సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఎంసెట్–2018) నేటి (ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఈ పరీక్షకు హైదరాబాద్ సహా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో మొత్తం 137 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ ఇంజనీరింగ్, 25వ తేదీన అగ్రికల్చర్, డెంటల్ కోర్సుల ప్రవేశ పరీక్ష జరగనుంది. ఎంసెట్–2018కు మొత్తం 2,76,058 మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 1,99,332 మంది ఇంజనీరింగ్, 76,726 మంది అగ్రికల్చర్, మెడికల్ విభాగాల విద్యార్థులు ఉన్నారు.
ఎంసెట్ కోడ్‌ను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ఉదయం 8 గంటలకు కాకినాడ జేఎన్‌టీయూలో విడుదల చేస్తారని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు చెప్పారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలను సులువుగా గుర్తించేందుకు వీలుగా వారి హాల్‌టిక్కెట్ల వెనుక గూగుల్ మ్యాప్ సమాచారం పొందుపరిచామని తెలిపారు. పరీక్షా కేంద్రం, పరీక్ష తేదీ, సమయం తదితర వివరాలను హాల్‌టిక్కెట్లపై ముద్రించామని, ఏ రోజు ఏ స్లాట్ కేటాయించారో అదే సమయానికి విద్యార్థులు పరీక్షకు హాజరు కావాలని సూచించారు.
ఏమేం తీసుకెళ్లాలంటే...
ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు తమతోపాటు హాల్‌టిక్కెట్, బాల్‌పాయింట్ పెన్, ఎంసెట్ దరఖాస్తు, ఎస్సీ, ఎస్టీలైతే కుల ధ్రువీకరణ పత్రం తీసుకెళ్లాలి. కాలిక్యులేటర్లు, సెల్‌ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. శరీరంపై గోరింటాకు, టాటూలు వంటివి వేసుకోరాదు. పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా హాల్‌లోకి అనుమతించరు. పరీక్షకు ముందు బయోమెట్రిక్ యంత్రాల్లో విద్యార్థుల వేలిముద్రలను నమోదు చేస్తారు. పరీక్ష తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో జరుగుతుంది. విద్యార్థులు ఆయా ప్రశ్నలకు సరైన జవాబును టిక్ చేసి సేవ్ చేయాలి. టిక్ చేసిన జవాబుపై సందిగ్ధం ఉంటే మరోసారి సరైన జవాబును గుర్తించి సేవ్ చేసుకోవచ్చు. పరీక్ష ముగిసేదాకా ఎవరినీ బయటకు అనుమతించరు.
ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ
ఉర్దూ మాధ్యమంలో ఎంసెట్ రాయనున్న 67 మందికి కర్నూలులో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశామని ప్రొఫెసర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఎంసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంటుందని చెప్పారు. ఇతర సమాచారం కోసం 0884–2340535, 0884–2356255 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. ఎంసెట్ ర్యాంకులను మే 5వ తేదీన ప్రకటించే అవకాశం ఉందన్నారు.
ఎంసెట్–2018 కేంద్రాలు ఇవే..
శ్రీకాకుళం, రాజాం, టెక్కలి, విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం, ఆనందపురం, గాజువాక, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, విజయవాడ, మైలవరం, కంచికచర్ల, మచిలీపట్నం, గుడ్లవల్లేరు, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల, ఒంగోలు, మార్కాపురం, చీరాల, నెల్లూరు, కావలి, గూడూరు, చిత్తూరు, పుత్తూరు, తిరుపతి, మదనపల్లి, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, అనంతపురం, గుత్తి, హిందూపురం, పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్, నాచారం, సికింద్రాబాద్.
Comments
Please login to add a commentAdd a comment