వ్యవసాయానికి పెద్దపీట | State Level Bankers Committee Released Annual Credit Plan For 2019 To 20 For Telangana | Sakshi
Sakshi News home page

వ్యవసాయానికి పెద్దపీట

Published Fri, May 31 2019 2:04 AM | Last Updated on Tue, Jun 4 2019 6:36 PM

State Level Bankers Committee Released Annual Credit Plan For 2019 To 20 For Telangana - Sakshi

గురువారం హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జె.స్వామినాథన్‌. చిత్రంలో రాహుల్‌ బొజ్జ, పార్థసారథి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) గురువారం విడుదల చేసింది. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక మొత్తంతో పోలిస్తే రుణ వితరణ లక్ష్యంలో 6.95 శాతం వృద్ధి కనిపించింది. ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు జె.స్వామినాథన్‌ అధ్యక్షతన గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ 2018–19 వార్షిక రుణ ప్రణాళిక తీరుతెన్నులను సమీక్షించడంతో పాటు, 2019–20లో లక్ష్యాల సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరై ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించడంతో పాటు, లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు సహకరించాల్సిందిగా కోరారు. 

2019–20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.1.46 లక్షల కోట్లతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళికను ఎస్‌ఎల్‌బీసీ గురువారం విడుదల చేసింది. 2018–19 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.1.36 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం 6.95 శాతం మేర కేటాయింపులు పెంచారు. రూ.1.01 లక్షల కోట్లతో.. అనగా మొత్తం కేటాయింపుల్లో 69 శాతం ప్రాధాన్యత రంగాలకే కేటాయించారు. ఈ రంగాల్లోనూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎస్‌ఎల్‌బీసీ ప్రకటించింది. గత ఏడాది రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి రూ.58.06 వేల కోట్లు కేటాయించగా, ప్రస్తుతం 68.59 వేల కోట్లు వితరణ చేయాలని నిర్ణయించారు. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయానిది 68 శాతం వాటా కాగా, గత ఏడాదితో పోలిస్తే 18.14 శాతం మేర అదనంగా రుణ వితరణ జరగనుంది. వ్యవసాయానికి కేటాయించిన రూ.68 వేల కోట్లలో పెట్టుబడి రుణంగా రూ.19,856 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం రూ.15,569 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. ప్రాధాన్యత రంగం కేటాయింపుల్లో వ్యవసాయం తర్వాత సూక్ష్మ, లఘు పరిశ్రమల రంగాని(ఎంఎస్‌ఎంఈ)కి ప్రాధాన్యత ఇస్తూ, రూ.21,420 కోట్లు రుణ వితరణ లక్ష్యంగా నిర్దేశించారు. గత ఏడాది ఈ మొత్తం 21,381 కోట్లు కాగా, ప్రస్తుతం రూ.29 కోట్ల మేర పెంచుతూ లక్ష్యం ఖరారు చేశారు. 

స్వల్పకాలిక రుణాల్లో వెనుకంజ... 
2018–19 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకర్లు స్వల్పకాలిక వ్యవసాయ రుణ వితరణ లక్ష్యంలో 79.43 శాతం అనగా రూ.33,752 కోట్లు మాత్రమే రుణ వితరణ చేశారు. అయితే పెట్టుబడి రుణాల విషయంలో మాత్రం రూ.15,568 కోట్ల లక్ష్యానికి మించి రూ.17,600 కోట్లు మంజూరు చేశారు. రూ.534 కోట్లు విద్యకు, రూ.5,849 కోట్లు గృహ రుణాల రూపంలో ఇచ్చారు. సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల రుణ వితరణలో బ్యాంకర్లు ఏకంగా లక్ష్యానికి మించి రూ. 36,639 కోట్ల మేర అనగా.. 171 శాతం రుణాలిచ్చారు. 1.46 లక్షల మంది మైనారిటీలకు రూ.2,257 కోట్లు, బలహీన వర్గాలకు రూ.15,367 కోట్లు, ఎస్సీ, ఎస్టీలకు రూ.3,930 కోట్లు రుణం ఇచ్చారు. 2018–19లో ప్రధాన మంత్రి ముద్ర యోజన (పీఎంఎంవై) కింద రూ.6,242 కోట్లు లక్ష్యం కాగా, రూ,7,777 కోట్లు రుణ వితరణ జరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యత రంగంలో రూ.95,736 కోట్ల మేర రుణాలిచ్చి 103.22 శాతం లక్ష్యం సాధించారు.  

విస్తరిస్తున్న బ్యాంకు సేవలు... 
బ్యాంకు సేవల విస్తరణలో భాగంగా 5 వేల పైబడిన జనాభా ఉన్న 245 గ్రామాల్లో 2018–19లో బ్యాంకులు కొత్త శాఖలు ఏర్పాటు చేశాయి. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద 81.76 లక్షల ఖాతాలను ఆధార్‌తో అనుసంధానించారు. వీటిలో 74.99 లక్షల మందికి రూపే కార్డులు మంజూరు చేశారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 59.46 లక్షల మందికి ప్రయోజనం కలగగా, 20 లక్షల మంది ఖాతాదారులను ప్రధాన్‌ మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన కిందకు తెచ్చారు. ప్రజల్లో బ్యాంకు లావాదేవీలపై అవగాహన కల్పించేందుకు జూన్‌ 3 నుంచి 7 తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు 
సాక్షి, హైదరాబాద్‌ : వ్యవసాయ సంక్షోభం నుంచి రైతులను గట్టెక్కించేందుకు సాగు రుణాల మంజూరులో బ్యాంకర్లు ఉదారంగా వ్యవహరించాలని రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు అన్నారు. రైతు రుణమాఫీలో గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ప్రస్తుతం స్పష్టమైన మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో గురువారం జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సులో 2019–20 వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేశారు. కాళేశ్వరం జలాలతో పెరిగే సాగు విస్తీర్ణానికి అనుగుణంగా మార్కెటింగ్, ఇతర వ్యవసాయ మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వృద్ధిరేటు 15.5 శాతంగా ఉందని, ప్రాధాన్యత రంగంతో పాటు, ఇతర రంగాల్లో రుణ వితరణ లక్ష్యం 40 శాతానికి పైగా ఉండటం శుభసూచకమన్నారు. 

అనుబంధ రంగాలకు రుణాలు.. 
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో వ్యవసాయంతో పాటు, దాని అనుబంధ రంగాలకు రుణ వితరణ పెంచాలని వ్యవసాయ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి బ్యాంకర్లను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఉద్యాన, పట్టు పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్‌ ఉందని, వ్యవసాయ అనుబంధ రంగాలకు రుణ వితరణ పెంచడం ద్వారా రుణ వితరణ సులభతరమవుతుందన్నారు. గ్రామీణుల ముంగిటకు బ్యాంకింగ్‌ సేవలు తీసుకెళ్లాలన్నారు. ప్రాధాన్యత రంగాలకు రుణ మంజూరులో అగ్రస్థానం ఇస్తూనే, ఇతర రంగాల్లో రుణ వితరణ లక్ష్యం చేరుకోవాలని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా రీజినల్‌ డైరెక్టర్‌ సుభ్రతాదాస్‌ అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ రాష్ట్ర అధ్యక్షుడు జె.స్వామినాథన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2018–19 ఆర్థిక సంవత్సరంలో రుణాల మంజూరు తీరుపై ఎస్‌ఎల్‌బీసీ సమీక్షించింది. ధరణి పోర్టల్‌ అందుబాటులో లేకపోవడంతో పంట రుణాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను బ్యాంకర్లు ప్రస్తావించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, నాబా ర్డు సీజీఎం విజయకుమార్, ఆర్‌బీఐ జీఎం సుందరం శంకర్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ యూ ఎన్‌ఎన్‌ మయ్యా పాల్గొన్నారు. ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు స్వామినాథన్‌ పదోన్నతిపై వెళ్తున్న నేపథ్యంలో నూతన చైర్మన్‌గా ఓబుల్‌రెడ్డి నియామకాన్ని సమావేశం ఆమోదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement