రుణమాఫీ కానివారిపై రాష్ర్ట ప్రభుత్వానికి స్పష్టం చేసిన బ్యాంకర్లు
హైదరాబాద్: తొలి దశలో రుణ మాఫీ కాని రైతులకు ఎందుకు మాఫీ కాలేదో ప్రభుత్వ యంత్రాంగమే చెప్పాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రైతు సాధికార సదస్సుల సమయంలోనూ, ఆ తర్వాత... బ్యాంకుల ఉద్యోగులను, సిబ్బందిని లక్ష్యంగా ఎంచుకుని రుణ మాఫీ కాని రైతులు, ప్రజాప్రతినిధులు నిలదీశారని తెలిపింది. అంతేకాకుండా చాలావరకు బ్యాంకు బ్రాంచీల దగ్గర నిరసన ప్రదర్శనలు, ధర్నాలు నిర్వహించారని వివరించింది. ఈ పరిణామాలతో బ్యాంకుల క్షేత్రస్థాయి సిబ్బందిలో నైతిక స్థైర్యం తీవ్రంగా దెబ్బతిందని బ్యాంకర్ల కమిటీ పేర్కొంది. గత నెలాఖరున ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన 188వ బ్యాంకర్ల కమిటీ సమావేశం మినిట్స్‌లో ఆయా అంశాలను స్పష్టం చేశారు. రుణ మాఫీ లబ్ది చేకూర్చడంలో బ్యాంకుల పాత్ర, జవాబుదారీతనం విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎస్‌ఎల్‌బీసీ కోరింది. ఈ విషయంలో ఒక ఆలోచన చేసి జిల్లా అధికార యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని తెలిపింది. రుణ మాఫీ కాని రైతుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగానికి అప్ప చెప్పాలని, రైతులకు వ్యవసాయ శాఖ చేత నచ్చచెప్పించాలని సూచించింది.
ఏ మాత్రం జాప్యం లేకుండా రుణాలు రెన్యువల్ చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని పేర్కొంది. రుణాలు రెన్యువల్ చేసుకోకపోతే పంటల బీమాతో పాటు వడ్డీ రాయితీ రాదనే విషయాన్ని అధికారులతో చెప్పించాలంది. అలాగే ప్రస్తుతం ప్రభుత్వం 20 శాతం రుణాలనే మాఫీ చేస్తున్నందున మిగతా రుణ మొత్తాన్ని రైతులు తమ సొంత నిధులతో చెల్లించేలా చర్యలు తీసుకోవాలని, లేకపోతే రుణాలు రెన్యువల్ కావని స్పష్టం చేసింది. మిగిలిన రుణాలను రైతులు చెల్లించి రెన్యువల్ చేయించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం విస్త్రృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని, లేదంటే వ్యవసాయ రంగం రుణ పరపతి దెబ్బతింటుందని ఆంధ్రాబ్యాంకు చైర్మన్, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు సి.వి.ఆర్. రాజేంద్రన్ స్పష్టం చేశారు.
27న ఎస్‌ఎల్‌బీసీ భేటీ
ప్రస్తుత రబీ సీజన్ కూడా ముగుస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్ నుంచి ఇప్పటివరకు వ్యవసాయ తదితర రంగాల రుణ పరపతి పురోగతిపై సమీక్షించేందుకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కావడం లేదు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు హాజరు కానున్నారు. వ్యవసాయ రంగానికి ఇచ్చిన రుణాలు, రుణ మాఫీ సంబంధిత అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.
మీరే నచ్చచెప్పుకోండి
Published Wed, Mar 25 2015 1:51 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement
Advertisement