చంద్రబాబు పా‘పాలు’ | AP Dailry in Crisis With Chandrababu Naidu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పా‘పాలు’

Published Mon, Dec 16 2019 10:21 AM | Last Updated on Mon, Dec 16 2019 10:21 AM

AP Dailry in Crisis With Chandrababu Naidu Government - Sakshi

ప్రభుత్వ డెయిరీ పతనావస్థకు చేరుకుంది. వైఎస్సార్‌ హయాంలో ఓ వెలుగు వెలిగిన డెయిరీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. గత టీడీపీ ప్రభుత్వం హెరిటేజ్‌ లాంటి ప్రైవేటు డెయిరీని ప్రోత్సహిస్తూ ఏపీ డెయిరీని నిర్లక్ష్యం చేసింది. అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించగా డెయిరీ ఉనికి కోల్పోయింది. చెల్లింపుల్లో జాప్యంతో రైతులు కూడా ‘ప్రైవేటు’ను ఆశ్రయించగా పాల సేకరణ 2,500 లీటర్లకు పడిపోయింది. ఫలితంగా ఆదాయం కంటే వ్యయం అధికం కాగా నెలకు రూ.10 లక్షల మేర ఏపీ డెయిరీ నష్టాలు మూటగట్టుకుంటోంది.

అనంతపురం అగ్రికల్చర్‌: టీడీపీ పాలనలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాలన్నీ నిర్వీర్యమయ్యాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగ అనేలా వ్యవహరించగా రైతులంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక కరువుకు నిలయమైన ‘అనంత’లో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా రైతులంతా పాడిపై ఆధారపడగా.. ప్రోత్సహించాల్సిన గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. పైగా ప్రైవేటు డెయిరీలకు మేలు జరిగేలా వ్యవహరించగా ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి  సహకార సమాఖ్య(ఏపీ డెయిరీ) ఖాయిలా పరిశ్రమగా మారిపోయింది. చంద్రబాబు ప్రభుత్వానికి తోడుగా డెయిరీలో పనిచేస్తున్న అధికారులు సైతం అడుగడుగునా అలసత్వం వహించడంతో పాడి రైతులకు శాపంగా మారిపోయింది. దీంతో పాడిని నమ్ముకున్న రైతులు, ప్రజలు ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపడంతో లాభాలబాటలో పయనిస్తున్నాయి. ప్రభుత్వ డెయిరీ మాత్రం నెలకు రూ.10 లక్షల వరకునష్టాలను మూటగట్టుకుంటోంది. 

లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్నా..
ప్రభుత్వ డెయిరీ ఆధ్వర్యంలో అనంతపురం, హిందూపురంలోæ 50 వేల లీటర్లు చొప్పున లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన పాలశీతలీకరణ కేంద్రాలున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో( 2006–12 మధ్యకాలంలో) జిల్లా వ్యాప్తంగా 42 బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు(బీఎంసీ) నడిచేవి. వాటి పరిధిలో 74 పాలరూట్లు, 540 వరకు పాల సేకరణ సెంటర్లు పనిచేస్తూ రోజుకు ఎంతలేదన్నా 70 వేల లీటర్లు పాల సేకరణ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. దాదాపు 25 వేల మంది వరకు రైతులు ఏపీ డెయిరీకి రోజువారీ పాలు పోసేవారు. అప్పట్లో పశుక్రాంతి కింద 50 శాతం రాయితీతో హర్యానా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి మేలురకం సంకరజాతి పశువులు, నాణ్యమైన ముర్రా గేదెలు పంపిణీ చేయడంతో జిల్లా అంతటా పాలవెల్లువ కనిపించింది.

డెయిరీ అధికారుల నిర్లక్ష్యం
గత టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తోడు డెయిరీ అధికారులు కూడా తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. దొరికింది ‘దోచుకో.. దాచుకో’ అనే రీతిలో కొందరు అధికారులు, సిబ్బంది వ్యవహరించారు. పైగా 2015 తర్వాత ఏపీ డెయిరీకి రెగ్యులర్‌ డీడీని కూడా నియమించలేదు. 2015లో డీడీగా ఉన్న నాగేశ్వరరావు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకోగా.. ఆ తర్వాత వై.శ్రీనివాసులు ఇన్‌చార్జి డీడీగా పనిచేశారు. ఆయన కూడా 2017లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత ఎం.శ్రీనివాసులు అనే అధికారి ఇన్‌చార్జి డీడీగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన హయాంలో డెయిరీ పరిస్థితి మరింత దిగజారింది. ఆయనపై లైంగిక వేధింపులు, అవినీతి ఆరోపణలు రావడంతో 2019 నవంబర్‌ 15న అధికారులు సస్పెండ్‌ చేశారు. ఆయన స్థానంలో వైఎస్సార్‌ కడప, చిత్తూరు డీడీగా పనిచేస్తున్న జీకే శ్రీనివాసులు అనే మరో డీడీని ఇక్కడ ఇన్‌చార్జిగా నియమించారు. నెలలో రెండు రోజులు కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితి లేకపోవడంతో డెయిరీ పరిస్థితి మరింత ఇబ్బందిగా మారింది. 

నాలుగు నెలల బిల్లులు పెండింగ్‌
ఏపీ డెయిరీకి పాలు పోస్తున్న రైతులకు నాలుగు నెలలుగా చెల్లింపులు లేవ. దాదాపు రూ.70 లక్షల వరకు బకాయిలు ఉన్నాయి. రెగ్యులర్‌ డీడీ లేకపోవడంతో ఉద్యోగులకు వేతనాలు కూడా సక్రమంగా అందడం లేదని తెలుస్తోంది. అలాగే పుట్టపర్తి సత్యసాయి సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, ఐసీడీఎస్, కేజీబీవీ పాఠశాలలు, ఎస్కేయూ, జేఎన్‌టీయూ హాస్టల్స్‌కు ఏపీ డెయిరీనే పాలు సరఫరా చేయాల్సి ఉన్నా... అధికారుల అలసత్వం కారణంగా సాధ్యం కావడం లేదని ఆ శాఖ వర్గాలే చెబుతున్నాయి. రోజూ 7,500 లీటర్లు పాలు అమ్ముకునేందుకు అవకాశం ఉన్నా... అధికారుల నిర్లక్ష్యంతో రోజుకు 2,500 లీటర్లతో సరిపెడుతున్నారు. ఇలా గత పాలకులు, అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కారణంగా డెయిరీ మూతబడే స్థాయికి చేరుకుంది.  

డెయిరీ పరిస్థితిఇబ్బందిగానే ఉంది
జిల్లాలో ఏపీ డెయిరీ పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. ఇక్కడ పనిచేసిన అధికారులు పద్ధతి ప్రకారం ముందుకుపోయినట్లు కనిపించలేదు. వైఎస్సార్‌ కడప జిల్లా డీడీగా ఉన్న నాకు చిత్తూరు, అనంతపురం బాధ్యతలు ఇచ్చినందున అన్ని చూసుకునేందుకు సమయం చాలడం లేదు. వైఎస్సార్‌ కడప, చిత్తూరు జిల్లాల్లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి లేదు. అన్నీ చక్కదిద్దడంతో కొంత ఆలస్యమైనా రైతులకు చెల్లింపులు జరుగుతున్నాయి. పాల సేకరణ కూడా పెరుగుతోంది. సాధ్యమైనంత మేరకు డెయిరీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.  – జీకే శ్రీనివాసులు, ఇన్‌చార్జి డీడీ   

బాబు పుణ్యమా అంటూ నష్టాల బాట
2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ డెయిరీని పూర్తిగా విస్మరించారు. దీంతో రోజురోజుకూ డెయిరీ పతనావస్థకు చేరుకుంది. ఒక్కో బీఎంసీ మూత పడుతూ 36 బీఎంసీలు, 58 పాలరూట్లు, 420 పాల సేకరణ కేంద్రాలు మూతబడ్డాయి. ప్రస్తుతం 6 బీఎంసీలు, 16 రూట్లు, 120 పాల సెంటర్లు మత్రమే నడుస్తున్నాయి. ఇక రోజువారీగా 560 మంది రైతుల నుంచి నామమాత్రంగా 2,500 లీటర్ల మేర పాలు సేకరిస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో నిర్వహణ భారం భారం పెరిగిపోయి నెలకు రూ.10 లక్షలకు పైగా నష్టం వస్తున్నట్లు డెయిరీ అధికారులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement