![AP Government Appoints MInisters Sub Committee For Review Policies - Sakshi](/styles/webp/s3/article_images/2019/06/26/YS-JAGAN-CM.jpg.webp?itok=CzRo3B4r)
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పాలసీలు, ప్రాజెక్టులను సమీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఐదుగురు మంత్రులు, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారితో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, నీటిపారుదల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ఐటీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డితోపాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్‌సింగ్ ఈ కమిటీ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర విభజన అనంతరం గత ప్రభుత్వం హయాంలో జరిగిన నిర్ణయాలు, పాలసీలు, చేపట్టిన ప్రాజెక్టులు, ఏర్పాటైన సంస్థలపై ఈ కమిటీ సమీక్ష చేయనుంది. దాదాపు 30 అంశాలపై ఈ కమిటీ అధ్యయనం చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
పాలనలో పారదర్శకత, అవినీతి రహిత పాలన, ప్రజాప్రయోజనాలకు పెద్దపీట వేసేదిశగా ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించి గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, అవకతవకలు, అవినీతిపై లోతుగా అధ్యయనం చేయనుంది. సమీక్ష అనంతరం నివేదికతోపాటు భవిష్యత్‌లో చేపట్టాల్సిన చర్యలపైనా కమిటీ సలహాలు, సూచనలు ఇవ్వాలని ఇవ్వనుంది. ఆరువారాల్లో సమీక్ష పూర్తి చేసి..నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. ఈ కమిటీ ఏర్పాటుతో పరిపాలనపరంగా మరో కీలక ముందడుగువేసినట్టు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment