మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: సీఎం జగన్‌ | YS Jagan Speech In State Level Bankers Committee Meeting In Amaravati | Sakshi
Sakshi News home page

మానవతా దృక్పథంతో వ్యవహరించాలి: సీఎం జగన్‌

Published Wed, Mar 18 2020 4:23 PM | Last Updated on Wed, Mar 18 2020 4:58 PM

YS Jagan Speech In State Level Bankers Committee Meeting In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: మహిళలకు వడ్డీ రేట్ల విషయంలో బ్యాంకర్లు మానవతా దృక్పథంతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌలు రైతులకు రుణాల మంజూరుకు బ్యాంకులు మరింత ముందుకురావాలని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని సీఎం జగన్ అన్నారు. సచివాలయంలో 210వ రాష్ట్రస్ధాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌.ఎల్‌.బీ.సీ)సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సమావేశం సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వైఎస్సార్‌ నవోదయం పధకం కింది ఎంఎస్‌ఎంఈలకు, ప్రధానమంత్రి ముద్ర యోజన కింద ఇచ్చే రుణాలు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకిచ్చే రుణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. స్వయం సహాయక సంఘాల రుణాలపై కూడా దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేటగిరీ ఒకటిలో ఉన్న ఆరు జిల్లాల్లో ఒకలా, మిగిలిన ఏడు జిల్లాలో ఇంకోలా వడ్డీరేట్లు ఉన్నాయని సీఎం జగన్‌ తెలిపారు. (పర్యావరణ పరిరక్షణకు చర్యలు)

బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీరేట్లు చాలా ఎక్కువగా ఉంటున్నాయని సీఎం జగన్‌ అన్నారు.12.5 శాతం, 13.5 శాతం ఇలా వసూలు చేసుకుంటూ పోతున్నారని, వడ్డీరేట్ల విషయలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. మరోవైపు ప్రభుత్వం తరఫున సున్నా వడ్డీకే రుణాలు ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బ్యాంకులు ఈ స్థాయిలో వడ్డీలు వేయడం ఆలోచించదగ్గ విషయన్నారు. వైయస్సార్‌ కడప జిల్లా మాదిరిగానే బ్యాంకుల డిజిటలైజేషన్‌ ప్రక్రియ అన్ని జిల్లాల్లోనూ అమలుచేయాలని వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గ్రామాల ఆర్థిక వ్యస్థలను బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని, గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలపై ఆధారపడే పరిస్థితులను తగ్గిస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. (వైఎస్సార్‌సీపీలోకి శమంతకమణి, యామినిబాల)

గ్రామ సచివాలయలు, విలేజ్‌ క్లినిక్‌లు, ఇంగ్లిషు మీడియంలో బోధించే పాఠశాల, రైతు భరోసా కేంద్రాలతో గ్రామాలలో విప్లవాత్మకంగా మార్పులు తీసుకు వస్తున్నాని సీఎం జగన్‌ అన్నారు. గ్రామ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు ఉన్నారని, ఆర్‌బీకే(రైతు భరోసా కేంద్రం)లో ఇంటర్నెట్‌ కియోస్క్‌ అందుబాటులో ఉంటుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ కియోస్క్‌ద్వారా తమకు కావాల్సిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఆర్డర్‌ చేస్తే నాణ్యతా నిర్దారణలతో అవి రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే ఈ-పంటలో విలేజ్‌ అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లతో వివరాలు నమోదు చేయిస్తున్నామని చెప్పారు. దీనికోసం వారందరికీ ట్యాబ్‌లు ఇస్తున్నామని, ఆ వివరాలను బ్యాంకులతో అనుసంధానం చేస్తామని సీఎం జగన్‌ తెలిపారు.డిమాండ్‌ సప్లయిలను పరిగణలోకి తీసుకుని ఏ పంటలు వేయాలన్నదానిపై రైతుకు ఆర్బేకేల ద్వారా సూచనలు చేస్తామన్నారు. 

ఈ- పంటలో నమోదైన వివరాల ఆధారంగా సాగుచేస్తున్న పంటలకు తగినట్టుగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నారు. అలాగే కౌలు రైతులు సాగుచేస్తున్న పంట వివరాలు అందుబాటులో ఉంటాయని,రెవెన్యూ అసిస్టెంట్లు ద్వారా కౌలు రైతు, యజమాని ఇద్దరూ అగ్రిమెంటు మీద సంతకం చేసి బ్యాంకు రుణం ఇస్తారని సీఎం జగన్‌ తెలిపారు.బ్యాంకులు వారికి ఉదారంగా రుణాలు ఇవ్వాలని, రైతులకు పండించిన పంటకు తగిన ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్‌ అన్నారు. ధర రాని పక్షంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెట్లో పోటీని పెంచేలా, రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటుందని సీఎం జగన్‌ వివరించారు. మే 15న ఆర్బీకే ద్వారా రైతు భరోసా ఇవ్వబోతున్నామని, మైక్రోఎంటర్‌ ప్రైజెస్‌ కోసం జూన్‌లో ఓ పథకాన్ని ప్రారంభించబోతున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. కృష్ణా, గోదావరి నదులు అనుసంధానం ద్వారా కరవు ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం మొదలుపెట్టిందని సీఎం జగన్‌ వివరించారు. (ఉనికి కోల్పోతామనే చంద్రబాబు కుట్రలు..)

రాయలసీమ కరువు నివారణా చర్యల్లో భాగంగా వరదజలాలను తీసుకెళ్లే కాల్వలను విస్తరిస్తున్నామని సీఎం జగన్‌ అన్నారు. ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం వరకు నీరు పోవాలని తెలిపారు. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎం జగన్‌ అన్నారు. వాటర్‌ గ్రిడ్‌ ద్వారా మంచినీటి సరఫరా అందించాలన్నారు. శ్రీకాకుళంలోని కిడ్నీ బాధితులు సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని ప్రజలకు వాటర్‌ గ్రిడ్‌ ద్వారా నీటిని అందించడానికి ముందడుగు వేస్తున్నామని సీఎం జగన్‌ తెలిపారు. ఈ కార్యక్రమాలన్నింటికీ  బ్యాంకర్ల సహకారం కావాలని సీఎం జగన్‌ అన్నారు. 

ఆంధ్రాబ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌ జె.పకీరసామి మాట్లాడుతూ.. 210వ ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో నిర్దేశించుకున్న రుణాలు, ప్రగతిని వివరించారు. 5వేల జనాభాకు పైబడిన 567 చోట్ల సీబీఎస్‌ బ్యాకింగ్‌ సర్వీసులు ప్రారంభించామని తెలిపారు. ఐదు కి.మీ పరిధిలో బ్యాంకింగ్‌ సదుపాయంలేని 229 గ్రామాలను మ్యాపింగ్‌ చేశామని చెప్పారు. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 29 మధ్య జరిగిన ప్రత్యేక కార్యక్రమం ద్వారా 1.1 లక్షల మంది రైతులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు ఇచ్చామని ఆయన అన్నారు.ఏడాదిలోగా వైఎస్సార్‌ కడప జిల్లాలో వందశాతం డిజిటల్‌ బ్యాంకింగ్‌ సదుపాయం ఏర్పాటు  చేశామని పేర్కొన్నారు.ప్రభుత్వం ప్రారంభిస్తున్న పది వేలకుపైగా రైతు భరోసా కేంద్రాల్లో బ్యాకింగ్‌ సదుపాయం తీసుకువచ్చేలా, బ్యాంకు మిత్రలను ఆయా కేంద్రాల్లో ఉంచడానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నామని జె.పకీరసామి అన్నారు.

వైఎస్సార్‌ నవోదయం పథకం ద్వారా సమస్యలు ఎదుక్కొంటున్న ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలవాలన్నారు. ప్రాథమిక రంగానికి నిర్దేశించుకున్న రుణ పంపిణీ లక్ష్యం రూ. 1,69,200 కోట్లకు గాను డిసెంబరు నాటికి రూ. 1,18,464 కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. అది 70.01 శాతంగా ఉందని ఆయన తెలిపారు. వ్యవసాయ రంగంలో నిర్దేశించుకున్న రూ.1,15,000 కోట్లకు గాను డిసెంబరు నాటికి రూ.83,444 కోట్లు (72.56శాతం) రుణాలుగా ఇచ్చామని చెప్పారు. కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంపై బ్యాంకర్లు దృష్టి సారించాలని ఆయన అన్నారు. 2019 వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించుకున్న లక్ష్యం రూ. 2,29,200 కోట్లు కాగా, డిసెంబరు వరకూ రూ. 1,73,625 కోట్లు (75.75శాతం) ఇచ్చామని జె.పకీరసామి తెలిపారు.ఎంఎస్‌ఎంఈలకు రూ.36,000 వేల కోట్లు ఇవ్వాలని లక్ష్యం కాగా డిసెంబరు వరకూ రూ. 29, 442 కోట్లు (81.78శాతం)ఇచ్చామన్నారు.స్సీ, ఎస్టీ మహిళలకు స్టాండప్‌ ఇండియా కింద ఆర్థిక సహాయం చేయాలని లక్ష్యం చేసుకోగా డిసెంబరు వరకూ  రూ. 4,857 మందికి సహాయం చేశామని ఆయన వెల్లడించారు.

ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్‌ రెడ్డి,  వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఎస్‌.ఎస్‌.రావత్, ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఫైనాన్స్, కే వి నాంచారయ్య, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ, సీజీఎం(ఆంధ్రా బ్యాంకు), ఆర్బీఐ జనరల్‌ మేనేజర్‌ సుందరం శంకర్, నాబార్డ్‌ సీజీఎం ఎస్‌.సెల్వరాజ్‌ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement