సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలు పార్టీ శ్రేణులను తీవ్ర నిరాశ, నిస్పృహల్లోకి నెట్టాయి. పార్టీ అధినేత మానసికంగా అందరినీ బలోపేతం చేయాల్సింది పోయి బేలగా మాట్లాడటంపై నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ‘నాకు ఇవే చివరి ఎన్నికలు, మీరు నన్ను గెలిపించండి’ అంటూ కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. దీంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో అంతంత మాత్రంగా ఉన్న పార్టీ కేడర్ పూర్తిగా డీలా పడింది.అధికారంలో ఉన్నన్నాళ్లూ వాడుకుని.. ఇప్పుడేమో ఇవే చివరి ఎన్నికలంటూ అందరినీ ఊబిలోకి నెట్టారని అనంతపురం జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత వాపోయారు. అధినేతే ఇలా డీలా పడిపోతే మా పరిస్థితి ఏంటని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి ఏమని వెళ్లాలి?..
‘టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలంటూ పార్టీ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి చేకూర్చాం... ప్రస్తుత ప్రభుత్వమేమో వాళ్లూ వీళ్లూ అని చూడకుండా ప్రతి గ్రామంలోనూ 95 శాతం మందికి అన్ని పథకాలూ వర్తింపచేసింది. ఈ పరిస్థితుల్లో ఏమి చెప్పి ప్రజల్లోకి వెళ్లాల’ని టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులు తెల్లమొహం వేస్తున్నారు. పింఛన్లు, చేదోడు, అమ్మ ఒడి, రైతు భరోసా, వాహనమిత్ర ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా వైఎస్సార్‌సీపీ వారే కాదు కొన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలకే ఎక్కువగా లబ్ధి జరిగింది. దీంతో తాము పల్లెల్లోకి వెళితే.. నిరసన తప్పదని నాయకులు అంటున్నారు.
గడప గడపలోనే స్పష్టత..
జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు గడప గడపకూ తిరుగుతున్నారు. ఏ ఇంటికి ఎంత లబ్ధి జరిగిందో ఆధారాలతో సహా తీసుకుని వెళుతున్నారు. మూడున్నరేళ్ల తర్వాత ప్రజల్లోకి వెళుతున్నా ఎక్కడా ఇసుమంత నిరసన లేదు. దీంతో టీడీపీ నాయకుల్లో భయాందోళన మొదలైంది. మనం ఎన్ని రకాలుగా గిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని లోలోపల మదనపడుతున్నారు. ఉన్న దానికీ లేనిదానికీ బురద జల్లినా అది మనకే అంటుకుంటోందన్న అభిప్రాయంలో ఉన్నారు.
అప్పుడే కుమ్ములాటలు..
ఎన్నికలకు ఏడాదిన్నర ఉండగానే అప్పుడే తెలుగు తమ్ముళ్లు తన్నుకుంటున్నారు. మొన్న కళ్యాణదుర్గం నియోజకవర్గ సమావేశంలో ఇదే జరిగింది. కదిరిలో ఇప్పటికీ రెండు వర్గాల మధ్య రోజూ రచ్చ జరుగుతోంది. ధర్మవరంలో సూరి టీడీపీలోకి ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. మడకశిరలో ఎవరు అభ్యర్థో తెలియదు. కళ్యాణదుర్గంలో రెండు వర్గాలు కత్తులు దూసుకుంటున్నాయి. శింగనమలలో ఎవరు అభ్యర్థో స్పష్టత లేదు. అనంతపురంలో ప్రభాకర్ చౌదరిపై మరో వర్గం నిప్పులు చెరుగుతోంది. రాయదుర్గంలో కాలవ శ్రీనివాసులు మాటలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. రాప్తాడులో పరిటాల సునీతకు వ్యతిరేకంగా మరో వర్గం కసిగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా అటు సత్యసాయి, ఇటు అనంతపురం జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment