు విరివిగా రుణాలు అందుతున్నట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక వెల్లడించింది. గత మూడేళ్లలో ఎస్సీ, ఎస్టీలకు బ్యాంకు రుణాల్లో 80.97 శాతం వృద్ధి నమోదు కాగా బీసీలకు ఇచ్చిన రుణాల్లో 39.61 శాతం వృద్ధి నమోదైంది. చదవండి: ‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం? 2019–20లో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల మొత్తం రూ.15,791 కోట్లు ఉండగా 2021–22 నాటికి రూ.28,577 కోట్లకు పెరిగింది. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రుణాల్లో 2019–20లో ఏడు శాతం వృద్ధి నమోదైతే తర్వాత రెండేళ్లు వరుసగా 18 శాతం, 53 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. అంతేకాకుండా గత మూడేళ్లల్లో బీసీ వర్గాలకు రుణాలు రూ.90,624 కోట్ల నుంచి రూ.1,26,528 కోట్లకు చేరాయి. కోవిడ్ సమయంలో బడుగు, బలహీన వర్గాలను ఆదుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా పెద్దఎత్తున రుణాలను మంజూరు చేయడంతో భారీ వృద్ధి నమోదైనట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. సంక్షేమ పథకాలతో చేయూత వైఎస్సార్ బడుగు వికాసం, స్వయం సహాయక సంఘాలు, జగనన్న తోడు, పీఎం ముద్ర, పీఎం స్వనిధి, స్టాండప్ ఇండియా తదితర పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు భారీగా రుణాలు మంజూరయ్యాయి. జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారాలు చేసుకునే వారికి రెండు దశల్లో 9.05 లక్షల మందికి రుణాలను మంజూరు చేయగా ఈ ఏడాది మూడో దశలో 9 లక్షల మందికి రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అందులో ఇప్పటికే 5.10 లక్షల మందికి మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రుణాలకు వడ్డీ చెల్లింపుల కింద ఇప్పటికే రూ.32.51 కోట్లు బ్యాంకులకు చెల్లించడంతో 7.06 లక్షల మంది లబ్థిదారులకు ప్రయోజనం చేకూరింది. -
తక్కువ వడ్డీకి రెట్టింపు రుణాలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న అంశాలకు బ్యాంకులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. వార్షిక రుణ ప్రణాళిక రూపకల్పనలో ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వాధికారులకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్నారు. అణగారిన వర్గాలకు తక్కువ వడ్డీకే రెట్టింపు రుణాలను మంజూరు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు దోహదం చేయాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన 219వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రూ.3,19,480 కోట్లతో 2022–23 వార్షిక రుణ ప్రణాళికను సీఎం జగన్ ఆవిష్కరించి మాట్లాడారు. ఆ వివరాలివీ.. పేదల ఇళ్ల నిర్మాణాలకు అండగా నిలవాలి రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టామని సీఎం జగన్ తెలిపారు. విలువైన భూముల పట్టాలను పేదలకు అందించామని, వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంటుందన్నారు. పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో బ్యాంకులు టైఅప్ కావడంపై దృష్టి సారించాలని కోరారు. వ్యవసాయ రంగంలో డ్రోన్లు రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) డ్రోన్లను తేవడం ద్వారా వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తున్నామని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని, డ్రోన్ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తూ హార్బర్లు, పోర్టులను నిర్మిస్తున్నామని, వీటికి కూడా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. విద్య, గృహ రుణాలకు మరింత ప్రాధాన్యం ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ బ్యాంకులు 2021–22లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19 శాతానికి చేరుకోవడం ప్రశంసనీయమన్నారు. వ్యవసాయ టర్మ్ రుణాలు నిర్దేశిత లక్ష్యం కంటే 167.27% అధికంగా ఇచ్చారన్నారు. ప్రాథమికేతర రంగానికి రెట్టింపు రుణాలు అంటే 208.48%ఇచ్చారని చెప్పారు. మరికొన్ని రంగాల్లో మాత్రం పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతుల లక్ష్యంలో 31.01%, విద్యా రంగానికి 50.03%, గృహ నిర్మాణానికి 36.11% మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు. సామాజిక, ఆర్థిక ప్రగతిలో విద్య, ఇళ్ల నిర్మాణం అత్యంత కీలకమని, ఈ రంగాలకు బ్యాంకులు మరింత సహకారం అందించాలని సూచించారు. ఖరీఫ్‌లో తగ్గటానికి కారణాలను గుర్తించాలి ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలకు సంబంధించి స్వల్పకాలిక పంట రుణాలు 87.40%, టర్మ్ లోన్స్ 59.88% మాత్రమే ఇచ్చారని, వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే మాత్రం లక్ష్యానికి మించి ఇచ్చారని చెప్పారు. రబీ సీజన్ గణనీయంగా ఉండడం, ఆ సమయంలో పనితీరు బాగుండడం దీనికి కారణంగా కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రుణ పంపిణీ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోయామనే విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని సూచించారు. జూలైలో చిరువ్యాపారులకు రుణాలు చిరు వ్యాపారులు, సంప్రదాయ హస్తకళాకారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వడ్డీ లేకుండా రూ.10 వేల చొప్పున రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తూ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. బ్యాంకులు దాదాపు 14.15 లక్షల మందికి జగనన్న తోడు కింద రుణాలు ఇచ్చాయని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. తదుపరి విడత రుణాలు జూలైలో ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2021–22లో ఎంఎస్ఎంఈలకు 90.55% రుణాలు ఇచ్చారని, లక్ష్యాలను చేరుకునేలా దృష్టి పెట్టాలని కోరారు. ఆ నగదును మినహాయించుకోకూడదు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోరాదని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యం కోసం ఈ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని సీఎం జగన్ చెప్పారు. అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోంద న్నారు. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి సాధికార తవైపు నడిపించడంవల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకుం టోందని చెప్పారు. కోవిడ్ సమయంలో ప్రభుత్వానికి సహకరించిన బ్యాంకర్లందరికీ సీఎం ధన్యవాదాలు తెలి పారు. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవ సాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండ య్య, పరిశ్రమలశాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, ఆర్థి కశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివే ది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయ క్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ వి.బ్రహ్మానందరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈడీ నిధు సక్సేనా, ఆర్బీఐ రీజన ల్ డైరెక్టర్ కె.నిఖిల, నాబార్డు సీజీఎం ఎం.ఆర్.గోపాల్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించాలి మహిళా సాధికారత ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఈ దిశగా విశేష కృషి చేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. వడ్డీలేని రుణాలు, ఆసరా, చేయూత.. తదితర కార్యక్రమాల ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. తీసుకున్న రుణాలను మహిళలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని, వారికిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పస్ ఫండ్ కింద బ్యాంకుల వద్ద ఉన్న తమ డబ్బులపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తూ తీసుకున్న రుణాలపై మాత్రం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బ్యాంకులు దీన్ని పరిగణలోకి తీసుకుని మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కౌలు రైతులకు విరివిగా.. వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి నిర్దేశిత లక్ష్యంలో 82.09 శాతం, పౌల్ట్రీకి 60.26 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని, రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సీఎం కోరారు. 2021–22లో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని, వారికి మరిన్ని రుణాలు అందించేలా బ్యాంకర్లు చొరవ చూపాలని కోరారు. ఇ–క్రాపింగ్ డేటాను పరిగణలోకి తీసుకుని విరివిగా రుణాలివ్వాలన్నారు. ఆర్బీకేలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఈ విషయంలో కౌలు రైతులకు సహాయకారిగా నిలవాలని సూచించారు. 2022–23 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు రంగాల వారీగా రంగం 2022–23 లక్ష్యం (రూ.కోట్లలో) స్వల్ప కాలిక పంట రుణాలు 1,21,580 వ్యవసాయ టర్మ్ రుణాలు, ఇన్ఫ్రా 43,160 మొత్తం వ్యవసాయ రుణాలు 1,64,740 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 50,100 ఇతర ప్రాధాన్యత రంగాలు 20,840 మొత్తం ప్రాధాన్యత రంగం 2,35,680 ప్రాధాన్యేతర రంగం 83,800 2022–23 మొత్తం వార్షిక రుణ ప్రణాళిక 3,19,480 ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా ఊతమివ్వాలి కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదొడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బ తీశాయని ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5 శాతంగా ఉందన్నారు. అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలతో ముడి చమురు, బొగ్గు ధరలు భగ్గుమనడంతో సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిందన్నారు. గత 8 ఏళ్లలో ఇదే అత్యధికమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38% ఉండటం నిరాశ కలిగించే పరిణామమన్నారు. దీంతో రిజర్వ్ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచిందని, రెపోరేటును 40 బేసిక్ పాయింట్లు పెంచిందని, జూన్‌లో దీన్ని మరో 50 బేసిక్ పాయింట్లకు పెంచిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6 శాతా నికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనా వేయడంతో న గదు నిల్వలను బ్యాంకులు క్రమంగా తగ్గిస్తున్నాయన్నా రు. ఈ పరిణామాలన్నీ దిగువ తరగతి వారిపై తీవ్రప్ర భావం చూపుతాయన్నారు. తయారీరంగంపైనా ప్రతి కూల ప్రభావం పడుతుందన్నారు. సరుకులు కొనేవారు లేకపోతే పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుందని, ఈ అంశాలన్నింటినీ బ్యాంకర్లు దృష్టిలో ఉంచుకుంటూ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టి తక్కువ వడ్డీలకు విరివిగా రుణాలివ్వాలని కోరారు. -
వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట: సీఎం జగన్
-
వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. – కోవిడ్ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదుడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బతీశాయి. – కోవిడ్ ప్రభావం తగ్గుతున్న కొద్దీ తిరిగి ఆర్థిక వ్యవస్థ కోలుకునే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. – 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా, ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5శాతంగా ఉంది. – అయితే అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయంగా ఉన్న భౌగోళిక రాజకీయ ఘర్షణలు, దీనికారణంగా వస్తున్న ఒత్తిళ్లతో ముడిచమురు, బొగ్గు ధరలు విపరీతంగా పెరిగాయి. ఫలితంగా సరుకుల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. – ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79శాతానికి చేరిందని కేంద్ర గణాంకాలశాఖ వివరాలు వెల్లడించింది. గత 8 ఏళ్ల వ్యవధిలో ఇదే అత్యధికం. నిరాశ కలిగించే మరొక విషయం ఏంటంటే... గ్రామీణ ప్రాంతాల్లో కూడా ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38శాతం ఉంది. – ఈ కారణాల వల్ల రిజర్వ్ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్ పాయింట్లు పెంచింది. అలాగే రెపోరేటును 40 బేసిక్ పాయింట్లు పెంచింది. జూన్‌లో దీన్ని మరో 50 బేసిక్ పాయింట్లకు రిజర్వ్ బ్యాంకు పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోంది. – ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 6శాతానికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనావేసింది. దీనివల్ల నగదు నిల్వలు క్రమంగా తగ్గుతాయి. – ఈ పరిణామాలన్నీ కూడా దిగువ తరగతి వారిపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తయారీ రంగంపైకూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. సరుకులు కొనేవారు లేకపోతే, వారు పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకోవాలి. –ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బ్యాంకులు విశేష కృషిచేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా అవసరమైన చర్యలను తీసుకోవాలి. తక్కవ వడ్డీలకు విరివిగా రుణాలు ఇవ్వాలి. – ప్రభుత్వం తాను చేయాల్సిందంతా చేస్తోంది. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, ప్రత్యక్షంగా నగదు బదిలీచేస్తోంది. వివిధ పథకాలు, కార్యక్రమాల ద్వారా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోంది. ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి, వారిని సాధికారితవైపు నడిపించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకుంటోంది. – ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ 2020–21లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19శాతం చేరుకోవడం మనసారా అభినందనీయం. కొన్ని రంగాల్లో బ్యాంకుల పనితీరు ప్రశంసనీయం. అగ్రికల్చర్ టర్మ్ లోన్ విషయానికొస్తే వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న దానికన్నా 167.27శాతం సాధించారు. అలాగే ప్రాథమికేతర రంగానికి నిర్దేశించుకున్నదానికంటే రెట్టింపు రుణాలు అంటే 208.48శాతం ఇచ్చారు. – అయితే మరికొన్ని రంగాల్లో పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఎగుమతులకోసం నిర్దేశించుకున్న దాంట్లో 31.01 శాతం, విద్యారంగానికి సంబంధించి 50.03శాతం, హౌసింగ్‌కు సంబంధించి 36.11శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. సామాజిక ఆర్థిక ప్రగతిలో విద్య, హౌసింగ్.. ఈరెండుకూడా అత్యంత కీలకమైనవి. ఈ రంగాలకు సంబంధించి బ్యాంకులు మరింత సానుకూల దృక్పథంతో ముందడుగువేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. – అలాగే వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలను పరిశీలిస్తే ఖరీఫ్‌లో షార్ట్ టర్మ్ క్రాప్ ప్రొడక్షన్ రుణాలు 87.40 శాతం, అదే ఖరీఫ్‌లో అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ 59.88శాతం మాత్రమే ఇచ్చారు. కానీ, వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే మాత్రం లక్ష్యానికి మించి ఇచ్చారు. రబీ సీజన్ గణనీయంగా ఉండడం, ఆ సమయంలో పనితీరు బాగుండడం దీనికి కారణంగా కనిపిస్తోంది. కాకపోతే ఖరీఫ్ సీజన్లో ఎందుకు రుణ పంపిణీ లక్ష్యాలను చేరుకోలేకపోయామన్న విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. – అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యంలో 82.09శాతం, పౌల్ట్రీకి సంబంధించి 60.26శాతం మాత్రమే రుణాలు ఇచ్చారు. ఈ రంగాలకు రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. – అలాగే 2021–22లో నిర్దేశించుకున్న మొత్తంలో కౌలు రైతులకు కేవలం 42.53శాతమే రుణాలు అందాయి. వీరికి రుణాలు అందించడంపై బ్యాంకర్లు మరింత శ్రద్ధపెట్టాలి. రైతులు, కౌలు రైతులు సాగుచేస్తున్న ప్రతి కమతాన్ని కూడా ఇ–క్రాపింగ్ చేస్తున్నాం. సాగుచేస్తున్న కౌలు రైతుల్ని సులభంగా ఈ డేటా ద్వారా గుర్తించవచ్చు. ఈ డేటాను పరిగణలోకి తీసుకుని వారికి విరివిగా రుణాలు ఇచ్చి, బ్యాంకర్లు అండగా నిలవాలి. ఆర్బీకేలు, బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ఇద్దరూ కూడా కౌలు రైతులకు ఈ విషయంలో సహాయకారిగా నిలవాలి. – చిరువ్యాపారులకు, సంప్రదాయ హస్తకళాకారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోంది. వడ్డీలేకుండా రూ.10వేల చొప్పున రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తోంది. రుణభారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. బ్యాంకులు కూడా ఉత్సాహంగా పనిచేస్తూ దాదాపుగా 14.15లక్షల మందికి జగనన్న తోడు కింద రుణాలు ఇచ్చాయి. ఇదే ధోరణిని కొనసాగించాలని కోరుతున్నాను. తదుపరి విడత రుణాలు జులైలో ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. – 2021–22లో ఎంఎస్ఎంఈలకు 90.55శాతం రుణాలు ఇచ్చారు. ఈ రంగంలో కూడా లక్ష్యం కంటే తక్కువగా రుణాలు ఇచ్చారు. దీనిపై బ్యాంకులు దృష్టిపెట్టాలని కోరుతున్నాను. – రాష్ట్రంలో భారీ ఎత్తున గృహనిర్మాణం జరుగుతోంది: – విలువైన భూముల పట్టాలను పేదలకు అందించడం జరిగింది. – వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంది. – పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు విజ్ఞప్తిచేస్తున్నాను. – ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుంది. – టిడ్కో ఇళ్లకు సంబంధించి కూడా లబ్ధిదారులతో బ్యాంకులు టైయప్ కావాల్సి ఉంది: – ఈ అంశంపై బ్యాంకులు దృష్టిపెట్టాలి: – రాష్ట్రంలో మహిళా సాధికారిత కోసం విశేష కృషిచేస్తున్నాం. ఈ కార్యక్రమంలో దాదాపు కోటిమంది మహిళలు లబ్ధిపొందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనైనా, అర్భన్ ప్రాంతాల్లోనైనా మహిళా సాధికారిత ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యం. వడ్డీలేని రుణాలు, ఆసరా, చేయూత.. తదితర కార్యక్రమాల ద్వారా మహిళలకు ఈ ప్రభుత్వంగా అండగా నిలుస్తోంది. ఈ మహిళలకు బ్యాంకులు అండగా నిలవాలి. తీసుకున్న రుణాలను మహిళలు కూడా క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. వారికిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉంది. కార్పస్ ఫండ్ కింద బ్యాంకుల వద్ద ఉన్న మహిళలు డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారని, కానీ తీసుకున్న రుణాలపై అధికంగా వడ్డీని వసూలు చేస్తున్నారని మహిళలు అంటున్నారు. ఈ అంశంపై బ్యాంకులు దృష్టిసారించాలి. మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. – అంతేకాక ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న అంశాలకు బ్యాంకులు సహకారం అందించాలి. – వార్షిక రుణ ప్రణాళికలో ఈ అంశాలను ప్రయార్టీగా తీసుకోవాలి. – దీని కోసం వార్షిక రుణ ప్రణాళిక తయారీలో ప్రభుత్వాధికారుల భాగస్వామ్యాన్నికూడా తీసుకోవాలి. – దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలుగా నిర్దేశించుకున్న అంశాలకు వార్షిక ప్రణాళికలో చోటు దక్కతుంది. – ప్రభుత్వం ఏయే అంశాలపై దృష్టిపెడుతుంది.. వాటికి ఏ రకంగా బ్యాంకుల నుంచి మద్దతు లభించాలన్నదానిపై తగిన కసరత్తు జరుగుతుంది. – దీనివల్ల ఆయా రంగాలకు మేలు జరుగుతుంది. – ఆర్బీకేల్లో డ్రోన్లను తీసుకు వస్తున్నాం. – వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట వేస్తున్నాం. – ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంచుతున్నాం. – నిరుద్యోగులకు ఉపాధి కూడా లభిస్తుంది. – డ్రోన్ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలి. – రాష్ట్రంలో మౌలికసదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నాం. – హార్బర్లు, పోర్టులను నిర్మిస్తున్నాం. – వీటికీ బ్యాంకులు తగిన రీతిలో సహకారం అదించాలి. – వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారు లఖాతాల్లో వేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోకూడదు. – దీనిపై కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీచేసింది. – ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యంకోసం ఈ పథకాలు అమలు చేస్తున్నాం. – ఈ అంశాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలి. – కోవిడ్ సమయంలో బ్యాంకులు ప్రభుత్వానికి చాలా బాగా సహకరించినందుకు బ్యాంకర్లందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2022–23 వార్షిక రుణ ప్రణాళికను వెల్లడించిన ఎస్ఎల్బీసీ: –2022–23 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం : రూ.,3,19,480కోట్లు – ఇందులో 51.56శాతం వ్యవసాయ రంగానికి (రూ.1,64,740కోట్లు) – మొత్తంగా ప్రాథమిక రంగానికి 73.76శాతం (రూ. 2,35,680 కోట్లు) చదవండి: మనం చేయాల్సిందల్లా.. ప్రజల మద్దతు తీసుకోవడమే: సీఎం జగన్ -
పేదింటికి పావలా వడ్డీ రుణాలు
సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులందరికీ వారి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తున్నాయి. ఇళ్ల నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేలు పావలా వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతిని మంజూరు చేసింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కూడా ఈ రుణాలివ్వాలని అన్ని బ్యాంకులను ఆదేశించింది. దీంతో బ్యాంకులు త్వరితగతిన రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఇప్పటికే 2.12 లక్షల మందికి రూ.735.61 కోట్ల మేర పావలా వడ్డీ రుణాలు ఇచ్చాయి. ఈ పథకం కింద తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తోంది. లబ్ధిదారుల వెసులుబాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున రుణాలు ఇప్పిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు, ప్రకాశం, అనంతరపురం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. రుణాల మంజూరులో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి రుణాలిప్పించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి, త్వరితగతిన రుణాలిప్పించాలని కలెక్టర్లకు సూచించినట్లు చెప్పారు. వర్షాలు తగ్గడంతో నిర్మాణాలు వేగవంతం వర్షాలు తగ్గడంతో పేదల ఇళ్ల నిర్మాణం వేగం పుంజుకుందని అజయ్ జైన్ తెలిపారు. ఇప్పటివరకు ఉన్న పెండింగ్ బిల్లులు రూ. 934.26 కోట్లను, సామాగ్రి సరఫరా బిల్లు రూ. 42.22 కోట్లను చెల్లించేసినట్లు చెప్పారు. వచ్చే ఆరు నెలల్లో మరింత వేగంగా ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
భారం పెరిగినా తీరం చేర్చాం
ప్రభుత్వ పథకాల ద్వారా గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. రానున్న రోజుల్లో గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. తద్వారా లావాదేవీల ప్రక్రియ ఊపందుకుంటుంది. ఈ దృష్ట్యా ఏటీఎంలు, ఇతర ఆర్థిక కార్యకలాపాలకు గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వేదిక కావాలి. ఆ మేరకు బ్యాంకులు చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇది గొప్ప మార్పునకు దారితీస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 60.53 శాతం.. అంటే రూ.1,71,520 కోట్ల రుణాలు పంపిణీ చేశాయి. ప్రాధాన్యతా రంగాలకు వార్షిక రుణ లక్ష్యం రూ.2,13,560 కోట్లు కాగా, ఇందులో మొదటి ఆరు నెలల్లోనే 47.29 శాతం.. అంటే రూ.1,00,990 కోట్లు రుణాలుగా పంపిణీ చేశాయి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా తీసుకొచ్చిన పలు కార్యక్రమాలు, పథకాలకు బ్యాంకర్లు తోడ్పాటు అందించి.. ఆర్థిక చక్రానికి ఊతమివ్వాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన నిర్వహించిన 217వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్ వ్యాప్తి తర్వాత దేశ వ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోందన్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడంతో ప్రభుత్వంపై భారం మరింత పెరిగిందని తెలిపారు. కోవిడ్‌తో ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గడంతో పాటు కోవిడ్ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పారు. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడిందని తెలిపారు. ఇలాంటి పరిస్థితిలో బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం గట్టెక్కించగలిగిందన్నారు. బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడంతో పాటు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా చొరవ చూపినందుకు అభినందిస్తున్నానని చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థిక స్థితి కాస్త మందగించిందని, లేకపోతే ఇంకా వేగంగా పుంజుకునేదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇళ్ల లబ్ధిదారులకు మూడు శాతం వడ్డీతో రుణాలు ► ‘నవరత్నాలు–అర్హులైన పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దీన్ని చూసి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. ► దీని వల్ల ఆర్థికంగా ఎన్నో రంగాలకు మేలు కలుగుతోంది. సిమెంటు, స్టీల్ వినియోగం పెరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తోంది. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటుండడంతో వారికీ పని దొరుకుతోంది. ఆ విధంగా గ్రామాలు, పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ► కేంద్రం పీఎంఏవై ద్వారా ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. మరో రూ.35 వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉంది. ఆ ఇళ్ల స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చింది కాబట్టి, బ్యాంకులు ఆ రుణం మంజూరు చేయాలి. ► బ్యాంకులు ఇచ్చే రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయంలో బ్యాంకులు చొరవ చూపితే అన్ని విధాలా ఆర్థిక ప్రగతికి చేయూత ఇచ్చినట్లుగా ఉంటుంది. 2,62,216 టిడ్కో ఇళ్ల (ఫ్లాట్లు)కు సంబంధించి బ్యాంకులు చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుంది. వ్యవసాయానికి మరిన్ని రుణాలు ► వ్యవసాయ స్వల్పకాలిక పంట రుణాలలో తొలి ఆరు నెలల్లోనే 51.57 శాతం పంపిణీ చేశాయి. అయితే వ్యవసాయ దీర్ఘకాలిక రుణాల్లో వ్యవసాయ మౌలిక వసతులకు సంబంధించి 35.33 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళికలో 37.31 శాతం మాత్రమే రుణాలివ్వడం నిరాశాజనకం. ఈ రెండింటిలో రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాలి. ► వార్షిక రుణ ప్రణాళిక తొలి ఆరు నెలల్లో వ్యవసాయ యాంత్రీకరణలో 9.08 శాతం, పాడి రంగానికి 24.29 శాతం, మొక్కలు నాటడం, చెట్లు పెంచడానికి 4.52 శాతం, ఉద్యాన పంటల సాగు, చేపల పెంపకానికి 14.84 శాతం రుణాలు మాత్రమే పంపిణీ చేశారు. ► బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు (గత ఏడాది 42.50 శాతం) ఈ ఏడాది 38.48 శాతానికే పరిమితమయ్యాయి. దీనిపై దృష్టి పెట్టాలి. అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు (కేసీసీ)లను ఆర్బీకేల స్థాయిలో వెంటనే జారీ చేయాలి. ► ఈ–క్రాప్ ఆధారంగా కౌలు రైతులకు కూడా రుణాలు అందాలి. రా>ష్ట్రంలో దాదాపు ఇంకా 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. ఆ మేరకు కరెస్పాండెంట్లను నియమించాలి. వైద్య రంగం రూపురేఖలు మారుస్తున్నాం ► వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తూ, జాతీయ స్థాయి ప్రమాణాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాం. రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి. కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు, మరో 16 నర్సింగ్ కాలేజీలు కడుతున్నాం. ► ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఉంటుంది. వాటిలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఇందు కోసం మొత్తం రూ.12,243 కోట్లు అవసరం కాగా, కొంత రుణం ఇవ్వడానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఇంకా దాదాపు రూ.9 వేల కోట్ల నిధులు కావాలి. ► ప్రాథమిక ఆరోగ్య రంగంలో కూడా సమూల మార్పులు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. 108, 104 సర్వీసులు ఏర్పాటు చేశాం. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఉంటుంది. పీహెచ్‌సీల వైద్యులు ఒక్కో రోజు ఒక్కో గ్రామం సందర్శించి సేవలందిస్తారు. ఆ విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తోంది. ► ఆరోగ్యశ్రీ పథకంలో 2,432 వైద్య, చికిత్స ప్రక్రియలు చేర్చాం. ఈ పథకం కింద ఇకపై పీహెచ్సీలలో కూడా చికిత్స పొందవచ్చు. విద్యా రంగానికి చేయూత ఇవ్వాలి ► విద్యా రంగంలో నాడు–నేడు ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్, ఇంగ్లిష్ ల్యాబ్ వంటి సదుపాయాలు కల్పించాం. ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్సీ సిలబస్ తీసుకొచ్చాం. 15,715 స్కూళ్లను తొలి దశలో రూ.3,500 కోట్లతో సమూలంగా మార్చాం. ► మొత్తం మూడు దశల్లో అన్ని స్కూళ్ల (దాదాపు 57 వేలు)ను సమూలంగా మార్చేస్తాం. ఈ ప్రక్రియలో బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలి. నిజానికి ఇది మానవ వనరుల్లో పెట్టుబడి అని చెప్పొచ్చు. ఎంఎస్ఎంఈల ఓటీఆర్‌ను అమలు చేయాలి ► రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పలు చర్యలు చేపట్టింది. 2019లో తొలి చర్యగా ఎంఎస్ఎంఈల రుణాలను పునర్ వ్యవస్థీకరిస్తూ ‘వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్’ (ఓటీఆర్) ప్రకటించింది. ఎంఎస్ఎంఈలకు సంబంధించి దాదాపు 8.3 లక్షల రుణ ఖాతాలుంటే, వాటిలో కేవలం 1.78 లక్షల ఖాతాలు.. అంటే 22 శాతం ఖాతాలు మాత్రమే పునర్ వ్యవస్థీకరణకు నోచుకున్నాయి. ఈ దృష్ట్యా వీలైనన్ని రుణ ఖాతాలు ఓటీఆర్ వినియోగిచుకునేలా చూడాలి. తద్వారా 10 లక్షల మందికి ఉపాధి కలుగుతుంది. ► ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన (గత ప్రభుత్వం బకాయి పెట్టినవి కూడా) నాలుగైదేళ్ల రాయితీలను చెల్లించాం. కోవిడ్ సమయంలో అండగా నిలిచాం. బ్యాంకులు కూడా సానుకూలంగా ఆలోచించాలి. చిరు వ్యాపారులకు అండగా నిలవాలి ► వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి జగనన్న తోడు పథకం కింద బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నాం. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారి వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా కడుతుంది. ► రెండు విడతల్లో 7.57 లక్షల మందికి రుణాలు ఇచ్చాయి. స్త్రీ నిధి ద్వారా కూడా వారికి రుణాలు ఇస్తున్నాం. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలి. ఈ పథకంలో మొత్తం 9.01 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. ► 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మంది వలంటీర్లు నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) తగ్గించడంలో మీకు తోడుగా నిలుస్తారు. మహిళల జీవనోపాధి పెంపునకు సహకారం ► ఆసరా, చేయూత పథకాల ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చే నాటికి స్వయం సహాయక బృందాలలో 18.36 శాతం ఎన్పీఏలు ఉండేవి. వారికి వివిధ పథకాల ద్వారా తోడుగా నిలబడడంతో వారి రుణాలు, ఎన్పీఏ ఒక శాతం కంటే తక్కువ (0.73శాతం)గా ఉంది. ► మహిళలకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారికి ఉపాధి లభించేలా సొంత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ చర్యల వల్ల ఇవాళ రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా మహిళలు వ్యాపారాల (కిరాణం దుకాణాలు) ద్వారా నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ► గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లో బ్యాంకింగ్ వ్యవస్థను కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని, దశల వారీగా విస్తరిస్తామని బ్యాంకర్లు సీఎంకు వివరించారు. -
ఆ ప్రక్రియలో బ్యాంకులు ప్రభుత్వానికి తోడుగా నిలవాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం 217వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్ తదనంతర పరిస్థితుల్లో జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశాల్లో ఇది ప్రత్యేకమైందన్నారు. ఈ సమావేశంలో యూనియన్ బ్యాంక్ సీఈఓతో పాటు, భారత రిజర్వ్ బ్యాంక్ అధికారులు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర అవసరాలు ఏమిటి? రాష్ట్రానికి సంబంధించి ఏమేం చేస్తే బాగుంటుందన్న అంశాలపై మీరు అందరూ చొరవ చూపి చర్చించడంతో పాటు, కొన్నింటిపై మాకు తగిన సూచనలు కూడా ఇస్తున్నారని సీఎం జగన్ అన్నారు. చదవండి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్ విరాళం ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే..: ►ఇప్పుడు చాలా కీలక పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతోంది. కోవిడ్ వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోంది. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం పుంజుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 8.4 శాతంగా నమోదైంది. ►అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ఆరునెలల సమయంలో చూస్తే అది 13.7 శాతంగా నమోదైంది. కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థికస్థితి కాస్త మందగించింది. లేకపోతే ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా పుంజుకునేది. ఏదేమైనప్పటికీ కరోనా థర్డ్‌వేవ్ దేశ ఆర్థిక రంగంపై చాలా తక్కువ ప్రభావం చూపాలని మేము ఆశిస్తున్నాం. ►ప్రస్తుత పరిస్థితుల్లో రుణ పరిమితి పెంపునకు సంబంధించి గట్టిగా కోరలేము. జాతీయస్థాయిలో ఈ ఏడాది నవంబరు 5వ తేదీ నాటికి జాతీయ బ్యాంకుల రుణాలు రూ.1.12 కోట్ల లక్షల కోట్లకు చేరుకోగా, అవి ఏటా 7.1 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి. కాగా, సుస్థిర ఆర్థిక పురోగతిని సాధించేలా, కొనసాగించేలా బ్యాంకులు తగిన వ్యూహరచనతో ముందుకు పోవాల్సి ఉంది. ►కోవిడ్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల, ప్రభుత్వంపై భారం మరింత పెరిగింది. ►కోవిడ్ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గడం, మరోవైపు కోవిడ్ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడింది. ►అలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గట్టెక్కించగలిగింది. కోవిడ్ సమయంలో కూడా పథకాలను అమలు చేసి సామాన్య ప్రజలను, నిరుపేదలను ఆదుకోగలిగింది. ఒకవేళ ఆ సహకారమే లేకపోతే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం చాలా కష్టమయ్యేది. కోవిడ్ సమయంలో నిరుపేదలను ఆదుకోవడంలో సహకరించినందుకు బ్యాంకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్యాంకుల సహకారం వల్లనే గ్రామీణ ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడింది. ►బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడం, మరోవైపు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా బ్యాంకులు చూపిన చొరవ.. అదే విధంగా కోవిడ్ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు బ్యాంకింగ్ రంగాన్ని అభినందిస్తున్నాను. ►ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలంలోనే బ్యాంకులు చెప్పుకోదగిన స్థాయిలో రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు కాగా, అందులో మొదటి ఆరు నెలల్లోనే 60.53 శాతం, అంటే ఏకంగా రూ.1,71,520 కోట్ల రుణాలు బ్యాంకులు పంపిణీ చేశాయి. అదే విధంగా ప్రాధాన్యతా రంగాలకు వార్షిక రుణ లక్ష్యం రూ.2,13,560 కోట్లు కాగా, అందులో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 47.29 శాతం, అంటే రూ.1,00,990 కోట్లను బ్యాంకులు ప్రాధాన్యతా రంగ రుణాలుగా పంపిణీ చేశాయి. ►ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక పంట రుణాలలో బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళికలో తొలి ఆరు నెలల్లోనే 51.57 శాతం రుణాలు పంపిణీ చేశాయి. ఇది ప్రోత్సాహకరమైన రీతిలో ఉంది. కాగా, వ్యవసాయ దీర్ఘకాలిక (టర్మ్)) రుణాల్లో వ్యవసాయ మౌలిక వసతులకు సంబం«ధించి వార్షిక రుణ ప్రణాళికలో ఈ ఆరు నెలల్లో 35.33 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళికలో 37.31 శాతం మాత్రమే రుణాల్వివడం నిరాశజనకంగా ఉంది. ఈ రెండింటిలో రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాల్సి ఉంది. ►ఇంకా వ్యవసాయ యాంత్రీకరణలో 9.08 శాతం, పాడి రంగానికి 24.29 శాతం, మొక్కలు నాటడం, చెట్టు పెంచడానికి 4.52 శాతం, ఇక ఉద్యాన పంటల సాగు, చేపల పెంపకానికి 14.84 శాతం రుణాలు మాత్రమే వార్షిక రుణ ప్రణాళికలో, తొలి ఆరు నెలల కాలంలో పంపిణీ చేయడం జరిగింది. అంటే ఆయా రంగాలకు నిర్దేశించుకున్న వార్షిక రుణ మొత్తంలో తొలి ఆరు నెలల్లో కేవలం 47.50 శాతం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. ►అదే విధంగా బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు గత ఏడాది (42.50 శాతం) కంటే ఈ ఏడాది (38.48 శాతం) తగ్గాయి. కాబట్టి రెండో దశ కోవిడ్ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కీలక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం దిశగా బ్యాంకులు దృష్టి పెట్టాల్సి ఉంది. అదే విధంగా ఇంకా ఎందరో అర్హులైన రైతులకు ఇంకా ‘కిస్సాన్ క్రెడిట్ కార్డు’ (కేసీసీ)లు అందాల్సి ఉంది. అందువల్ల గ్రామాల్లో రైతులకు అడుగుడుగునా అండగా ఉంటున్న ఆర్బీకేల స్థాయిలో బ్యాంకులు వెంటనే ఆ కార్డుల జారీ చేపట్టి, అర్హులైన ప్రతి రైతుకు కేసీసీ అందేలా చూడాలి. ►అదే విధంగా కౌలు రైతులకు కూడా రుణాలు అందాలి. ఈ–క్రాప్ ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు అయితే, రుణాల జాబితాల నుంచి అనర్హులు తొలగిపోతారు. కౌలు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. కాగా, రాష్ట్రంలో ఇంకా దాదాపు 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది ఆ మేరకు కరెస్పాండెంట్లను నియమించాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి. ►ఇంకా ‘పేదలందరికీ ఇళ్లు’. ప్రభుత్వ మరో ప్రాధాన్య కార్యక్రమం ఇది. ఇందులో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దీన్ని చూసి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దీని వల్ల ఆర్థికంగా కూడా ఎన్నో రంగాలకు మేలు కలుగుతోంది. సిమెంటు, స్టీల్ వినియోగం పెరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తోంది. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటుండడంతో వారికీ పని దొరుకుతోంది. ఆ విధంగా గ్రామాలు, పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. ►నిరుపేదలకు ఇళ్ల కోసం ఇప్పటికే భూమి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాలు కూడా పంపిణీ చేసింది. మరోవైపు కేంద్రం పీఎంఏవైలో ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. మరో రూ.35 వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉంది. ఆ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్ చేసి ఇచ్చింది కాబట్టి, అవసరమైతే వాటిని తనఖా పెట్టుకుని అయినా బ్యాంకులు ఆ రుణాలు పంపిణీ చేయాలి. ►బ్యాంకులు ఇచ్చే ఆ రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయంలో బ్యాంకులు తగిన చొరవ చూపితే ఆ మహిళలు, నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేయూతనిచ్చినట్లుగా ఉంటుంది. ఇంకా 2,62,216 టిడ్కో ఇళ్ల (ఫ్లాట్లు)కు సంబంధించి బ్యాంకులు కాస్త చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కూడా పేదలకు ఎంతో మేలు చేస్తుంది. ►ఎంఎస్ఎంఈ రంగం. ఇది గడచిన 5 దశాబ్ధాలుగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 8 శాతం, ఉత్పాదక రంగంలో 45 శాతం, ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్ఎంఈ రంగానిదే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పలు చర్యలు చేపట్టింది. 2019లో తొలి చర్యగా ఎంఎస్ఎంఈల రుణాలను పునర్వ్యవస్థీకరిస్తూ ‘వన్ టైమ్ రీస్ట్రక్చరింగ్’ (ఓటీఆర్)ను ప్రకటించింది. ఆ మేరకు బ్యాంకులతో మాట్లాడిన ప్రభుత్వం, తమ వంతుగా అవకాశం ఉన్న ప్రతి చోటా ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలబడింది. అయితే ఈ ప్రక్రియలో ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కనబడలేదు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి దాదాపు 8.3 లక్షల రుణ ఖాతాలుంటే, వాటిలో కేవలం 1.78 లక్షల ఖాతాలు.. అంటే 22 శాతం ఖాతాలు మాత్రమే పునర్వ్యవస్థీకరించబడ్డాయి. ►అందువల్ల బ్యాంకులు కూడా ఈ విషయంలో చొరవ చూపి, వీలైనన్ని రుణఖాతాలు ఓటీఆర్ వినియోగిచుకునేలా చూడాలి. ఎందుకంటే దేశ ఆర్థిక రంగంలో ఎంఎస్ఎంఈలది కీలకపాత్ర. ప్రతి ఒక్క సంస్థ కనీసం 10 మందికి ఉపాధి ఇస్తుంది. మనం ఇక్కడ 8.3 లక్షల ఖాతాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, దాదాపు 10 లక్షల ఉద్యోగాలు అన్న మాట. ఇక ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన (గత ప్రభుత్వం బకాయి పెట్టినవి కూడా) నాలుగైదు ఏళ్ల రాయితీలను చెల్లించాం. కోవిడ్ సమయంలో కూడా ఎంఎస్ఎంఈలకు అండగా నిలుస్తూ, ఈ ఏడాది రాయితీలు ఇవ్వడం జరిగింది. అందువల్ల బ్యాంకులు కూడా ఎంఎస్ఎంఈల విషయంలో సానుకూలంగా ఆలోచనే చేయాలి. ►వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి. జగనన్న తోడు పథకం ద్వారా వారికి బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్సిస్తోంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి సంబంధించిన రుణాల వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా కడుతుంది. ఈ పథకంలో బ్యాంకులు ఇప్పటి వరకు రెండు విడతల్లో 7.57 లక్షల మందికి రుణాలు ఇచ్చాయి. స్త్రీ నిధి ద్వారా కూడా వారికి రుణాలు ఇస్తున్నాం. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఈ పథకంలో మొత్తం 9.01 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. ►ఇక రాష్ట్రంలో 2.70 లక్షల వలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించడం జరిగింది. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల వలంటీర్లు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారంతా మీకు సహాయ, సహకారాలు అందిస్తారు. నిరర్థక ఆస్తులను (ఎన్పీఏ) తగ్గించడంలో తోడుగా నిలుస్తారు. ఇంకా విద్య, వైద్య రంగాలలో కూడా చాలా మార్పులు చేస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తూ, జాతీయ స్థాయి ప్రమాణాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాం. ►రాష్ట్రంలో 11 టీచింగ్ ఆస్పత్రులు మాత్రమే ఉండగా, కొత్తగా 16 టీచింగ్ ఆస్పత్రులు, మరో 16 నర్సింగ్ కాలేజీలు కడుతున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్ ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ ఉంటుంది. వాటిలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉంటారు. ఇందు కోసం మొత్తం రూ.12,243 కోట్లు అవసరం కాగా, కొంత రుణం ఇవ్వడానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఇంకా దాదాపు రూ.9 వేల కోట్ల నిధులు కావాలి. ►ప్రాథమిక ఆరోగ్య రంగంలో కూడా సమూల మార్పులు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. 108, 104 సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. ప్రతి పీహెచ్సీలో ఇద్దరు చొప్పున వైద్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ ఉంటుంది. పీహెచ్‌సీల వైద్యులు ఒక్కో రోజు ఒక్కో గ్రామం సందర్శించి సేవలందిస్తారు. ఆ విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ వస్తోంది. ►ఆరోగ్యశ్రీ పథకంలో 2432 వైద్య, చికిత్స ప్రక్రియలు చేర్చడం జరిగింది. ఇప్పుడు ఈ పథకంలో చికిత్స పొందుతున్న వారు ఇక నుంచి పీహెచ్సీలలో కూడా వైద్యం పొందేలా చర్యలు. విద్యా రంగంలోనూ మార్పులు. నాడు–నేడు ద్వారా 10 రకాల సదుపాయాలు. ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, క్లీన్ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ విత్ రన్నింగ్ వాటర్, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్, ఇంగ్లిష్ ల్యాబ్ వంటి సదుపాయాల కల్పన. ఇంకా ఇంగ్లిష్ మీడియమ్. సీబీఎస్సీ సిలబస్. 15,715 స్కూళ్లను తొలి దశలో రూ.3,500 కోట్లతో సమూలంగా మారుస్తున్నాం. మొత్తం మూడు దశల్లో అన్ని స్కూళ్ల (దాదాపు 57 వేలు)ను సమూలంగా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో కూడా బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలి. నిజానికి ఇది మానవ వనరుల్లో పెట్టుబడి అని చెప్చొచ్చు. ►మహిళా సాధికారత కోసం ఆసరా, చేయూత పథకాలు. మా ప్రభుత్వం వచ్చే నాటికి స్వయం సహాయం బృందాలలో 18.36 శాతం ఎన్పీఏలు ఉండేవి. దీంతో ఆ రంగం నిర్వీర్యమై పోయింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు, స్వయం సహాయక బృందాలకు వివిధ పథకాల ద్వారా తోడుగా నిలబడడంలో వారి రుణాలు, ఎన్పీఏ 1 శాతం కంటే తక్కువ (0.73శాతం)గా ఉంది. ►మహిళలకు నాలుగేళ్ల పాటు, ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారికి ఉపాధి లభించేలా సొంత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం మల్టీ నేషనల్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ చర్యల వల్ల ఇవాళ రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా మహిళలు వ్యాపారాల (కిరాణం దుకాణాలు) ద్వారా నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధితో పాటు, రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా పలు చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు కూడా ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు. -
తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన SLBC సమావేశం
-
కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో 216వ రాష్ట్ర స్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘కోవిడ్‌లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గడచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019–20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38శాతం తగ్గింది. మరుసటి ఏడాది అంటే 2020–21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవడానికి లాక్డౌన్, ఇతరత్రా ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది’’ అన్నారు. ‘‘దేశ జీడీపీ వృద్ధిరేటు 7.25శాతం మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో అయితే 24.43 శాతం మేర జీడీపీ వృద్ధిరేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. 2020–21లో దేశ జీడీపీ 7.25 శాతం మేర తగ్గితే ఏపీలో 2.58 శాతానికి పరిమితమైంది. ఇందులో కీలక పాత్ర పోషించిన బ్యాంకర్లను అభినందిస్తున్నాను’’ అన్నారు సీఎం జగన్. ‘‘గతేడాది ఇదే పీరియడ్‌తో పోలిస్తే టర్మ్ రుణాలు రూ. 3,237 కోట్లు తక్కువగా నమోదయ్యాయని.. వ్యవసాయరంగానికి 1.32 శాతం తక్కువగా రుణ పంపిణీ ఉన్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో పంట రుణాలు 10.49 శాతం అధికంగా ఇచ్చినట్టు కనిపించడం సంతోషదాయకం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. కౌలు రైతుల రుణాలపై ప్రత్యేక దృష్టి ‘‘కౌలు రైతులకు రుణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఇప్పటివరకూ 4,91,330 క్రాప్ కల్టివేటర్ రైట్‌కార్డ్స్ (సీసీఆర్సీ)లను ఇచ్చాం. వీరికి సీసీఆర్సీ కార్డులను ఇవ్వడమే కాదు, ఆ డేటాను ఈ–క్రాపింగ్‌లో పొందుపరిచాం. వీరంతా నిజంగా పంటను సాగుచేస్తున్న రైతులు. వీరి విషయంలో బ్యాంకర్లు ముందుకు వచ్చి, వారికి రుణాలు ఇవ్వాలి’’ అని సీఎం జగన్ సూచించారు. ఆర్బీకేలు– విత్తనం నుంచి విక్రయం వరకూ... ‘‘రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా రైతులను ఇవి ముందుండి నడిపిస్తాయి. ఆర్బీకేల్లోనే ఈ–క్రాపింగ్ కూడా చేస్తున్నాం. సాగు చేస్తున్న కమతం వద్దే రైతును నిలబెట్టి ఫొటో తీసి, జియో ట్యాగింగ్‌చేసి మరీ ఈ– క్రాపింగ్ చేస్తున్నాం. పంటను సాగుచేస్తున్న రైతుకు డిజిటల్ రశీదే కాదు, భౌతిక రశీదు కూడా ఇస్తున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. ఆర్బీకేలు–బ్యాంకింగ్ కరస్పాండెంట్లు ‘‘ఇప్పటికే బ్యాంకర్లు 9,160 ఆర్బీకేలను మ్యాపింగ్ చేసి అక్కడ బ్యాంకింగ్ కరస్పాండెంట్లను పెట్టాలని నిర్ణయించడమే కాక.. ఇప్పటికే 6,538 కరస్పాండెంట్లను పెట్టడం ప్రశంసనీయం. ఆ బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఆర్బీకేను వినియోగించాలి.. అలాగే బ్యాంకింగ్ కరస్పాండెంట్ సేవలు ఆర్బీకే వినియోగించుకోవాలి. ఈ–క్రాపింగ్ ప్రక్రియలో బ్యాంకింగ్ కరస్పాండెంట్ భాగం కావాలి’’ అన్నారు సీఎం జగన్. ‘‘బ్యాంకింగ్ విషయంలో వైయస్సార్ జిల్లాలో 100 శాతం డిజిటలైజేషన్ పూర్తిచేశామని చెప్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో డిజిటలైజేషన్ అంటే గ్రామాల్లోని ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్ బిజినెస్ కరస్పాండెంట్లు.. బ్యాంకులుగా మారినప్పుడే డిజిటలైజేషన్ దిశగా గొప్ప అడుగు వేసినట్టు. వ్యవసాయానికి సంబంధించి రుణాలు ఇవ్వడం, ఈ– క్రాపింగ్ ద్వారా వారికి రుణాలు ఇవ్వడం.. ఇవన్నీ ఆర్బీకేల్లోని బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా చేయాలి. సంపూర్ణ డిజిటలైజేషన్‌కు ప్రతిరూపాలుగా ఆర్బీకేలను బ్యాంకర్లు తీర్చిదిద్దాలి’’ అని సీఎం జగన్ కోరారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది మహిళలకు ఇళ్లపట్టాలు రిజిస్ట్రేషన్‌చేసి ఇచ్చాం. ఇప్పటికే 10 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయ్యింది. మొదటి విడతలో 15 లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణం చేస్తున్నాం. ఒక్కో లబ్ధిదారునికి కనీసంగా రూ.4–5లక్షల ఆస్తిని సమకూరుస్తున్నాం. ఇంటి నిర్మాణంకోసం కనీసం ఒక్కొక్కరికి రూ.35వేల రుణం ఇచ్చే దిశగా బ్యాంకులు అడుగులు ముందుకేయాలి. దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో వారికి తగిన తోడ్పాటు లభిస్తుంది. బ్యాంకులు 3 శాతం వడ్డీకి ఇస్తే, మిగిలిన వడ్డీని ప్రభుత్వం భరిస్తుంది. దీనిపై బ్యాంకులు చురుగ్గా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’’ అన్నారు సీఎం జగన్. జగనన్న తోడు– చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు ‘ఇప్పటి వరకు 9.05 లక్షలమంది చిరువ్యాపారులు జగనన్న తోడు ద్వారా లబ్ధి పొందారు. లబ్ధిదారులందరికి రూ.10వేల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. దీనిపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతి ఆరునెలలకు ఒకసారి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడంతోపాటు, అందులో అర్హులైన వారికి రుణాలు మంజూరు ప్రక్రియ కొనసాగాలి. దీనిపై బ్యాంకులు దృష్టిసారించాలి’’ అన్నారు సీఎం జగన్. ‘‘ఎంఎస్ఎంఈలకు తోడుగా నిలవాలని బ్యాంకర్లను కోరుతున్నాను. ఒక్కో పరిశ్రమ కనీసం 10 నుంచి 20 మందికి ఉపాధినిస్తున్నాయి. వీరికి తగిన తోడ్పాటు అందించాలని బ్యాంకర్లను కోరుతున్నాను’’ అన్నారు సీఎం జగన్. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హాజరయ్యారు. ఇవీ చదవండి: శిశు మరణాలకు కళ్లెం AP: ఇక రోజూ బులెటిన్ బోర్డు -
బ్యాంకర్లు సహకరించాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరిన్ని రుణాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లిలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీతో సీఎం వైఎస్ జగన్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్ధిక రంగానికి వ్యవసాయ రంగం వెన్నుముక. రాష్ట్రంలో దాదాపు 62 శాతం వ్యవసాయ రంగంపై ఆధారపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.13,500 ఇస్తున్నాం. ఖరీఫ్ (జూన్)లో 7,500, రబీ (అక్టోబర్)లో రూ.4వేలు.. పంట చేతికొచ్చే సమయంలో మరో రూ.2వేలు సాయం చేస్తున్నాం. రాష్ట్రంలో 10,600కు పైగా ఆర్బీకే కేంద్రాలు ఏర్పాటు చేశాం పంటల బీమా, సున్నా వడ్డీ రుణాల కోసం ఈ-క్రాపింగ్ తప్పనిసరి. గతేడాది ధరల స్థిరీకరణ నిధి కింద రూ.3,200 కోట్లతో పంటలు కొన్నాం.. ఈ ఏడాది రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామంలో గోడౌన్లు, మండల కేంద్రాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు... ప్రతి గ్రామంలో జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నాం. నాడు-నేడు కింద స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన చేపట్టాం. ఆస్పత్రుల్లో కూడా నాడు-నేడు కింద మార్పులు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో విలేజ్ క్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నాం. (చదవండి: పండుగ వేళ ఉద్యోగులకు సీఎం జగన్ తీపి కబురు) ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో టీచింగ్ ఆస్పత్రి ఏర్పాటు. వైఎస్సార్ చేయూత ద్వారా 25లక్షల మంది మహిళలకు ప్రయోజనం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పెండింగ్‌లో ఉన్న రూ.1,100 కోట్ల రాయితీ ఇచ్చాం. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా మహిళలకు రుణాలు ఇచ్చాం’అని సీఎం జగన్ పేర్కొన్నారు. బ్యాంకర్లు ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాలలో బ్యాంకర్స్ సహకారంపై చర్చించారు. బ్యాంకర్లు కూడా సానుకూలంగా ఉన్నారని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు గౌతమ్‌రెడ్డి, కన్నబాబు, సీఎస్, బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
రుణ లక్ష్యం రూ.2,51,600 కోట్లు
సాక్షి, అమరావతి: ఈ ఆర్థిక (2020–21) సంవత్సరంలో వార్షిక రుణ ప్రణాళిక రూ.2,51,600 కోట్లుగా నిర్ధారించారు. సీఎం వైఎస్ జగన్మోన్రెడ్డి అధ్యక్షతన బుధవారం తన క్యాంపు కార్యాలయంలో 211వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ ఆర్థిక ఏడాది వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వ్యవసాయ రంగానికి పెద్దపీట ► 2020–21లో మొత్తం రుణాల లక్ష్యం రూ.2,51,600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం పెంపు. వ్యవసాయ రంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే 11.9% అధికం. ► సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు)కు రూ.39,600 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం. ఇది గత ఏడాదితో పోలిస్తే 10 శాతం పెంపు. ► విద్యా రుణాల కింద రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9,710 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.410 కోట్లు, పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్ ఎనర్జీ) రంగానికి రూ.454 కోట్లు, వ్యవసాయ రంగంలో యాంత్రీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని లక్ష్యం. ► మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని లక్ష్యం కాగా, ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే 6.75 శాతం పెంపు. సకాలంలో రుణ వివరాలు ఇవ్వాలి ► 2019–20లో రుణాల లక్ష్యం రూ.2,29,200 కోట్లు. ఇందులో రూ.2,27,882 కోట్లు రుణాలుగా ఇచ్చారు. మొత్తమ్మీద 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. వ్యవసాయ రంగంలో రూ.1,15,000 కోట్ల లక్ష్యం మేరకు రూ.1,13,997 కోట్లు రుణాలుగా ఇచ్చారు. లక్ష్యంలో 99.13 శాతం సాధ్యమైంది. ► రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉందని అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీని ఖరీఫ్ నాటికి చెల్లిస్తామని, ఇందుకు సంబంధించిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులు బ్యాంకర్లను కోరారు. ► గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ తదితర ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలన్నారు. ► ప్రతి ఆర్బీకేలో ఈ సదుపాయాలను అందుబాటులోకి తెస్తున్నామని, ప్రతి మండలానికీ కోల్డు స్టోరేజీ, కోల్డు రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామన్నారు. నీటి ప్రాజెక్టులకు సాయం అందించాలి ► రాష్ట్రంలో చేపడుతున్న సాగు నీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థిక శాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ► ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్బీసీ కన్వీనర్, బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్ పాల్గొన్నారు. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ గార్డ్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగస్టులో చేయూత.. సెప్టెంబర్‌లో ఆసరా
పాడి పరిశ్రమాభివృద్ధికి అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రఖ్యాత కంపెనీలతో ఒప్పందాలు చేసుకోబోతున్నాం. ఈ కంపెనీలు, బ్యాంకుల సహాయంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. – సీఎం జగన్ సాక్షి, అమరావతి: ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాలను ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న అర్హత కలిగిన మహిళలకు వైఎస్సార్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాలు అందిస్తామని తెలిపారు. వైఎస్సార్ ఆసరాతో 90 లక్షలకుపైగా ఉన్న డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తామని చెప్పారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో తన అధ్యక్షతన జరిగిన 211వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాం ► క్లిష్ట పరిస్థితుల్లో బ్యాంకర్లు ఏపీకి సహకరిస్తున్నారు. సున్నా వడ్డీ పంట రుణాలకు సంబంధించి రైతుల ఖాతాల వివరాలను పంపాలని కోరుతున్నాను. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించాం. ఈ ఏడాదికి సంబంధించినవి కూడా (2019–20) రైతులకు చెల్లిస్తాం. ► ప్రభుత్వం ఒక పథకం ప్రారంభించింది అంటే.. దాని మీద విశ్వాసం, నమ్మకం కలగాలి. దీన్ని అమలు చేయకుంటే ప్రజలు బాగా ఇబ్బంది పడతారు. మేం చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాం. చెప్పిన ప్రకారం అన్నీ నెరవేరుస్తున్నాం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మహిళల సాధికారిత దిశగా రెండు పథకాలను ప్రారంభిస్తున్నాం. ► 25 లక్షల మహిళలకు వైఎస్సార్ చేయూత అందిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో 45 నుంచి 60 ఏళ్ల మధ్య అర్హత ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగేళ్ల పాటు రూ.75 వేలు సాయం అందిస్తాం. ఈ సహాయం ద్వారా వారి జీవితాల్లో మార్పులు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నాం. మహిళలకు ఆదాయం తెచ్చే కార్యక్రమాలు చేపట్టాలి ► సెప్టెంబర్‌లో స్వయం సహాయక సంఘాలకు రూ.6,700 కోట్లకు పైగా ఇవ్వబోతున్నాం. మొత్తమ్మీద ఏటా రూ.11 వేల కోట్ల చొప్పన, నాలుగేళ్ల పాటు ఈ రెండు పథకాలకు రూ.44 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ► 90 లక్షల మందికిపైగా స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా ద్వారా, 25 లక్షల మంది మహిళలకు వైఎస్సార్ చేయూత కింద.. మొత్తంగా కోటి మందికి పైగా సహాయం లభిస్తుంది. ► అమూల్ తరహాలో మరిన్ని ఒప్పందాలు చేసుకుంటాం. ఈ కంపెనీలు, బ్యాంకర్లు ఒక తాటిమీదకు వచ్చి, ఈ మహిళలకు ఆదాయాలను తెచ్చే కార్యక్రమాలను చేపట్టాలి. గ్రామాల్లో మెరుగైన ఆర్థిక వ్యవస్థలను తీసుకురావడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయి. ► కోవిడ్ నివారణా చర్యలను పగడ్బందీగా చేస్తున్నాం. రోజుకు 50 వేలకు పైగా పరీక్షలు చేస్తున్నాం. దేశంలోనే ఇది అత్యధికం. ప్రతి మిలియన్‌కు 32 వేల మందికిపైగా పరీక్షలు చేస్తున్నాం. క్లస్టర్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి 90 శాతానికి పైగా పరీక్షలు చేస్తున్నాం. ► ఈ సమావేశంలో ఎస్ఎల్బీసీ కన్వీనర్, బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్, సీఎస్ నీలం సాహ్ని, పలు శాఖల ఉన్నతాధికారులు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ గార్డ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం రైతులు, మహిళలు, ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అన్ని వర్గాల వారికి ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలకు బ్యాంకర్లు పూర్తి సహాయ, సహకారాలు అందించాలి. – డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ నగదు కోసం బ్యాంకుకు రానక్కర్లేదు ► నగదు కోసం ప్రజలు బ్యాంకులకు రావాల్సిన అవసరం లేదు. అన్ని ఏటీఎం కేంద్రాల్లో అవసరాల మేరకు నగదును ఉంచుతున్నాం. దీని వల్ల భౌతిక దూరం పాటించడానికి వీలుంటుంది. ప్రజలు తప్పనిసరి అయితేనే బ్యాంకులకు రావాలి. వైఎస్సార్ కడప జిల్లాలో పూర్తి స్థాయి డిజిటలైజేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నాం. ► వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుబ్రతో దాస్, ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల కోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సహాయం మహిళా సాధికారితలో మైలు రాయి కావాలి. మహిళల జీవితాలను మార్చడానికి ఈ సహాయం ఉపయోగపడాలి. దీని కోసం బ్యాంకర్లు ముందుకు రావాలి. -
సీఎం జగన్ అధ్యక్షతన బ్యాంకర్ల కమిటీ భేటీ
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ 211వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం బుధవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్ని, ఎస్ఎల్బీసీ కన్వీనర్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫీల్డ్ జనరల్ మేనేజర్ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డ్ సీజీఎం సుధీర్‌కుమార్.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దినేశ్‌కుమార్ గార్డ్, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ సుబ్రతాదాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. '2020–21 సంవత్సరంలో రుణాల లక్ష్యం 2,51,600 కోట్లు. ఇది గత ఏడాదితో పోలిస్తే 9.78 శాతం అధికం. వ్యవసాయరంగానికి రూ.1,28,660 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది గత ఏడాదితో పోలిస్తే 11.9శాతం అధికం. 2019–20 రుణప్రణాళికలో 99.42 శాతం లక్ష్యాన్ని చేరుకుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈలు)కు రూ.39,600 కోట్ల రుణాలు ఇవ్వాలని భావిస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే 10 శాతం అధికం. విద్యా రుణాల కింద రూ.1,900 కోట్లు, ఇళ్ల రుణాల కింద రూ.9,710 కోట్లు, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద రూ.410 కోట్లు ఇవ్వాలని లక్ష్యం. పునరుత్పాదక ఇంధన (రెన్యువబుల్ ఎనర్జీ) రంగానికికి రూ.454 కోట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. వ్యవసాయ రంగంలో యాంత్రికీకరణకు రూ.3,400 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మొత్తం మీద ప్రాధాన్యతా రంగానికి రూ.1,87,550 కోట్లు ఇవ్వాలని భావిస్తుండగా.. ఇది గత ఏడాదితో పోలిస్తే 10.88 శాతం అధికం. ప్రాధాన్యేతర రంగానికి రూ.64,050 కోట్లు రుణాలుగా ఇవ్వాలని లక్ష్యం. గత ఏడాదితో పోలిస్తే ఇది 6.75 శాతం అధికం' అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. సమావేశంలోని మఖ్యంశాలు.. ►రైతులకు సున్నా వడ్డీ సకాలంలోనే ఇవ్వాలన్న కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. ఖరీఫ్ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును రబీ నాటికి చెల్లిస్తామని, రబీ రుణాలకు సంబంధించి సున్నా వడ్డీ డబ్బును ఖరీఫ్ నాటికి చెల్లిస్తామని, దీనికి సంబంధిచిన వివరాలు సకాలంలో ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వ అధికారులు బ్యాంకర్లను కోరారు. ►అలాగే గ్రామాల్లో గోదాములు, గ్రేడింగ్, సార్టింగ్ తదితర ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక ప్రత్యేక ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని, దీని కోసం తగిన సహాయం అందించాలని కోరారు. ►ప్రతి ఆర్బీకేలో ఈ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. ప్రతి మండలానికీ కోల్డ్ స్టోరేజీ, కోల్డ్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ►ఆర్బీకేల ద్వారా రైతు ఉత్పత్తుల సమాచారాన్ని సెంట్రల్ సర్వర్‌కు అనుసంధానం చేసి వారి మార్కెటింగ్‌కు సహకారం అందిస్తామని సీఎం చెప్పారు. ► రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులకూ తగిన సహకారం అందించాలని ఆర్థికశాఖ అధికారులు బ్యాంకర్లను కోరారు. గోదావరిలో వరద జలాలను వినియోగించుకోవడానికి బృహత్ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, దీనికి తగిన విధంగా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. ► కౌలు రైతుల రుణాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని బ్యాంకర్లను కోరారు. -
మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకురావాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని సీఎం జగన్ అన్నారు. సచివాలయంలో 210వ రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్.ఎల్.బీ.సీ)సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశం సీఎం జగన్ మాట్లాడుతూ.. వైఎస్సార్ నవోదయం పధకం కింది ఎంఎస్ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న ఆరు జిల్లాల్లో ఒకలా, మిగిలిన ఏడు జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లు ఉన్నాయని సీఎం జగన్ తెలిపారు. (పర్యావరణ పరిరక్షణకు చర్యలు) బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని సీఎం జగన్ అన్నారు.12.5 శాతం, 13.5 శాతం ఇలా వసూలు చేసుకుంటూ పోతున్నారని, వడ్డీరేట్ల విషయలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వేయడం ఆలోచించదగ్గ విషయన్నారు. వైయస్సార్ కడప జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలుచేయాలని వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గ్రామాల ఆర్థిక వ్యస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. (వైఎస్సార్సీపీలోకి శమంతకమణి, యామినిబాల) గ్రామ సచివాలయలు, విలేజ్ క్లినిక్‌లు, ఇంగ్లిషు మీడియంలో బోధించే పాఠశాల, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకు వస్తున్నాని సీఎం జగన్ అన్నారు. గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారని, ఆర్బీకే(రైతు భరోసా కేంద్రం)లో ఇంటర్నెట్ కియోస్క్ అందుబాటులో ఉంటుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ కియోస్క్ద్వారా తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్ చేస్తే నాణ్యతా నిర్దారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే ఈ-పంటలో విలేజ్ అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లతో వివరాలు నమోదు చేయిస్తున్నామని చెప్పారు. దీనికోసం వారందరికీ ట్యాబ్‌లు ఇస్తున్నామని, ఆ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తామని సీఎం జగన్ తెలిపారు.డిమాండ్ సప్లయిలను పరిగణలోకి తీసుకుని ఏ పంటలు వేయాలన్నదానిపై రైతుకు ఆర్బేకేల ద్వారా సూచనలు చేస్తామన్నారు. ఈ- పంటలో నమోదైన వివరాల ఆధారంగా సాగుచేస్తున్న పంటలకు తగినట్టుగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే కౌలు రైతులు సాగుచేస్తున్న పంట వివరాలు అందుబాటులో ఉంటాయని,రెవెన్యూ అసిస్టెంట్లు ద్వారా కౌలు రైతు, యజమాని ఇద్దరూ అగ్రిమెంటు మీద సంతకం చేసి బ్యాంకు రుణం ఇస్తారని సీఎం జగన్ తెలిపారు.బ్యాంకులు వారికి ఉదారంగా రుణాలు ఇవ్వాలని, రైతులకు పండించిన పంటకు తగిన ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. ధర రాని పక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్లో పోటీని పెంచేలా, రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్ వివరించారు. మే 15న ఆర్బీకే ద్వారా రైతు భరోసా ఇవ్వబోతున్నామని, మైక్రోఎంటర్ ప్రైజెస్ కోసం జూన్‌లో ఓ పథకాన్ని ప్రారంభించబోతున్నామని సీఎం జగన్ వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టిందని సీఎం జగన్ వివరించారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..) రాయలసీమ కరువు నివారణా చర్యల్లో భాగంగా వరదజలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు నీరు పోవాలని తెలిపారు. దివంగత నేత వైఎస్సార్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ అన్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీటి సరఫరా అందించాలన్నారు. శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితులు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ప్రజలకు వాటర్ గ్రిడ్ ద్వారా నీటిని అందించడానికి ముందడుగు వేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటికీ బ్యాంకర్ల సహకారం కావాలని సీఎం జగన్ అన్నారు. ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ జె.పకీరసామి మాట్లాడుతూ.. 210వ ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్దేశించుకున్న రుణాలు, ప్రగతిని వివరించారు. 5వేల జనాభాకు పైబడిన 567 చోట్ల సీబీఎస్ బ్యాకింగ్ సర్వీసులు ప్రారంభించామని తెలిపారు. ఐదు కి.మీ పరిధిలో బ్యాంకింగ్ సదుపాయంలేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశామని చెప్పారు. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 29 మధ్య జరిగిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 1.1 లక్షల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని ఆయన అన్నారు.ఏడాదిలోగా వైఎస్సార్ కడప జిల్లాలో వందశాతం డిజిటల్ బ్యాంకింగ్ సదుపాయం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రారంభిస్తున్న పది వేలకుపైగా రైతు భరోసా కేంద్రాల్లో బ్యాకింగ్ సదుపాయం తీసుకువచ్చేలా, బ్యాంకు మిత్రలను ఆయా కేంద్రాల్లో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని జె.పకీరసామి అన్నారు. వైఎస్సార్ నవోదయం పథకం ద్వారా సమస్యలు ఎదుక్కొంటున్న ఎంఎస్ఎంఈలకు అండగా నిలవాలన్నారు. ప్రాథమిక రంగానికి నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యం రూ. 1,69,200 కోట్లకు గాను డిసెంబరు నాటికి రూ. 1,18,464 కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. అది 70.01 శాతంగా ఉందని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంలో నిర్దేశించుకున్న రూ.1,15,000 కోట్లకు గాను డిసెంబరు నాటికి రూ.83,444 కోట్లు (72.56శాతం) రుణాలుగా ఇచ్చామని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు దృష్టి సారించాలని ఆయన అన్నారు. 2019 వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యం రూ. 2,29,200 కోట్లు కాగా, డిసెంబరు వరకూ రూ. 1,73,625 కోట్లు (75.75శాతం) ఇచ్చామని జె.పకీరసామి తెలిపారు.ఎంఎస్ఎంఈలకు రూ.36,000 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం కాగా డిసెంబరు వరకూ రూ. 29, 442 కోట్లు (81.78శాతం)ఇచ్చామన్నారు.స్సీ, ఎస్టీ మహిళలకు స్టాండప్ ఇండియా కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యం చేసుకోగా డిసెంబరు వరకూ రూ. 4,857 మందికి సహాయం చేశామని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో సీఎం వైఎస్ జగన్, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఎస్.ఎస్.రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, కే వి నాంచారయ్య, కన్వీనర్, ఎస్ఎల్బీసీ, సీజీఎం(ఆంధ్రా బ్యాంకు), ఆర్బీఐ జనరల్ మేనేజర్ సుందరం శంకర్, నాబార్డ్ సీజీఎం ఎస్.సెల్వరాజ్ పాల్గొన్నారు. -
బ్యాంకర్లు ఏం కోరినా చేసేందుకు సిద్ధం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నామన్నారు. బుధవారం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన 208వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, సంబంధిత ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో బ్యాంకర్లతో సీఎం వైఎస్ జగన్ పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న, చేయబోయే పథకాలకు తోడ్పాటునందించాలని కోరారు. సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ‘మా ప్రభుత్వం విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు వేస్తోంది. ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ. వివిధ వర్గాల ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రభుత్వం వివిధ పథకాల కింద అనేకమందికి నగదు ఇస్తుంది. ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలి. వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుంది. ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆర్థికశాఖతో టచ్‌లో ఉండండి.. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం. ఎక్కడ సమస్య ఉన్నా.. ప్రభుత్వం ముందుకు వస్తుంది. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి... సున్నా వడ్డీ కింద చెల్లింపును రశీదు రూపంలో వారికి అందిస్తారు. సున్నా వడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో మాకు జాబితా ఇవ్వండి చాలు, వాటిని మేం చెల్లిస్తాం. ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టిపెట్టాలి. చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్లకింద చిరువ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తాం. చిరువ్యాపారులకు ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ప్రభుత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరం. ఎక్కడ సమస్య ఉన్నా.. ప్రభుత్వం ముందుకు వస్తుంది, వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది. మేం చాలా ప్రోయాక్టివ్ గా ఉంటాం. ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువుగా ఉందని బ్యాంకు అధికారులు చెప్పడం సంతోషకరం. వర్షాలు బాగా పడ్డాయి, రిజర్వాయర్లలో నీళ్లుకూడా ఉన్నందున రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉంది, ఆమేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. విప్లవాత్మక విధానాలు చేపట్టాం.. వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం, విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజలధనాన్ని ఆదా చేశాం. దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదు. ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్ విధానాలు లేవు. రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నాం. పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్ ప్రివ్యూ అత్యుత్తమం. ఏ రాష్ట్రం కూడా రివర్స్ టెండరింగ్ అమలు చేయడంలేదు. పీపీఏల విషయంలో అదే విధంగా విప్లవాత్మక విధానాలు చేపట్టాం. అధికారంలోకి రాగానే విద్యుత్ అధికారులతో మేం రివ్యూ పెడితే డిస్కంలపై రూ.20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. 13 నెలలుగా చెల్లింపులు లేవని చెప్పారు. అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టవు. రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువుగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారు, వేసే పరిస్థితి ఉంది. పరిశ్రమలకిచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడాలేదు. విద్యుత్‌రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యుత్ రంగం పునరుద్దరణకు మీ అందరి సహకారం కావాలి’ అంటూ ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లను సీఎం వైఎస్ జగన్ కోరారు. -
‘రైతులకు, నిరుద్యోగులకు చేయూత కల్పించాలి’
సాక్షి, కృష్ణా : రైతులకు, నిరుద్యోగులకు చేయూత కల్పించి వారిని ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యం సూచించారు. పదమూడు జిల్లాల బ్యాంకు ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం గురువారం విజయవాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2022 నాటికి బ్యాంకింగ్ వ్యవస్దలో సమూల మార్పులు తీసుకు రావడానికి ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఎకానమీని పెంచడానికి బ్యాంకర్లందరు ఒక ప్రణాళిక రూపోందిస్తున్నారని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితులకన్నా బ్యాంకింగ్ వ్యవస్థను మెరుగు పరచడానికి కొత్త పద్దతులను రూపొందించాలని పేర్కొన్నారు. ఆర్దికంగా ఎదుగుతున్నప్పుడు నష్టపోకపండా ఏవిధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై బ్యాంకర్లు దృష్టిపెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతుల రుణాల విషయంలో ఏవిధంగా సహాయం చేయగలుగుతామో బ్యాంకర్లకు వివరించినట్లు వెల్లడించారు. . రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లకు ఇచ్చే రాయితీల గురించి ఆయన చర్చించారు. -
వ్యవసాయానికి పెద్దపీట
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) గురువారం విడుదల చేసింది. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక మొత్తంతో పోలిస్తే రుణ వితరణ లక్ష్యంలో 6.95 శాతం వృద్ధి కనిపించింది. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు జె.స్వామినాథన్ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2018–19 వార్షిక రుణ ప్రణాళిక తీరుతెన్నులను సమీక్షించడంతో పాటు, 2019–20లో లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడంతో పాటు, లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాల్సిందిగా కోరారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఎస్ఎల్బీసీ గురువారం విడుదల చేసింది. 2018–19 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.1.36 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం 6.95 శాతం మేర కేటాయింపులు పెంచారు. రూ.1.01 లక్షల కోట్లతో.. అనగా మొత్తం కేటాయింపుల్లో 69 శాతం ప్రాధాన్యత రంగాలకే కేటాయించారు. ఈ రంగాల్లోనూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్ఎల్బీసీ ప్రకటించింది. గత ఏడాది రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.58.06 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం 68.59 వేల కోట్లు వితరణ చేయాలని నిర్ణయించారు. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయానిది 68 శాతం వాటా కాగా, గత ఏడాదితో పోలిస్తే 18.14 శాతం మేర అదనంగా రుణ వితరణ జరగనుంది. వ్యవసాయానికి కేటాయించిన రూ.68 వేల కోట్లలో పెట్టుబడి రుణంగా రూ.19,856 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం రూ.15,569 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయం తర్వాత సూక్ష్మ, లఘు పరిశ్రమల రంగాని(ఎంఎస్ఎంఈ)కి ప్రాధాన్యత ఇస్తూ, రూ.21,420 కోట్లు రుణ వితరణ లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం 21,381 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.29 కోట్ల మేర పెంచుతూ లక్ష్యం ఖరారు చేశారు. స్వల్పకాలిక రుణాల్లో వెనుకంజ... 2018–19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు స్వల్పకాలిక వ్యవసాయ రుణ వితరణ లక్ష్యంలో 79.43 శాతం అనగా రూ.33,752 కోట్లు మాత్రమే రుణ వితరణ చేశారు. అయితే పెట్టుబడి రుణాల విషయంలో మాత్రం రూ.15,568 కోట్ల లక్ష్యానికి మించి రూ.17,600 కోట్లు మంజూరు చేశారు. రూ.534 కోట్లు విద్యకు, రూ.5,849 కోట్లు గృహ రుణాల రూపంలో ఇచ్చారు. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల రుణ వితరణలో బ్యాంకర్లు ఏకంగా లక్ష్యానికి మించి రూ. 36,639 కోట్ల మేర అనగా.. 171 శాతం రుణాలిచ్చారు. 1.46 లక్షల మంది మైనారిటీలకు రూ.2,257 కోట్లు, బలహీన వర్గాలకు రూ.15,367 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.3,930 కోట్లు రుణం ఇచ్చారు. 2018–19లో ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద రూ.6,242 కోట్లు లక్ష్యం కాగా, రూ,7,777 కోట్లు రుణ వితరణ జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగంలో రూ.95,736 కోట్ల మేర రుణాలిచ్చి 103.22 శాతం లక్ష్యం సాధించారు. విస్తరిస్తున్న బ్యాంకు సేవలు... బ్యాంకు సేవల విస్తరణలో భాగంగా 5 వేల పైబడిన జనాభా ఉన్న 245 గ్రామాల్లో 2018–19లో బ్యాంకులు కొత్త శాఖలు ఏర్పాటు చేశాయి. ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద 81.76 లక్షల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించారు. వీటిలో 74.99 లక్షల మందికి రూపే కార్డులు మంజూరు చేశారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 59.46 లక్షల మందికి ప్రయోజనం కలగగా, 20 లక్షల మంది ఖాతాదారులను ప్రధాన్ మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కిందకు తెచ్చారు. ప్రజల్లో బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు జూన్ 3 నుంచి 7 తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు సాక్షి, హైదరాబాద్ : వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు సాగు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. రైతు రుణమాఫీలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం స్పష్టమైన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సులో 2019–20 వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. కాళేశ్వరం జలాలతో పెరిగే సాగు విస్తీర్ణానికి అనుగుణంగా మార్కెటింగ్, ఇతర వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధిరేటు 15.5 శాతంగా ఉందని, ప్రాధాన్యత రంగంతో పాటు, ఇతర రంగాల్లో రుణ వితరణ లక్ష్యం 40 శాతానికి పైగా ఉండటం శుభసూచకమన్నారు. అనుబంధ రంగాలకు రుణాలు.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వ్యవసాయంతో పాటు, దాని అనుబంధ రంగాలకు రుణ వితరణ పెంచాలని వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్ ఉందని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ వితరణ పెంచడం ద్వారా రుణ వితరణ సులభతరమవుతుందన్నారు. గ్రామీణుల ముంగిటకు బ్యాంకింగ్ సేవలు తీసుకెళ్లాలన్నారు. ప్రాధాన్యత రంగాలకు రుణ మంజూరులో అగ్రస్థానం ఇస్తూనే, ఇతర రంగాల్లో రుణ వితరణ లక్ష్యం చేరుకోవాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రీజినల్ డైరెక్టర్ సుభ్రతాదాస్ అన్నారు. ఎస్ఎల్బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జె.స్వామినాథన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో రుణాల మంజూరు తీరుపై ఎస్ఎల్బీసీ సమీక్షించింది. ధరణి పోర్టల్ అందుబాటులో లేకపోవడంతో పంట రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను బ్యాంకర్లు ప్రస్తావించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ రాహుల్ బొజ్జా, నాబా ర్డు సీజీఎం విజయకుమార్, ఆర్బీఐ జీఎం సుందరం శంకర్, ఎస్ఎల్బీసీ కన్వీనర్ యూ ఎన్ఎన్ మయ్యా పాల్గొన్నారు. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు స్వామినాథన్ పదోన్నతిపై వెళ్తున్న నేపథ్యంలో నూతన చైర్మన్‌గా ఓబుల్‌రెడ్డి నియామకాన్ని సమావేశం ఆమోదించింది. -
స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశాన్ని వివిధ బ్యాంకుల అధికారులు, ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు.. విజయవాడలో గురువారం నిర్వహించారు. దీనిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని కలెక్టర్లకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం, ఉత్పాదకత పెంచడం వంటి అంశాలపై చర్చించారు. 2016–17 వార్షిక రుణ ప్రణాళికపై చర్చించారు. బ్యాంకర్లు రైతులకు అందిస్తున్న రుణాలు చర్చిస్తూ.. రైతులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చెల్లింపులు చేయలేకపోతున్నారన్నారు. నగదు రహిత లావాదేవీలను ముమ్మరం చేయాలని సూచించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గాను కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్యాంకర్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి రుణాలు అధిక మొత్తంలో అందించి వారి లక్ష్యాలను సాధించేదిశగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం, ఆంధ్రాబ్యాంక్ జోనల్ మేనేజర్ రాధాకిషన్, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ మేరీ సగారియా, డీఆర్డీఏ పీడీ జీసీ కిశోర్‌కుమార్, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు జి. రామారావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కేవీ ఆదిత్యలక్ష్మి, బీసీ కార్పొరేషన్ ఈడీ జి.రాజారావు, డీసీసీబీ సీఈఓ సత్యనారాయణ, డిప్యూటీ ఎల్డీఎం ఎం. సత్యనారాయణ, వివిధ బ్యాంకు అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
మీరే నచ్చచెప్పుకోండి
రుణమాఫీ కానివారిపై రాష్ర్ట ప్రభుత్వానికి స్పష్టం చేసిన బ్యాంకర్లు హైదరాబాద్: తొలి దశలో రుణ మాఫీ కాని రైతులకు ఎందుకు మాఫీ కాలేదో ప్రభుత్వ యంత్రాంగమే చెప్పాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రైతు సాధికార సదస్సుల సమయంలోనూ, ఆ తర్వాత... బ్యాంకుల ఉద్యోగులను, సిబ్బందిని లక్ష్యంగా ఎంచుకుని రుణ మాఫీ కాని రైతులు, ప్రజాప్రతినిధులు నిలదీశారని తెలిపింది. అంతేకాకుండా చాలావరకు బ్యాంకు బ్రాంచీల దగ్గర నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారని వివరించింది. ఈ పరిణామాలతో బ్యాంకుల క్షేత్రస్థాయి సిబ్బందిలో నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతిందని బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. గత నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 188వ బ్యాంకర్ల కమిటీ సమావేశం మినిట్స్‌లో ఆయా అంశాలను స్పష్టం చేశారు. రుణ మాఫీ లబ్ది చేకూర్చడంలో బ్యాంకుల పాత్ర, జవాబుదారీతనం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎస్ఎల్బీసీ కోరింది. ఈ విషయంలో ఒక ఆలోచన చేసి జిల్లా అధికార యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని తెలిపింది. రుణ మాఫీ కాని రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అప్ప చెప్పాలని, రైతులకు వ్యవసాయ శాఖ చేత నచ్చచెప్పించాలని సూచించింది. ఏ మాత్రం జాప్యం లేకుండా రుణాలు రెన్యువల్ చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే పంటల బీమాతో పాటు వడ్డీ రాయితీ రాదనే విషయాన్ని అధికారులతో చెప్పించాలంది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం 20 శాతం రుణాలనే మాఫీ చేస్తున్నందున మిగతా రుణ మొత్తాన్ని రైతులు తమ సొంత నిధులతో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రుణాలు రెన్యువల్ కావని స్పష్టం చేసింది. మిగిలిన రుణాలను రైతులు చెల్లించి రెన్యువల్ చేయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విస్త్రృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, లేదంటే వ్యవసాయ రంగం రుణ పరపతి దెబ్బతింటుందని ఆంధ్రాబ్యాంకు చైర్మన్, ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు సి.వి.ఆర్. రాజేంద్రన్ స్పష్టం చేశారు. 27న ఎస్ఎల్బీసీ భేటీ ప్రస్తుత రబీ సీజన్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు వ్యవసాయ తదితర రంగాల రుణ పరపతి పురోగతిపై సమీక్షించేందుకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కావడం లేదు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు హాజరు కానున్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు, రుణ మాఫీ సంబంధిత అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. -
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రుణాల రీ షెడ్యూల్
వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాదిపాటు మారటోరియం జనవరి 12 నాటికల్లా కొత్త రుణాలు మంజూరు రుణాల చెల్లింపు 5-7ఏళ్ల ల్లోపు చెల్లించేందుకు అంగీకారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక కమిటీ సమావేశంలో నిర్ణయాలు హైదరాబాద్: హుద్ హుద్ తుపాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్రలోని కోస్తా జిల్లాల్లో పంట, పరిశ్రమలకోసం తీసుకున్న రుణాలను రీ షెడ్యూల్ చేయడంతోపాటు కొత్త రుణాలను మంజూరు చేసేందుకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) నిర్ణయిం చింది. తుపాను వల్ల నాలుగు జిల్లాల్లో, మొత్తం 120 మండలాలు నష్టపోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. శ్రీకాకుళంలో 38, విశాఖపట్టణంలో 43, విజయనగరంలో 34, తూర్పు గోదావరిలో ఐదు మండలాల్లో జనవరి 12 నాటికల్లా రుణాలను రీ షెడ్యూల్, కొత్త రుణాలను ఇచ్చేం దుకు బ్యాంకర్లు తమ అంగీ కారం తెలిపారు. మూడు నెల ల్లోగా బాధితులకు అందాల్సిన సహాయ, తోడ్పాటు కార్యక్రమాలన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రత్యేక సమావేశం తీర్మానించింది. వ్యవసాయ, వ్యవసాయేతర రుణాలకు ఏడాది పాటు మారిటోరియం విధిస్తూ ఎస్ఎల్బీసీ నిర్ణయం తీసుకుంది. రుణాలను రైతులు 5-7 ఏళ్లలో తిరిగి చెల్లించవచ్చని పేర్కొంది. హుద్‌హుద్ తుపాను కారణంగా నష్టపోయిన జిల్లాల్లో సహాయక చర్యలపై రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి ప్రత్యేక సమావేశం శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సమావేశానికి ఎస్ఎల్బీసీ కన్వీనరు సి.దొరస్వామి అధ్యక్షత వహించారు. ఎస్ఎల్బీసీ అధ్యక్షుడు, ఆంధ్రాబ్యాంకు సీఎండీ సివిఆర్ రాజేంద్రన్ ప్రారంభోపన్యాసం చేశారు. జిల్లా కలెక్టర్ల ధ్రువీ కరించిన అన్నవారీ సర్టిఫికెట్లు పొందాలని, బ్యాంకర్లు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని ఆయన కోరారు. తుఫాను బాధితుల సహాయార్థం బ్యాంకర్ల కమిటీ తరఫున రూ.2.50 కోట్లను శుక్రవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుకు కలిసి అందించామని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి బ్యాంకు ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సీం చేసిన సూచనకు తాము సుముఖత వ్యక్తం చేశామన్నారు. ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అజయ్ కల్లాం మాట్లాడుతూ తుఫాను నష్టంపై గ్రామాలవారీగా నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపామని, ఈ నెల 12 తర్వాత కేంద్ర బృందం పర్యటన ఉండొచ్చని తెలిపారు. తుపాను కారణంగా 3 వేలకుపైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు తీరని నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలని ఆ సమాఖ్య అధ్యక్షుడు ఏపీకే రెడ్డి ఎస్ఎల్బీసీకి విన్నవించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఖరీఫ్ రుణాలు45 శాతం వరకు మంజూరు చేయగా, మధ్య, చిన్న తరహా పరిశ్రమల రుణాల శాతం కేవలం 25గానే ఉందని ఆయన తెలిపారు. -
15న ఆర్బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక
హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ నెల 15న హైదరాబాద్ రానున్నారు. 16న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశముంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణ మాఫీపై తీసుకుంటున్న చర్యలను ఆయన వద్ద ప్రస్తావిస్తారని భావిస్తున్నారు. -
పాతవి చెల్లిస్తేనే కొత్త రుణాలు
* బ్యాంకర్ల స్పష్టీకరణ * రుణమాఫీపై ఏమీ మాట్లాడలేమని వ్యాఖ్య * గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌లో ఆర్థిక సాక్షరత్పై ప్రచారం ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పాత రుణాలు చెల్లించినవారికే కొత్త రుణాలు మంజూరు చేస్తామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్ఎల్బీసీ) వర్గాలు స్పష్టంచేశాయి. రుణమాఫీపై ఇప్పుడు తాము ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నాయి. బ్యాంకింగ్ రంగంపై అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ఆర్థిక సాక్షరత (ఫైనాన్స్ లిటరసీ) ప్రచార కార్యక్రమాన్ని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గోల్కోండ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రారంభించింది. అంతకుముందు నాబార్డు ప్రాంతీయ కార్యాలయంలో ఆర్థిక సాక్షరతపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్, ఎస్ఎల్బీసీ-ఏపీ కన్వీనర్ సి.దొరైస్వామి మాట్లాడుతూ.. రిజర్వ్‌బ్యాంకు మార్గదర్శకాల మేరకు పాత రుణాలు చెల్లిస్తేనే కొత్త రుణాలను మంజూరు చేయగలమని స్పష్టంచేశారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి ప్రతీ ఇంట్లో ఒకరికి బ్యాంకు ఖాతా ఉండేలా చూడాలని కేంద్రం భావిస్తోం దని.. ఇందుకోసం ఆగస్టు 28న ప్రధాని నరేంద్రమోడీ ‘జన్ ధన్ యోజన్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారని నాబార్డు సీజీఎం మమ్మెన్ తెలిపారు. ఇందులో భాగంగానే నాబార్డు ఆర్థిక సాక్షరత ప్రచార కార్యక్రమాన్ని చేపడుతోందని వెల్లడించారు. ఏపీలో 93 శాతం కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు ఉండగా.. తెలంగాణలో ఇది 95 శాతానికిపైగానే ఉందన్నారు.