సంతోషంగా ఉంది.. ఆ రంగాల పనితీరు ప్రశంసనీయం: సీఎం జగన్‌ | State Level Bankers Committee Meeting Chaired Cm Ys Jagan | Sakshi
Sakshi News home page

సంతోషంగా ఉంది.. ఆ రంగాల పనితీరు ప్రశంసనీయం: సీఎం జగన్‌

Published Fri, Mar 10 2023 2:49 PM | Last Updated on Fri, Mar 10 2023 5:57 PM

State Level Bankers Committee Meeting Chaired Cm Ys Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఎస్‌ఎల్‌బీసీ 222వ సమావేశంలో గత ఏడాది ఎంతమేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నది ఎస్‌ఎల్‌బీసీ వెల్లడించింది. ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపుగా ఇచ్చామనీ, మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా ఎక్కువ రుణాలు ఇచ్చామని పేర్కొంది.

ప్రాథమిక రంగానికి 2022–23 రుణప్రణాళిక లక్ష్యం రూ. 2,35,680 కోట్లు. ఇచ్చిన రుణాలు రూ. 2,34,442 కోట్లు. 99.47శాతం లక్ష్యాన్ని చేరుకున్నామని, వ్యవసాయరంగానికి రుణాల లక్ష్యం రూ. 1,64,740 కోట్లు కాగా.. 1,72,225 కోట్లు ఇచ్చామని వెల్లడి. 104.54 శాతం చేరుకున్నామని ఎస్‌ఎల్‌బీసీ తెలిపింది. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ. 50,100 కోట్లు కాగా, రూ. 53,149 కోట్లు ఇచ్చామని వెల్లడి. 106.09 శాతం మేర రుణాలు ఇచ్చామని, ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ. 1,63,903 కోట్లు ఇచ్చామని వెల్లడి. దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59శాతం మేర రుణాలు ఇచ్చామని వెల్లడించింది.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:
222వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశం సందర్భంగా, రాష్ట్రంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ విజయాలు సాధించినందుకు సంతోషిస్తున్నాను. నా అభినందనలు కూడా తెలియజేస్తున్నాను. 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించింది. ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉంది. కొన్ని రంగాలకు సంబంధించి పనితీరు చాలా ప్రశంసనీయం.

అయితే కొన్ని రంగాలకు సంబంధించి గమనించిన అంశాలను బ్యాంకింగ్‌ రంగం దృష్టికి  తీసుకువస్తున్నాను. విద్య, మరియు గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా రుణాలు తక్కువగా ఉన్నాయి. విద్యా రంగానికి కేవలం 42.91శాతం, గృహనిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చాయి. సామాజిక-ఆర్థిక ప్రగతిలో ఈ రెండు రంగాలు అత్యంత కీలకమని ఈ సందర్భంగా స్పష్టం చేయదలుచుకున్నాను. బ్యాంకింగ్‌ రంగం ఈ రెండు రంగాల పట్ల మరింత సానుకూల దృక్పథంతో, అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని కోరుతున్నాను.

30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ప్రభుత్వమే ఈ ఇళ్ల స్ధలాలు సేకరించి, లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏప్రిల్‌ నెలలో మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నాం. వీటితో కలిపి దాదాపు 25 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుంది. సిమెంటు, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తోంది. వీటికి అదనంగా ఇళ్ల నిర్మాణ లబ్దిదారులకు రూ.35వేలు రుణం 3 శాతం వడ్డీతో అందించాలని బ్యాంకులతో చర్చించాం. ప్రభుత్వం ఈ రుణాలకు సంబంధించిన వడ్డీ చెల్లిస్తుంది.

ఈ ఇళ్ల లబ్ధిదారులందరూ మహిళలే. వారి పేరు మీద ఇళ్లపట్టాలు ఇచ్చాం. ఇందులో భాగంగా ఇంకా రుణాలు రాని వారికి కూడా ఈ రూ.35 వేల రుణం మంజూరు చేయాలని కోరుతున్నాం. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటే... స్టీల్, సిమెంటు వినియోగం వల్ల గ్రామీణ ఆర్ధిక రంగం అభివృద్ధికి గణనీయమైన ఊతమిస్తుంది. మొత్తం 30.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. ఇలా కడుతున్న ఒక్కో ఇంటి మార్కెట్‌ విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో గృహనిర్మాణ రంగంలో బ్యాంకులు మరింత ఊతమివ్వాల్సిన అవసరం ఉంది.

ఇక వ్యవసాయ రంగం విషయానికొస్తే స్వల్పకాలిక పంట రుణాల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చూస్తే కేవలం 83.36శాతం మాత్రమే చేరుకున్నాం. దీనికి సంబంధించిన కారణాలపై దృష్టి పెట్టి ఎస్‌ఎల్బీసీ సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. కౌలు రైతులకు రుణాలకు సంబంధించి డిసెంబర్‌ 2022 వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించాం. 1,63,811 మంది కౌలు రైతు ఖాతాలకు మాత్రమే క్రెడిట్‌ను పొడిగించారు. కౌలు రైతుల రుణాల లక్ష్యం రూ. 4,000 కోట్లు కాగా, మొదటి 9 నెలల్లో కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు చేశారు.

కౌలు రైతులకు బ్యాంకులు మరింత బాసటగా నిలవాలి. రాష్ట్రంలో సాగు చేసే ప్రతి ఎకరా భూమి కూడా ఇ–క్రాపింగ్‌ చేస్తున్నాం. సాగు చేసే రైతు పేరు, వేసే విస్తీర్ణం, సాగు చేసిన పంట.. ఈ వివరాలన్నీకూడా డిజిటలైజేషన్‌ చేస్తున్నాం.  విత్తనం నుంచి పంట విక్రయం దాకా తోడుగా నిలిచే ఆర్బీకే వ్యవస్థ రాష్ట్రంలో సమర్థవంతంగా పనిచేస్తోంది. ఈ ఆర్బీకేల ద్వారానే ఇ–క్రాపింగ్‌ సమర్థవంతంగా చేస్తున్నాం.

డిజిటల్‌ రశీదులతో పాటు, ఫిజికల్‌ రశీదులు కూడా రైతులకు ఇస్తున్నాం. కౌలు రైతులకు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నాం. భూ యజమానుల హక్కులకు భంగం లేకుండా కౌలు చేసుకునేందుకు ఇరువురి మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన పత్రాలను కూడా గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతున్నాం. అందువల్ల కౌలు రైతులకు రుణాల విషయంలో ఎలాంటి సందేహాలను బ్యాంకులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. తమ వద్దనున్న డేటా ఆధారంగా కౌలు రైతులకు ఇచ్చే రుణాలను గణనీయంగా పెంచాలి.

మహిళా స్వయం సహాయ సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీల విషయంలో బ్యాంకులు పునర్‌ పరిశీలన చేయాలి. మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారు. కాని వారికిచ్చే రుణాలపై మాత్రం అధిక వడ్డీలు వేస్తున్నారు. ఈ విషయంలో బ్యాంకులు తగిన పరిశీలన చేసి తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చూడాలి. ఈ వడ్డీ రేట్లను పర్యవేక్షించడానికి... అధికార్లు, బ్యాంకర్లు కలిసి సమావేశం కావాలి.

ఇది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు కోటిమందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రంగంలో ఇప్పుడు ఎన్‌పీఏలు లేరు.  వీరిపట్ల బ్యాంకులు ఉదారతతో ఉండాలి. సున్నావడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సంఘాల మహిళలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచారు.

చిరు వ్యాపారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారి అవసరాలను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10,000 చొప్పున రుణాలను అందిస్తూ... వీటిపై వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటివరకూ 25 లక్షల మంది రుణాలు పొందారు. వీరికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్‌ రంగం కూడా చక్కటి ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కూడా బ్యాంకర్లు అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. జగనన్న తోడు తదుపరి దశను 2023 జూలైలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధమవుతోంది.

యువతీ యువకులను సుశిక్షితంగా తయారు చేసేందుకు, వారికి ఉపాధి కల్పనను మెరుగుపరిచేందుకు ప్రతి నియోజకవర్గంలో కూడా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పాఠ్యప్రణాళిక, కోర్సులు బోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్దేశించేందుకు ఒక యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ కార్యక్రమాలకు బ్యాంకులు బాసటగా నిలవాలి.

మరో విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాం. సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు నిర్మించాం. ఎవరైనా గ్రామాల్లోకి అడుగుపెడితే అక్కడే ఇంగ్లిషు మీడియం స్కూళ్లు కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు దూరంలో అదే గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌ కనిపిస్తాయి. అక్కడే మనం డిజిటల్‌ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్‌ లిమిటెడ్‌ బ్యాండ్‌విడ్త్‌తో వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించనున్నాం. కంప్యూటర్లు, వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యంతో డిజిటల్‌ లైబ్రరీలు గ్రామాల స్వరూపాన్ని మార్చబోతున్నాయి. నాబార్డు, బ్యాంకులు డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపైనా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది. 

ఇక ఎంఎస్‌ఎంఈల విషయానికొస్తే రాష్ట్ర సామాజిక–ఆర్థిక పురోగతికి అవి ఎంతో తోడ్పడ్డాయి. ఉపాధి కల్పన మరియు రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలను పోత్సాహించడం చాలా అవసరం. వీటి పురోగతికి అవసారమైన అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ రంగం యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, బ్యాంకింగ్‌ రంగం మరింత శ్రద్ధ వహించాలని మరియు చిన్న సంస్థలకు అభివృద్ధిని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలి. విదేశాల్లో ఎంఎస్‌ఎంఈల పనితీరును అధ్యయనం చేసి మంచి విధానాలను ఇక్కడ అమలు చేయడంద్వారా ఈ రంగం వృద్దికి మరింత చేయూత నివ్వాలని అధికారులను ఇదివరకే ఆదేశించాను.

ప్రభుత్వం చురుకైన విధానాల కారణంగా, 2021–22 ఆర్థిక సంవత్సరంలో సంవత్సరానికి సంబంధించి రాష్టం11.43% జీఎస్‌డీపీ వృద్ధి రేటును సాధించిందని మీ దృష్టికి తీసుకురావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేశంలోనే అన్నిరాష్ట్రాల్లో కెల్లా అత్యధిక వృద్ధిరేటును సాధించాం.

రాష్ట్రంలో వ్యాపార అనుకూల వాతావరణం, దృఢమైన మౌలిక సదుపాయాల లభ్యత, నైపుణ్యం కలిగిన మానవశక్తి, స్వాభావిక సహజ ప్రయోజనాల కారణంగా, మార్చి 3 మరియు 4 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ 2023 కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సదస్సు వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులకు తమ కృతనిశ్చయాన్ని వ్యక్తంచేశారు.

సదస్సు సందర్భంగా 352 ఎంవోయూలు కుదిరాయి. రూ. 13,05,663 కోట్లు పెట్టుబడులు, 6,03,223 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఈ పెట్టుబడులు పెట్టేందుకు రుణాలు లభ్యత అనేది చాలా ముఖ్యమైనది. అలాగే అనుబంధ యూనిట్లకు అవసరమైన మద్దతును కూడా బ్యాంకింగ్ రంగం అందిస్తుందని ఆశిస్తున్నాను.
చదవండి: వివేకా హత్య కేసు.. తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు వస్తున్న పరిశ్రమలు తదితర అంశాలకు సంబంధించి సమాచారాన్ని బ్యాంకులకు అందిస్తారు. ఈ సమాచారం ఆధారంగా వారికి  క్రెడిట్‌ సౌకర్యాన్ని కల్పించేందుకు బ్యాంకులు ముందుకురావాలి. ఎస్‌ఎల్బీసీ సమావేశాల్లో చర్చించుకున్న అంశాలన్నీ కూడా లాజికల్‌ ఎండ్‌కు రావాలి.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గ్రామవార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి,  ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ,  మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్, యూనియన్‌ బ్యాంకు ఎండీ అండ్‌ సీఈఓ ఏ.మణిమేకలై, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ నవనీత్‌ కుమార్, నాబార్డు సీజీఎం ఎం ఆర్‌ గోపాల్, ఆర్‌బీఐ డీజీఎం ఏపీ,  వికాస్‌ జైస్వాల్, పలువురు బ్యాంకర్లు హాజరయ్యారు.

చదవండి: Political Fact Check: వివేకా హత్య కేసులో పుకార్లేంటీ? నిజాలేంటీ?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement