తక్కువ వడ్డీకి రెట్టింపు రుణాలు: సీఎం వైఎస్‌ జగన్‌ | AP CM YS Jagan Unveiled Loan Plan In 219th State Level Bankers Committee Meeting | Sakshi
Sakshi News home page

తక్కువ వడ్డీకి రెట్టింపు రుణాలు: సీఎం వైఎస్‌ జగన్‌

Published Fri, Jun 10 2022 3:43 AM | Last Updated on Fri, Jun 10 2022 4:37 PM

AP CM YS Jagan Unveiled Loan Plan In 219th State Level Bankers Committee Meeting - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న అంశాలకు బ్యాంకులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. వార్షిక రుణ ప్రణాళిక రూపకల్పనలో ఈ అంశాలకు ప్రాధాన్యమిచ్చి ప్రభుత్వాధికారులకు కూడా భాగస్వామ్యం కల్పించాలన్నారు. అణగారిన వర్గాలకు తక్కువ వడ్డీకే రెట్టింపు రుణాలను మంజూరు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేందుకు దోహదం చేయాలని సూచించారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన 219వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో రూ.3,19,480 కోట్లతో 2022–23 వార్షిక రుణ ప్రణాళికను సీఎం జగన్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ఆ వివరాలివీ..

పేదల ఇళ్ల నిర్మాణాలకు అండగా నిలవాలి
రాష్ట్రంలో భారీ ఎత్తున గృహ నిర్మాణాలను చేపట్టామని సీఎం జగన్‌ తెలిపారు. విలువైన భూముల పట్టాలను పేదలకు అందించామని, వీటిపై అప్పులు ఇవ్వడం ద్వారా బ్యాంకులిచ్చే రుణాలకు తగిన భద్రత ఉంటుందన్నారు. పేదలకు అండగా నిలవాలని బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు. ఇళ్ల నిర్మాణం వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందన్నారు. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులతో బ్యాంకులు టైఅప్‌ కావడంపై దృష్టి సారించాలని కోరారు.

వ్యవసాయ రంగంలో డ్రోన్లు 
రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకేల్లో) డ్రోన్లను తేవడం ద్వారా వ్యవసాయ రంగంలో అత్యాధునికతకు పెద్దపీట వేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందిస్తున్నామని, తద్వారా నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని,  డ్రోన్‌ టెక్నాలజీకి బ్యాంకర్లు సహకారం అందించాలని కోరారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తూ హార్బర్లు, పోర్టులను నిర్మిస్తున్నామని, వీటికి కూడా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు.

విద్య, గృహ రుణాలకు మరింత ప్రాధాన్యం
ఎన్నో అవరోధాలు ఉన్నప్పటికీ బ్యాంకులు 2021–22లో నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాన్ని అధిగమించి 133.19 శాతానికి చేరుకోవడం ప్రశంసనీయమన్నారు. వ్యవసాయ టర్మ్‌ రుణాలు నిర్దేశిత లక్ష్యం కంటే 167.27% అధికంగా ఇచ్చారన్నారు. ప్రాథమికేతర రంగానికి రెట్టింపు రుణాలు అంటే 208.48%ఇచ్చారని చెప్పారు. మరికొన్ని రంగాల్లో మాత్రం పనితీరు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఎగుమతుల లక్ష్యంలో 31.01%, విద్యా రంగానికి 50.03%, గృహ నిర్మాణానికి 36.11% మాత్రమే రుణాలు ఇచ్చారన్నారు.  సామాజిక, ఆర్థిక ప్రగతిలో విద్య, ఇళ్ల నిర్మాణం అత్యంత కీలకమని, ఈ రంగాలకు బ్యాంకులు మరింత సహకారం అందించాలని సూచించారు. 

ఖరీఫ్‌లో తగ్గటానికి కారణాలను గుర్తించాలి
ఖరీఫ్‌లో వ్యవసాయ రుణాలకు సంబంధించి స్వల్పకాలిక పంట రుణాలు 87.40%, టర్మ్‌ లోన్స్‌ 59.88% మాత్రమే ఇచ్చారని, వార్షిక రుణ ప్రణాళికను పరిశీలిస్తే మాత్రం లక్ష్యానికి మించి ఇచ్చారని చెప్పారు. రబీ సీజన్‌ గణనీయంగా ఉండడం, ఆ సమయంలో పనితీరు బాగుండడం దీనికి కారణంగా కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో రుణ పంపిణీ లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోయామనే విషయంపై బ్యాంకులు దృష్టిపెట్టాలని సూచించారు.

జూలైలో చిరువ్యాపారులకు రుణాలు
చిరు వ్యాపారులు, సంప్రదాయ హస్తకళాకారులకు జగనన్న తోడు అండగా నిలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వడ్డీ లేకుండా రూ.10 వేల చొప్పున రుణాలను బ్యాంకుల ద్వారా ఇప్పిస్తూ వడ్డీ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందన్నారు. బ్యాంకులు దాదాపు 14.15 లక్షల మందికి జగనన్న తోడు కింద రుణాలు ఇచ్చాయని,  ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. తదుపరి విడత రుణాలు జూలైలో ఇచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. 2021–22లో ఎంఎస్‌ఎంఈలకు 90.55% రుణాలు ఇచ్చారని, లక్ష్యాలను చేరుకునేలా దృష్టి పెట్టాలని కోరారు.

ఆ నగదును మినహాయించుకోకూడదు
వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న నగదును బ్యాంకులు మినహాయించుకోరాదని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వమే మార్గదర్శకాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఒక ప్రత్యేక ఉద్దేశంతో, ఒక లక్ష్యం కోసం ఈ పథకాలు అమలు చేస్తున్న విషయాన్ని బ్యాంకులు దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు.

ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోంది
ప్రభుత్వం చేయాల్సిందంతా చేస్తోందని సీఎం జగన్‌ చెప్పారు. అవినీతి, పక్షపాతం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా నగదును బదిలీ చేస్తోంద న్నారు.  ప్రజల చేతుల్లో డబ్బులు పెట్టి సాధికార తవైపు నడిపించడంవల్ల గ్రామీణ ఆర్థికవ్యవస్థ నిలదొక్కుకుం టోందని చెప్పారు. కోవిడ్‌ సమయంలో ప్రభుత్వానికి సహకరించిన బ్యాంకర్లందరికీ సీఎం ధన్యవాదాలు తెలి పారు.

సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవ సాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండ య్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్, ఆర్థి కశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివే ది, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎంఎం నాయ క్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈడీ నిధు సక్సేనా, ఆర్బీఐ రీజన ల్‌ డైరెక్టర్‌ కె.నిఖిల, నాబార్డు సీజీఎం ఎం.ఆర్‌.గోపాల్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.  

మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించాలి
మహిళా సాధికారత ద్వారానే ఆర్థిక ప్రగతి సాధ్యమని, ఈ దిశగా విశేష కృషి చేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. వడ్డీలేని రుణాలు, ఆసరా, చేయూత.. తదితర కార్యక్రమాల ద్వారా మహిళలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు. తీసుకున్న రుణాలను మహిళలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారని, వారికిచ్చే రుణాలపై వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. కార్పస్‌ ఫండ్‌ కింద బ్యాంకుల వద్ద ఉన్న తమ డబ్బులపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తూ తీసుకున్న రుణాలపై మాత్రం అధిక వడ్డీలు వసూలు చేస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బ్యాంకులు దీన్ని పరిగణలోకి తీసుకుని మహిళలపై వడ్డీ భారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

కౌలు రైతులకు విరివిగా..  
వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి నిర్దేశిత లక్ష్యంలో 82.09 శాతం, పౌల్ట్రీకి 60.26 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని, రుణ పంపిణీలో సమస్యలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను సీఎం కోరారు. 2021–22లో కౌలు రైతులకు కేవలం 42.53 శాతమే రుణాలు అందాయని, వారికి మరిన్ని రుణాలు అందించేలా బ్యాంకర్లు చొరవ చూపాలని కోరారు. ఇ–క్రాపింగ్‌ డేటాను పరిగణలోకి తీసుకుని విరివిగా రుణాలివ్వాలన్నారు. ఆర్బీకేలు, బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు ఈ విషయంలో కౌలు రైతులకు సహాయకారిగా నిలవాలని సూచించారు.

2022–23 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు రంగాల వారీగా
రంగం                                       2022–23 
                                                 లక్ష్యం (రూ.కోట్లలో)

స్వల్ప కాలిక పంట రుణాలు    1,21,580
వ్యవసాయ టర్మ్‌  రుణాలు, ఇన్‌ఫ్రా    43,160
మొత్తం వ్యవసాయ రుణాలు    1,64,740
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు    50,100
ఇతర ప్రాధాన్యత రంగాలు    20,840
మొత్తం ప్రాధాన్యత రంగం    2,35,680
ప్రాధాన్యేతర రంగం    83,800
2022–23 మొత్తం వార్షిక రుణ ప్రణాళిక    3,19,480 

ఆర్థిక వ్యవస్థ కోలుకునేలా ఊతమివ్వాలి
కోవిడ్‌ కారణంగా తలెత్తిన ఆర్థిక ఒడిదొడుకులు దేశ ఆర్థికాభివృద్ధి గమనాన్ని దారుణంగా దెబ్బ తీశాయని ముఖ్యమంత్రి తెలిపారు. కోవిడ్‌ ప్రభావం తగ్గుతున్న కొద్దీ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటున్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయని చెప్పారు. 2021–22లో దేశ జీడీపీ రూ.237 లక్షల కోట్లు కాగా ప్రస్తుత ధరల సూచీ ప్రకారం జీడీపీ వృద్ధి అంచనా 19.5 శాతంగా ఉందన్నారు. అంతకంతకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ పరిణామాలతో ముడి చమురు, బొగ్గు ధరలు భగ్గుమనడంతో సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర గణాంకాల శాఖ వెల్లడించిందన్నారు.

గత 8 ఏళ్లలో ఇదే అత్యధికమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం అత్యధికంగా 8.38% ఉండటం నిరాశ కలిగించే పరిణామమన్నారు. దీంతో రిజర్వ్‌ బ్యాంకు మే 6న నగదు నిల్వల నిష్పత్తిని 50 బేసిక్‌ పాయింట్లు పెంచిందని, రెపోరేటును 40 బేసిక్‌ పాయింట్లు పెంచిందని, జూన్‌లో దీన్ని మరో 50 బేసిక్‌ పాయింట్లకు పెంచిందన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఇదే ధోరణి కనిపిస్తోందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6 శాతా నికి పైబడి ఉంటుందని ఆర్బీఐ అంచనా వేయడంతో న గదు నిల్వలను బ్యాంకులు క్రమంగా తగ్గిస్తున్నాయన్నా రు.

ఈ పరిణామాలన్నీ దిగువ తరగతి వారిపై తీవ్రప్ర భావం చూపుతాయన్నారు. తయారీరంగంపైనా ప్రతి కూల ప్రభావం పడుతుందన్నారు. సరుకులు కొనేవారు లేకపోతే పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వస్తుందని, ఈ అంశాలన్నింటినీ బ్యాంకర్లు దృష్టిలో ఉంచుకుంటూ ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకునేలా చర్యలు చేపట్టి తక్కువ వడ్డీలకు విరివిగా రుణాలివ్వాలని కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement