ఆ ప్రక్రియలో బ్యాంకులు ప్రభుత్వానికి తోడుగా నిలవాలి: సీఎం జగన్‌ | CM Jagan Conduct Meeting On State Level Bankers Committee Members At Tadepalli | Sakshi
Sakshi News home page

ఆ ప్రక్రియలో బ్యాంకులు ప్రభుత్వానికి తోడుగా నిలవాలి: సీఎం జగన్‌

Published Tue, Dec 7 2021 12:17 PM | Last Updated on Wed, Dec 8 2021 7:45 AM

CM Jagan Conduct Meeting On State Level Bankers Committee Members At Tadepalli - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం 217వ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ  (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్‌ తదనంతర పరిస్థితుల్లో జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశాల్లో ఇది ప్రత్యేకమైందన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ బ్యాంక్‌ సీఈఓతో పాటు, భారత రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులు కూడా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. రాష్ట్ర అవసరాలు ఏమిటి? రాష్ట్రానికి సంబంధించి ఏమేం చేస్తే బాగుంటుందన్న అంశాలపై మీరు అందరూ చొరవ చూపి చర్చించడంతో పాటు, కొన్నింటిపై మాకు తగిన సూచనలు కూడా ఇస్తున్నారని సీఎం జగన్‌ అన్నారు.

చదవండి: సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి సీఎం జగన్‌ విరాళం

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..:
ఇప్పుడు చాలా కీలక పరిస్థితుల్లో ఈ సమావేశం జరుగుతోంది. కోవిడ్‌ వ్యాప్తి తర్వాత దేశవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోంది. ఆర్థిక కార్యకలాపాలు కొంచెం పుంజుకుంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికానికి సంబంధించి స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 8.4 శాతంగా నమోదైంది.

అదే సమయంలో ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి ఆరునెలల సమయంలో చూస్తే అది 13.7 శాతంగా నమోదైంది. కరోనా థర్డ్‌వేవ్, ఒమిక్రాన్‌ వేరియెంట్‌పై జరుగుతున్న ప్రచారం వల్ల ఆర్థికస్థితి కాస్త మందగించింది. లేకపోతే ఆర్థిక పరిస్థితి చాలా వేగంగా పుంజుకునేది. ఏదేమైనప్పటికీ కరోనా థర్డ్‌వేవ్‌ దేశ ఆర్థిక రంగంపై చాలా తక్కువ ప్రభావం చూపాలని మేము ఆశిస్తున్నాం.

ప్రస్తుత పరిస్థితుల్లో రుణ పరిమితి పెంపునకు సంబంధించి గట్టిగా కోరలేము. జాతీయస్థాయిలో ఈ ఏడాది నవంబరు 5వ తేదీ నాటికి జాతీయ బ్యాంకుల రుణాలు రూ.1.12 కోట్ల లక్షల కోట్లకు చేరుకోగా, అవి ఏటా 7.1 శాతం వృద్ధిని సూచిస్తున్నాయి. కాగా, సుస్థిర ఆర్థిక పురోగతిని సాధించేలా, కొనసాగించేలా బ్యాంకులు తగిన వ్యూహరచనతో ముందుకు పోవాల్సి ఉంది.

కోవిడ్‌ వల్ల ఉత్పన్నమైన పరిస్థితులు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం పూర్తిగా పడిపోవడం, మరోవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం కోసం అధికంగా ఖర్చు చేయాల్సి రావడం వల్ల, ప్రభుత్వంపై భారం మరింత పెరిగింది.

కోవిడ్‌ వల్ల ప్రభుత్వ ఆదాయం 2019–20లో రూ.8 వేల కోట్లు, 2020–21లో రూ.14 వేల కోట్లు తగ్గడం, మరోవైపు కోవిడ్‌ నివారణ, నియంత్రణ కోసం అదనంగా రూ.8 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వంపై దాదాపు రూ.30 వేల కోట్ల భారం పడింది.

అలాంటి పరిస్థితుల్లో బ్యాంకింగ్‌ రంగం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని గట్టెక్కించగలిగింది. కోవిడ్‌ సమయంలో కూడా పథకాలను అమలు చేసి సామాన్య ప్రజలను, నిరుపేదలను ఆదుకోగలిగింది. ఒకవేళ ఆ సహకారమే లేకపోతే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం చాలా కష్టమయ్యేది. కోవిడ్‌ సమయంలో నిరుపేదలను ఆదుకోవడంలో సహకరించినందుకు బ్యాంకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బ్యాంకుల సహకారం వల్లనే గ్రామీణ ఆర్థిక పరిస్థితి కూడా గాడిలో పడింది.

బ్యాంకులు తమ మొత్తం నికర రుణంలో ప్రాధాన్యతా రంగాలకు నిర్దేశించిన దానికి మించి 59.5 శాతం రుణాలు ఇవ్వడం, మరోవైపు రుణాలు–డిపాజిట్ల నిష్పత్తి 136 శాతం ఉండేలా బ్యాంకులు చూపిన చొరవ.. అదే విధంగా కోవిడ్‌ కష్టకాలంలో రాష్ట్రాన్ని ఆదుకున్నందుకు బ్యాంకింగ్‌ రంగాన్ని అభినందిస్తున్నాను.

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆరు నెలల కాలంలోనే బ్యాంకులు చెప్పుకోదగిన స్థాయిలో రుణాలు మంజూరు చేశాయి. బ్యాంకుల వార్షిక రుణ ప్రణాళిక రూ.2,83,380 కోట్లు కాగా, అందులో మొదటి ఆరు నెలల్లోనే 60.53 శాతం, అంటే ఏకంగా రూ.1,71,520 కోట్ల రుణాలు బ్యాంకులు పంపిణీ చేశాయి. అదే విధంగా ప్రాధాన్యతా రంగాలకు వార్షిక రుణ లక్ష్యం రూ.2,13,560 కోట్లు కాగా, అందులో ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే 47.29 శాతం, అంటే రూ.1,00,990 కోట్లను బ్యాంకులు ప్రాధాన్యతా రంగ రుణాలుగా పంపిణీ చేశాయి. 

ఈ సందర్భంగా కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక పంట రుణాలలో బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళికలో తొలి ఆరు నెలల్లోనే 51.57 శాతం రుణాలు పంపిణీ చేశాయి. ఇది ప్రోత్సాహకరమైన రీతిలో ఉంది. కాగా, వ్యవసాయ దీర్ఘకాలిక (టర్మ్‌)) రుణాల్లో వ్యవసాయ మౌలిక వసతులకు సంబం«ధించి వార్షిక రుణ ప్రణాళికలో ఈ ఆరు నెలల్లో 35.33 శాతం, వ్యవసాయ అనుబంధ రంగాల రుణ ప్రణాళికలో 37.31 శాతం మాత్రమే రుణాల్వివడం నిరాశజనకంగా ఉంది. ఈ రెండింటిలో రుణాల మంజూరు పెంచడంపై బ్యాంకులు దృష్టి పెట్టాల్సి ఉంది.

ఇంకా వ్యవసాయ యాంత్రీకరణలో 9.08 శాతం, పాడి రంగానికి 24.29 శాతం, మొక్కలు నాటడం, చెట్టు పెంచడానికి 4.52 శాతం, ఇక ఉద్యాన పంటల సాగు, చేపల పెంపకానికి 14.84 శాతం రుణాలు మాత్రమే వార్షిక రుణ ప్రణాళికలో, తొలి ఆరు నెలల కాలంలో పంపిణీ చేయడం జరిగింది. అంటే ఆయా రంగాలకు నిర్దేశించుకున్న వార్షిక రుణ మొత్తంలో తొలి ఆరు నెలల్లో కేవలం 47.50 శాతం మాత్రమే పంపిణీ చేయడం జరిగింది.

అదే విధంగా బ్యాంకులు నిర్దేశించుకున్న నికర రుణ మొత్తంలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు గత ఏడాది (42.50 శాతం) కంటే ఈ ఏడాది (38.48 శాతం) తగ్గాయి. కాబట్టి రెండో దశ కోవిడ్‌ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని కీలక సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారం దిశగా బ్యాంకులు దృష్టి పెట్టాల్సి ఉంది. అదే విధంగా ఇంకా ఎందరో అర్హులైన రైతులకు ఇంకా ‘కిస్సాన్‌ క్రెడిట్‌ కార్డు’ (కేసీసీ)లు అందాల్సి ఉంది. అందువల్ల గ్రామాల్లో రైతులకు అడుగుడుగునా అండగా ఉంటున్న ఆర్బీకేల స్థాయిలో బ్యాంకులు వెంటనే ఆ కార్డుల జారీ చేపట్టి, అర్హులైన ప్రతి రైతుకు కేసీసీ అందేలా చూడాలి.

అదే విధంగా కౌలు రైతులకు కూడా రుణాలు అందాలి. ఈ–క్రాప్‌ ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టినట్లు అయితే, రుణాల జాబితాల నుంచి అనర్హులు తొలగిపోతారు. కౌలు రైతులకు కూడా ప్రయోజనం కలుగుతుంది. కాగా, రాష్ట్రంలో ఇంకా దాదాపు 4,240 ఆర్బీకేలలో బ్యాంకింగ్‌ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది ఆ మేరకు కరెస్పాండెంట్లను నియమించాల్సి ఉంది. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలి.

ఇంకా ‘పేదలందరికీ ఇళ్లు’. ప్రభుత్వ మరో ప్రాధాన్య కార్యక్రమం ఇది. ఇందులో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. దీన్ని చూసి సంతృప్తి చెందిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) ద్వారా తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి ముందుకు వచ్చింది. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోంది. దీని వల్ల ఆర్థికంగా కూడా ఎన్నో రంగాలకు మేలు కలుగుతోంది. సిమెంటు, స్టీల్‌ వినియోగం పెరుగుతోంది. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లభిస్తోంది. కొందరు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటుండడంతో వారికీ పని దొరుకుతోంది. ఆ విధంగా గ్రామాలు, పట్టణాల్లో ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటున్నాయి. 

నిరుపేదలకు ఇళ్ల కోసం ఇప్పటికే భూమి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ స్థలాలు కూడా పంపిణీ చేసింది. మరోవైపు కేంద్రం పీఎంఏవైలో ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షలు ఇస్తోంది. మరో రూ.35 వేల చొప్పున లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందాల్సి ఉంది. ఆ ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పక్కాగా మహిళల పేరుతో రిజిస్టర్‌ చేసి ఇచ్చింది కాబట్టి, అవసరమైతే వాటిని తనఖా పెట్టుకుని అయినా బ్యాంకులు ఆ రుణాలు పంపిణీ చేయాలి.

బ్యాంకులు ఇచ్చే ఆ రూ.35 వేల రుణాలపై లబ్ధిదారుల నుంచి కేవలం 3 శాతం వడ్డీ మాత్రమే వసూలు చేయాలి. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ విషయంలో బ్యాంకులు తగిన చొరవ చూపితే ఆ మహిళలు, నిరుపేద కుటుంబాలకు మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేయూతనిచ్చినట్లుగా ఉంటుంది. ఇంకా 2,62,216 టిడ్కో ఇళ్ల (ఫ్లాట్లు)కు సంబంధించి బ్యాంకులు కాస్త చొరవ చూపి రుణాలు మంజూరు చేస్తే, సమస్య పరిష్కారం అవుతుంది. ఇది కూడా పేదలకు ఎంతో మేలు చేస్తుంది.

ఎంఎస్‌ఎంఈ రంగం. ఇది గడచిన 5 దశాబ్ధాలుగా దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర పోషిస్తోంది. దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 8 శాతం, ఉత్పాదక రంగంలో 45 శాతం, ఎగుమతుల్లో 40 శాతం ఎంఎస్‌ఎంఈ రంగానిదే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, పలు చర్యలు చేపట్టింది. 2019లో తొలి చర్యగా ఎంఎస్‌ఎంఈల రుణాలను పునర్‌వ్యవస్థీకరిస్తూ ‘వన్‌ టైమ్‌ రీస్ట్రక్చరింగ్‌’ (ఓటీఆర్‌)ను ప్రకటించింది. ఆ మేరకు బ్యాంకులతో మాట్లాడిన ప్రభుత్వం, తమ వంతుగా అవకాశం ఉన్న ప్రతి చోటా ఎంఎస్‌ఎంఈలకు తోడుగా నిలబడింది. అయితే ఈ ప్రక్రియలో ఆశించిన స్థాయిలో ప్రయోజనాలు కనబడలేదు. ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి దాదాపు 8.3 లక్షల రుణ ఖాతాలుంటే, వాటిలో కేవలం 1.78 లక్షల ఖాతాలు.. అంటే 22 శాతం ఖాతాలు మాత్రమే పునర్‌వ్యవస్థీకరించబడ్డాయి.

అందువల్ల బ్యాంకులు కూడా ఈ విషయంలో చొరవ చూపి, వీలైనన్ని రుణఖాతాలు ఓటీఆర్‌ వినియోగిచుకునేలా చూడాలి. ఎందుకంటే దేశ ఆర్థిక రంగంలో ఎంఎస్‌ఎంఈలది కీలకపాత్ర. ప్రతి ఒక్క సంస్థ కనీసం 10 మందికి ఉపాధి ఇస్తుంది. మనం ఇక్కడ 8.3 లక్షల ఖాతాల గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, దాదాపు 10 లక్షల ఉద్యోగాలు అన్న మాట. ఇక ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన (గత ప్రభుత్వం బకాయి పెట్టినవి కూడా) నాలుగైదు ఏళ్ల రాయితీలను చెల్లించాం. కోవిడ్‌ సమయంలో కూడా ఎంఎస్‌ఎంఈలకు అండగా నిలుస్తూ, ఈ ఏడాది రాయితీలు ఇవ్వడం జరిగింది. అందువల్ల బ్యాంకులు కూడా ఎంఎస్‌ఎంఈల విషయంలో సానుకూలంగా ఆలోచనే చేయాలి.

వీధుల్లో చిరు వ్యాపారులు, చేతివృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారికి పెట్టుబడి. జగనన్న తోడు పథకం ద్వారా వారికి బ్యాంకుల ద్వారా రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇప్సిస్తోంది. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించిన వారికి సంబంధించిన రుణాల వడ్డీని ప్రభుత్వమే పూర్తిగా కడుతుంది. ఈ పథకంలో బ్యాంకులు ఇప్పటి వరకు రెండు విడతల్లో 7.57 లక్షల మందికి రుణాలు ఇచ్చాయి. స్త్రీ నిధి ద్వారా కూడా వారికి రుణాలు ఇస్తున్నాం. ఈ పథకంలో వచ్చే దరఖాస్తులను బ్యాంకులు వీలైనంత త్వరగా పరిష్కరించి, రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నాను. ఈ పథకంలో మొత్తం 9.01 లక్షల లబ్ధిదారులు ఉన్నారు.

ఇక రాష్ట్రంలో 2.70 లక్షల వలంటీర్లు ఉన్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించడం జరిగింది. 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో  1.30 లక్షల వలంటీర్లు స్థానికంగా అందుబాటులో ఉంటారు. వారంతా మీకు సహాయ, సహకారాలు అందిస్తారు. నిరర్థక ఆస్తులను (ఎన్‌పీఏ) తగ్గించడంలో తోడుగా నిలుస్తారు. ఇంకా విద్య, వైద్య రంగాలలో కూడా చాలా మార్పులు చేస్తున్నాం. వైద్య ఆరోగ్య రంగంలో సమూల మార్పులు చేస్తూ, జాతీయ స్థాయి ప్రమాణాలు సాధించే దిశగా చర్యలు చేపట్టాం.

రాష్ట్రంలో 11 టీచింగ్‌ ఆస్పత్రులు మాత్రమే ఉండగా, కొత్తగా 16 టీచింగ్‌ ఆస్పత్రులు, మరో 16 నర్సింగ్‌ కాలేజీలు కడుతున్నాం. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ ఆస్పత్రి, నర్సింగ్‌ కాలేజీ ఉంటుంది. వాటిలో తగిన సంఖ్యలో వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది ఉంటారు. ఇందు కోసం మొత్తం రూ.12,243 కోట్లు అవసరం కాగా, కొంత రుణం ఇవ్వడానికి నాబార్డు ముందుకు వచ్చింది. ఇంకా దాదాపు రూ.9 వేల కోట్ల నిధులు కావాలి.

ప్రాథమిక ఆరోగ్య రంగంలో కూడా సమూల మార్పులు చేస్తున్నాం. ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొస్తున్నాం. 108, 104 సర్వీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలంలో రెండు పీహెచ్‌సీలు ఉంటాయి. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు చొప్పున వైద్యులు ఉంటారు. ప్రతి గ్రామంలో విలేజ్‌ క్లినిక్‌ ఉంటుంది. పీహెచ్‌సీల వైద్యులు ఒక్కో రోజు ఒక్కో గ్రామం సందర్శించి సేవలందిస్తారు. ఆ విధంగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ వస్తోంది.

ఆరోగ్యశ్రీ పథకంలో 2432 వైద్య, చికిత్స ప్రక్రియలు చేర్చడం జరిగింది. ఇప్పుడు ఈ పథకంలో చికిత్స పొందుతున్న వారు ఇక నుంచి పీహెచ్‌సీలలో కూడా వైద్యం పొందేలా చర్యలు. విద్యా రంగంలోనూ మార్పులు. నాడు–నేడు ద్వారా 10 రకాల సదుపాయాలు. ఫర్నీచర్, గ్రీన్‌ బోర్డులు, క్లీన్‌ డ్రింకింగ్‌ వాటర్, టాయిలెట్‌ విత్‌ రన్నింగ్‌ వాటర్, పెయింటింగ్, ప్రహరీ, కిచెన్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ వంటి సదుపాయాల కల్పన. ఇంకా ఇంగ్లిష్‌ మీడియమ్‌. సీబీఎస్సీ సిలబస్‌. 15,715 స్కూళ్లను తొలి దశలో రూ.3,500 కోట్లతో సమూలంగా మారుస్తున్నాం. మొత్తం మూడు దశల్లో అన్ని స్కూళ్ల (దాదాపు 57 వేలు)ను సమూలంగా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో కూడా బ్యాంకులు తమ వంతు సహకారాన్ని అందించాలి. నిజానికి ఇది మానవ వనరుల్లో పెట్టుబడి అని చెప్చొచ్చు.

మహిళా సాధికారత కోసం ఆసరా, చేయూత పథకాలు. మా ప్రభుత్వం వచ్చే నాటికి స్వయం సహాయం బృందాలలో 18.36 శాతం ఎన్‌పీఏలు ఉండేవి. దీంతో ఆ రంగం నిర్వీర్యమై పోయింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు, స్వయం సహాయక బృందాలకు వివిధ పథకాల ద్వారా తోడుగా నిలబడడంలో వారి రుణాలు, ఎన్‌పీఏ 1 శాతం కంటే తక్కువ (0.73శాతం)గా ఉంది.

మహిళలకు నాలుగేళ్ల పాటు, ఆర్థిక సహాయం చేస్తున్నాం. వారికి ఉపాధి లభించేలా సొంత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందుకోసం మల్టీ నేషనల్‌ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఈ చర్యల వల్ల ఇవాళ రాష్ట్రంలో 3.50 లక్షలకు పైగా మహిళలు వ్యాపారాల (కిరాణం దుకాణాలు) ద్వారా నెలకు రూ.7,500 నుంచి రూ.14 వేల వరకు ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధితో పాటు, రాష్ట్రం అన్ని రంగాలలో పురోగమించేలా పలు చర్యలు చేపడుతోంది. ఈ ప్రక్రియలో బ్యాంకులు కూడా ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరుకుంటున్నానని సీఎం అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement