జీవో 398 రద్దు!
* ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ
* రిజిస్ట్రేషన్లకు తొలగనున్న ఆటంకాలు
* కొనుగోలుదారులు, స్థిరాస్తి వ్యాపారులకు ఊరట
సాక్షి, హైదరాబాద్: యజమానుల స్థిరాస్తి విక్రయ హక్కులను హరించే జీవో 398 రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయించింది. ప్రజలకు ఇబ్బందికరంగా మారిన ఈ జీవోను రద్దు చేసి పాత విధానంలోనే భూములు, స్థలాల రిజిస్ట్రేషన్లు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని సీఎం కార్యదర్శి సాయిప్రసాద్ ఆదేశించారు. వ్యవసాయ భూములకు రెవెన్యూ అధికారుల సబ్ డివిజన్ నివేదిక, వ్యవసాయేతర ఖాళీ స్థలాలకు లేఅవుట్ అప్రూవల్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు చేయాలంటూ నవంబర్ 28వ తేదీన జారీ చేసిన చీకటి జీవో 398 తీవ్ర వివాదం రేపటం విదితమే.
దీనివల్ల ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. జీవోకు వ్యతిరేకంగా మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడంతోపాటు దీన్ని రద్దు చేయాలంటూ ప్రజాప్రతినిధులు, సబ్ రిజిస్ట్రార్స్ సంఘం, స్థిరాస్తి వ్యాపారుల సంఘం ప్రతినిధులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. జీవో రద్దు చేయాలంటూ అధికార పక్షానికి చెందిన ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలోఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో జీవోను రద్దు చేస్తామని ప్రకటించిన సీఎం దీనిపై సమీక్షించాలని సాయిప్రసాద్‌ను ఆదేశించారు. దీంతో ఈ అంశంపై స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో సాయిప్రసాద్ సమీక్షించారు.
ఈ జీవోవల్ల అమ్మకందారులు, కొనుగోలుదారులు ఇబ్బందిపడుతున్న విషయం వాస్తవమేనని, రిజిస్ట్రేషన్లు ఆగిపోవడంవల్ల రాబడి కూడా పడిపోయిందని అధికారులు వివరించారు. ఆరోగ్య కారణాల వల్ల రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్పీ సింగ్ ఈ సమావేశానికి హాజరు కాలేదు. ఒకటి రెండు రోజుల్లో జీవో రద్దుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. జీవో రద్దయితే లేఅవుట్ అప్రూవల్‌లేని ఖాళీ స్థలాల రిజిస్ట్రేషన్లకు అవరోధం తొలగిపోనుంది. కొనుగోలు అగ్రిమెంటు చేసుకుని ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఊరట కలిగించనుంది.