
సాక్షి, అమరావతి: అమరావతి ప్రాంతవాసులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రెండు ప్రాంతాల వారితో రెండు రకాలుగా మాట్లాడిస్తూ ఊసరవెల్లిలా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు వలలో పడవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజల్లో భూములిచ్చిన రైతులు కూడా ఉన్నారని, అందరి సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని బొత్స చెప్పారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నానితో కలిసి సీఆర్‌డీఏ కార్యాలయంలో గురువారం రాత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు అప్పులు తెచ్చి డాబుల కోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా వృథా చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు’ అని బొత్స అన్నారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్ ఆకాంక్ష
‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం వైఎస్ జగన్ ఆకాంక్ష. మూడు చోట్ల రాజధానుల ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందనేది కేబినెట్ నిర్ణయం తర్వాత పరిశీలిస్తాం. మంత్రివర్గ సమావేశంలో చర్చించి రైతులకు ఇచ్చిన హామీల అమలుతోపాటు అన్ని విషయాలు ప్రకటిస్తాం. రూ.1.09 లక్షల కోట్లతో రాజధాని పనులు చేస్తామని అంచనాలు ప్రకటించి రాష్ట్రం అప్పులను రూ.50 వేల కోట్ల నుంచి రూ. 2.50 లక్షల కోట్లకు చంద్రబాబు పెంచేశారు. విశాఖ తరహాలో ఇక్కడ (అమరావతి) కూడా ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం. చంద్రబాబులా మేం గ్రాఫిక్స్‌తో మోసం చేయం’ అని బొత్స స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment